రాఘవ్ చద్దాకు బీజేపీ బంపర్ ఆఫర్.. కేంద్రంలో కీలక పదవి
దేశ రాజకీయాల్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
By: Tupaki Political Desk | 23 May 2026 9:00 PM ISTదేశ రాజకీయాల్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొద్దిరోజుల క్రితం వరకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించిన రాఘవ్ చద్దా ఇటీవల అనూహ్యంగా కమలం గూటికి చేరిన సంగతి తెలిసిందే. అయితే, పార్టీ మారిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దాకు కేంద్రం నుంచి ఊహించని పదవి లభించింది. త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఆయనకు మంత్రిగా ప్రమోషన్ ఇస్తారని ఊహాగానాలు షికారు చేస్తుండగానే, ఎవరూ ఊహించని విధంగా రాఘవ్ చద్దాకు రాజ్యసభలో అత్యంత కీలకమైన పదవిని కేంద్రం కట్టబెట్టింది.
రాజ్యసభలో కీలకమైన పిటిషన్ల కమిటీ చైర్మన్‌గా రాఘవ్ చద్దా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీని పునర్‌వ్యవస్థీకరించిన అనంతరం సభలో 10 మంది సభ్యులను నామినేట్ చేయడమే కాకుండా, కమిటీ పగ్గాలను రాఘవ్ చద్దాకి అప్పగించారు. అయితే ఈ నియామకంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు. ఆప్ నుంచి బీజేపీలోకి మారినందుకు దక్కిన రివార్డ్ ఇదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
పిటిషన్ల కమిటీ ప్రాధాన్యత ఏంటి?
కాగా, రాఘవ్ చద్దాకు కేంద్ర కేటాయించిన పదవి ప్రాధాన్యత ఏంటి అన్న చర్చ కూడా ఎక్కువగా జరుగుతోంది. పార్లమెంటరీ కమిటీల్లో పిటిషన్ల కమిటీకి ప్రత్యేక స్థానం ఉందని అంటున్నారు. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు, ప్రజా సమస్యలపై వచ్చే పిటిషన్లను ఈ కమిటీ పరిశీలిస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలిచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిస్తుందని వివరిస్తున్నారు. ఇంతటి బాధ్యతాయుతమైన పదవిని కొత్తగా చేరిన యువ నేతకు ఇవ్వడం ద్వారా బీజేపీ ఆయనపై ఎంత నమ్మకం ఉంచిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నాడు సస్పెన్షన్.. నేడు చైర్మన్.. కాలం మార్చిన కథ
గతంలో ఆప్ ఎంపీగా ఉన్న సమయంలో రాఘవ్ చద్దా కేంద్రంపై దూకుడుగా వ్యవహరించేవారు. దీంతో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఆయనను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఒకప్పుడు ఏ సభ నుంచి అయితే సస్పెండ్ అయ్యారో.. ఇప్పుడు అదే సభలో ఒక ప్రతిష్టాత్మక కమిటీకి చైర్మన్‌గా కూర్చోవడం రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిణామంగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ నియామకం బీజేపీ వ్యూహాత్మకంగా తీసుకున్న రాజకీయ చర్యగా చెబుతున్నారు. రాఘవ్ చద్దా ఇమేజ్‌ను వాడుకుని రాబోయే రోజుల్లో పంజాబ్, ఢిల్లీలలో ఆప్‌ను మరింత బలహీనపరచాలనేది బీజేపీ అసలు స్కెచ్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్రెండింగ్‌లో రాఘవ్ చద్దా
రాఘవ్ చద్దాకు పదవి దక్కడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘పార్టీ మారినందుకు మంచి గిఫ్టే దక్కింది బ్రో’ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు బీజేపీ పొలిటికల్ మేనేజ్‌మెంట్‌ను మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా ఆప్ వాయిస్‌గా ఉన్న రాఘవ్ చద్దా ఇకపై రాజ్యసభలో కమలదళం తరఫున ఎలా చక్రం తిప్పుతారో చూడాలని అంటున్నారు.
