ఒక ఘట్టం ముగిసింది.. మోడీ ముందు మరిన్ని!
దీంతో ఒక పెద్ద క్రతువును ప్రధాని మోడీ సునాయాసంగా పూర్తి చేశారు. మరి వాట్ నెక్ట్స్? అనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వచ్చింది.
By: Garuda Media | 12 Sept 2025 7:00 PM ISTకేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో తాజాగా కీలక ఘట్టం ముగిసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికతో పాటు.. నూతన ఉపరాష్ట్రపతిగా తమిళనాడుకు చెందిన చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం వరకు.. అన్నీ సజావుగానే సాగిపోయాయి. తాజాగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. సీపీ రాధాకృష్ణన్‌తో ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగం పట్ల సంపూర్ణ విశ్వాసం, విధేయతతో వ్యవహరిస్తానని, రాజ్యాంగం, చట్టాలకు లోబడి విధులు నిర్వర్తిస్తానని సీపీ రాధాకృష్ణన్.. ప్రమాణంచేసి.. సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు.
దీంతో ఒక పెద్ద క్రతువును ప్రధాని మోడీ సునాయాసంగా పూర్తి చేశారు. మరి వాట్ నెక్ట్స్? అనే ప్రశ్న సహజంగానే తెరమీదికి వచ్చింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి.. జస్టిస్ యశ్వంత్ వర్మను పదవీచ్యుతుడిని చేయడం తదుపరి అంశం. అయితే.. ఈ విషయంలో క్రెడిట్ విపక్షాలకు దక్కకుండా వ్యవహరించడం.. ప్రస్తుత ఉపరాష్ట్రప తి, రాజ్యసభ చైర్మన్‌గా సీపీ రాధాకృష్ణన్‌ముందున్న కీలక కార్యక్రమం. ఈ విషయంలో విభేదించిన కారణంగానే.. గత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ను ఆ పదవి నుంచి తప్పించారన్న వాదన ఉంది.
ఇదేసమయంలో రాజ్యసభలో విపక్షాల ప్రాధాన్యాన్ని దాదాపు తగ్గించడం కూడా ఇప్పుడు రాధాకృష్ణన్ ముందున్న కీలక చర్యగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుత ఎన్డీయే కూటమికి.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి కూడా.. రాజ్యసభలో దాదాపు సరిసమాన బలం ఉంది. స్వల్ప సంఖ్యలో మాత్రమే.. ఎన్డీయే కూటమికి బలం ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా.. ఇండియా కూటమి గళాన్ని తగ్గించడం ద్వారా కీలక బిల్లులను ఆమోదించుకునేందుకు మోడీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా.. రాధాకృష్ణన్ ముందున్న కీలక చర్యేనని అంటున్నారు పరిశీలకులు.
ఇక, ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తయిన నేపథ్యంలో మోడీ ముందున్న మరోకీలక అంశం.. తమిళనాడు ఎన్నికలు. ఆ రాష్ట్రానికే చెందిన రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా.. పైగా కీలక సామాజిక వర్గం గౌండర్‌వర్గానికి చెందిన రాధాకృష్ణన్‌కు కీలక పదవిని దక్కేలా చేసిన నేపథ్యంలో దీనిని రాజకీయంగా వినియోగించుకుని.. అక్కడ విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంది. దీనిలో సక్సెస్ అయితే.. తమిళనాట బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నది లక్ష్యం. మొత్తంగా రాధాకృష్ణన్ ఎన్నికల పరిపూర్ణమైనా.. దీనికి అనుబంధంగా ఉన్న మరిన్ని అంశాలు.. మోడీ ముందున్నాయని అంటున్నారు పరిశీలకులు.
