Begin typing your search above and press return to search.

ట్రిపుల్ ఆర్ ఫెయిల్యూర్ పొలిటీషియన్...ఎందుకలా ?

ట్రిపుల్ ఆర్ అనబడే రఘురామ క్రిష్ణం రాజు గత ఐదారేళ్లుగా వెరీ పాపులర్ అయ్యారు. ఆయనకు ఒక సీఎం స్థాయిలో ఆదరణ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా దక్కింది

By:  Satya P   |   3 Oct 2025 9:09 AM IST
ట్రిపుల్ ఆర్ ఫెయిల్యూర్ పొలిటీషియన్...ఎందుకలా ?
X

ట్రిపుల్ ఆర్ అనబడే రఘురామ క్రిష్ణం రాజు గత ఐదారేళ్లుగా వెరీ పాపులర్ అయ్యారు. ఆయనకు ఒక సీఎం స్థాయిలో ఆదరణ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా దక్కింది. దానికి ఆయన బయటకు చెప్పకపోయినా మనసులో మాత్రం థాంక్స్ టూ జగన్ అని అనుకోవాల్సిందే. అవును జగన్ మీద ఒక్క మాట కూడా అనలేని స్థితులలో ఆయన మొదట ధైర్యంగా ముందుకు వచ్చారు. జగన్ 151 సీట్లతో గద్దెనెక్కిన తరువాత ఆ తిరుగులేని మెజారిటీ ముందు ఆయన ప్రభంజనం ముందు చాలా మంది మౌనం వహించారు మరో రెండు టెర్ములు రాజకీయ ఊసు మరచిపోవడం బెటర్ అనుకున్నారు. అయితే ఆ సమయంలోనే ట్రిపుల్ ఆర్ జగన్ కి వ్యతిరేకంగా గొంతు విప్పారు. తీరా చూస్తే ఆయన వైసీపీలో ఎంపీగా ఉన్నారు.

తెర చాటు నుంచి ముందుకు :

రఘురామ క్రిష్ణంరాజు కాంగ్రెస్ రాజకీయాల్లో తెర చాటుగా ఉంటూ వచ్చారు. ఆయనకు వైఎస్సార్ సహా రాజకీయ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే ఆయన 2014లో టీడీపీ టికెట్ ని ఆశించారు. కానీ దక్కలేదు. 2019 నాటికి వైసీపీలో చేరి టికెట్ పొందారు తాను కోరుకున్న నరసాపురం నుంచి ఎంపీ అయ్యారు. తొలి ఆరు నెలలలోనే జగన్ తో ఆయనకు చెడింది. అంతే అక్కడ నుంచి ఆయన ఢిల్లీ వేదికగా రచ్చ బండ పేరుతో ప్రతీ రోజూ ఒక భారీ ప్రోగ్రాం నే నడిపారు. అలా జగన్ మీద నెగిటివిటీకి బీజం వేసింది ఆయనే అని గుర్తింపు తెచ్చుకున్నారు.

ట్రిపుల్ ఆర్ ఎవరు పెట్టారంటే :

ఇక రఘురామ అని మీడియా ఆయన పేరుని షార్ట్ కట్ చేసి పిలిచేది. అయితే ట్రిపుల్ ఆర్ అని తరువాత కాలంలో బాగా పాపులర్ అయింది. ఇంతకీ ఆ పేరు పెట్టింది ఎవరు అంటే టాలీవుడ్ దర్శకుడు రాం గోపాల్ వర్మనట. ఆయన రఘురామ మీద ఒక ట్వీట్ చేస్తూ ట్రిపుల్ ఆర్ అని ఫస్ట్ కోట్ చేశారు అని అంటున్నారు. దాంతో అది చాలా వేగంగా జనంలోకి వెళ్ళి సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా క్యాచ్ చేసింది అని రఘురామ తాజాగా గుర్తు చేసుకున్నారు.

ఆర్జీవీ ఇంటర్వ్యూ స్పెషల్ :

ఇదిలా ఉంటే ట్రిపుల్ ఆర్ ని ఆర్జీవీ తాజాగా ఇంటర్వ్యూ చేశారు. ఇపుడు అది నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో చాలా విషయాలు రఘురామ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ ని అని చెప్పుకున్నారు తన రాజకీయ జీవితంలో సాధించింది ఏదీ లేదని కూడా చెప్పారు. తాను ఎంపీగా గెలిచిన తొలి ఆరు నెలలు బాగా ఉందని ఆ తరువాత తన సొంత నియోజకవర్గం కూడా వెళ్ళలేని పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది అన్నారు. ఇక తనకు 2024 ఎన్నికల్లో కూడా చివరి దాకా టికెట్ దక్కలేదని ఆయన గుర్తు చేశారు.

పదవులు పోయాయ్ :

తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాను అని అందుకే పదవులు పోయాయని అన్నారు. వైసీపీ హయాంలో తనకు దక్కిన పార్లమెంటరీ చైర్మన్ పదవిని కూడా లేకుండా చేశారు అన్నారు. తన మీద అనర్హత వేటు వేయించాలని చూశారని అన్నారు ఇక తనను కస్టడీలోకి తీసుకుని నరకం చూపించారని అయితే అది తనకు ఒక విధంగా పునర్జన్మగా భావిస్తాను అని ఆయన అన్నారు. ఆనాడే తనలో కసి పెరిగిందని అందుకే రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నాను అన్నారు.

ఉచితాలు ఓట్లు తేవు :

ఉచిత పధకాలు ఓట్లు తేవు అని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో రెండు సార్లు వరసగా సీఎం అయిన యోగీ ఆదిత్యనాధ్ ఒక్క ఉచిత పధకం ఇవ్వలేదని అన్నారు. మూడు నాలుగు సార్లు ఒడిషాలో సీఎం గా గెలిచిన నవీన్ పట్నాయక్ కూడా ఉచిత పధకాలు ఇవ్వలేదని ఆయన అన్నారు. ప్రజలు ఉచితాలకు ఓట్లు వేస్తారు అన్నది ఒక అపోహ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలతో ముందుకు వెళ్తున్న వేళ రఘురామ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.