ఏకగ్రీవాలపై వైసీపీ సెటైర్లు - కరోనా పాస్ అంటున్న రాచమల్లు
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే దేశంలో అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా? అనే అనుమానం కలుగుతోందని రాచమల్లు ఆవేదన వ్యక్తం చేశారు.
By: Tupaki Political Desk | 28 Oct 2026 8:00 PM ISTస్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యంగా ఏకగ్రీవ ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. కూటమి నాయకులు ప్రణాళికాబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన వారిని తాము ప్రజాప్రతినిధులుగా గుర్తించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన వారిని కరోనా కౌన్సిలర్లు అంటూ పేరు పెట్టారు.
ఏకగ్రీవ ఎన్నికలపై మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్థులందరినీ ప్రభుత్వం ఎలాగైతే పాస్ చేసిందో.. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూడా అచ్చం ఆ నాటి విద్యా రంగ రిజల్ట్స్‌నే గుర్తుకు తెస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఏకంగా 36 మంది కౌన్సిలర్ల నామినేషన్లను తిరస్కరించడం ద్వారా, ఎన్నికలు జరుగకుండానే అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారని ఆయన మండిపడ్డారు. పోటీ చేయనీయకుండా నామినేషన్లను అడ్డుకుని సాధించిన ఈ విజయాలను ఎవరూ నమ్మే స్థితిలో లేరని పేర్కొంటూ, ఇకపై వీరందరినీ 'కరోనా కౌన్సిలర్లు' అంటూ ముద్దుగా పిలుస్తామని ఎద్దేవా చేశారు. ఇది ఒక్క ప్రొద్దుటూరుకే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఆయన ఆరోపించారు.
ప్రజాస్వామ్యంపై తీవ్ర ఆవేదన:
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే దేశంలో అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా? అనే అనుమానం కలుగుతోందని రాచమల్లు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులను ప్రజలు ఎన్నుకుంటున్నారా? లేక ప్రజలు ఓట్లు వేయాలా? వద్దా? అనేది పాలకులే నిర్ణయిస్తున్నారా? అని ప్రశ్నించారు. వ్యవస్థల వెన్నెముకను పూర్తిగా విరిచేశారని, ప్రజాస్వామ్య విలువలు కనుమరుగవుతున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ అందుకు విరుద్ధంగా వారు ప్రవరిస్తే సామాన్యులు ఎవరిని ఆశ్రయించాలని రాచమల్లు నిలదీశారు. ఐఏఎస్, ఐపీఎస్, తహశీల్దార్, ఎంపీడీవో, డీఎస్పీ, సీఐ, ఎస్ఐ తదితరత్రా ఉన్నత ఉద్యోగాల కోసం యువత ఎందుకు కష్టపడి చదవాలని ఆయన ప్రశ్నించారు. అధికారులంతా అమ్ముడుపోయి, ఓటర్ల తీర్పును గంపగుత్తగా తాకట్టు పెట్టారని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
వైసీపీ సీరియస్
రాష్ట్రంలో ఏకగ్రీవ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందని అంటున్నారు. దీనికి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని చెబుతున్నారు. రాచమల్లుతోపాటు రాయలసీమకు చెందిన చాలా మంది నేతలు ఈ విషయమై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 17 చైర్మన్ స్థానాలను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకోగా, అవన్నీ బలవంతంగా దక్కించుకున్నవే అంటున్నారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత ఇలాకాలోనూ మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో బలప్రయోగం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. తమ పార్టీ నేతలతో నామినేషన్ కూడా వేయనీయకుండా అడ్డుకున్నారని వైసీపీ సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రజలు ఓటు వేయకుండా గెలిచిన వారిని ప్రజాప్రతినిధులుగా గుర్తించమని చెప్పడమే కాకుండా, కరోనా కౌన్సిలర్లు అంటూ వింత పేర్లు పెడుతూ హేళన చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
