వైసీపీ కంచుకోటని మంచుకోటని చేసే పనిలో బాబు !
జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నుంచి వేరు పడి సొంత పార్టీ పెట్టాక ఆయన వెన్నంటి ఉన్నది రాయలసీమ ప్రాంతం.
By: Satya P | 6 Sept 2025 9:33 AM ISTవైసీపీకి అండగా నిలిచిన ప్రాంతం రాయలసీమ. అలాగే ఒక బలమైన సామాజిక వర్గం. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ నుంచి వేరు పడి సొంత పార్టీ పెట్టాక ఆయన వెన్నంటి ఉన్నది రాయలసీమ ప్రాంతం. అలాగే బలమైన సామాజిక వర్గం. అందుకే 2014లో వైసీపీ ఓటమి పాలు అయినా 67 అసెంబ్లీ సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా అసెంబ్లీలో నిలిచింది. ఇక 2019లోనూ రాయలసీమ మొత్తం జగన్ వైపు ఉండి వైసీపీ చెయ్యెత్తి జై కొట్టింది. ఫలితంగా మొత్తం రాయలసీమలోని నాలుగు జిల్లాలలో ఉన్న 52 అసెంబ్లీ సీట్లకు గానూ టీడీపీకి మూడంటే మూడు దక్కితే 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఇంతలా ఒక రాజకీయ పార్టీ పెర్ఫార్మ్ చేసింది గతంలో అయితే లేదు.
దెబ్బకు కుదేలు :
అయితే 2024 నాటికి చూస్తే సీమ జిల్లాకు మొత్తం వైసీపీకి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాయి. అలాగే వైసీపీనే నమ్ముకుని రెండు సార్వత్రిక ఎన్నికల్లో బలంగా నిలబడిన ఒక కీలక సామాజిక వర్గం సైతం మాకెందులు లెమ్మని పట్టనట్లుగా ఉండిపోయింది. దీంతో రాయలసీమలోని మొత్తం సీట్లలో ఏడంటే ఏడు మాత్రమే వైసీపీకి దక్కాయి. అలా కూటమి దెబ్బకు ఫ్యాన్ పార్టీ ఒక్క లెక్కన కుదేల్ అయిపోయింది.
పెరిగిన టీడీపీ :
మరో వైపు చూస్తే కాంగ్రెస్ హయాంలోనూ ఇంకా చెప్పాలంటే వైసీపీ పుట్టాక గెలవని సీట్లలోనూ 2024 ఎన్నికల్లో గెలిచి సత్తా చాటింది. దాంతో టీడీపీకి సీమలో గ్రాఫ్ బాగా పెరిగింది. దానిని పదిలపరచుకునే పనిలో అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారు. రాయలసీమలో కనుక వైసీపీ కూసాలు కదిలిస్తే మాత్రం 2029లోనూ అద్భుతమైన విజయాలు టీడీపీ కూటమికి దక్కుతాయని లెక్క వేస్తున్నారు. నిన్నటి దాకా వైసీపీ వెంట ఉంటూ అన్ని విధాలుగా అండగా నిలిచిన ఒక బలమైన సామాజిక వర్గాన్ని సైతం ఆకట్టుకునే పనిలో టీడీపీ ఉంది. ఇందులో చాలా వరకూ సక్సెస్ అయింది.
కడపలో మహానాడుతో :
ఇక కడపలో మహానాడుని టీడీపీ అత్యంత గ్రాండ్ గా నిర్వహించి జగన్ ఇలాకాలో తన తడాఖా చూపించింది. ఇక లేటెస్ట్ గా చూస్తే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో గెలిచి వైసీపీని పూర్తిగా చతికిలపడేలా చేసింది. ఇపుడు రెట్టించిన ఉత్సాహంతో రాయలసీమ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది. తాజాగా చూస్తే కనుక ఈ నెల 10న అనంతపురంలో సూపర్ సిక్స్ విజయోత్సవాలను నిర్వహించాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. ఇక్కడ ఈ విజయోత్సవ సభను నిర్వహించడం ద్వారా రాయలసీమ మొత్తం కూటమి సక్సెస్ ని రీ సౌండ్ తో వినిపించాలని బాబు మాస్టర్ ప్లన్ నే వేశారు అని అంటున్నారు.
వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ లో హవా :
ఈ రోజున చూస్తే వైసీపీకి జగన్ సొంత జిల్లా కడపలోనే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని అంటున్నారు. అనంతపురంలో చూస్తే టీడీపీ ఏకపక్షంగానే విజయాలు సాధిస్తోంది. అలాగే కర్నూల్, చిత్తూరు లో కూడా తన పట్టుని పెంచుకుంటూ వస్తోంది. వరసగా చంద్రబాబు లోకేష్ రాయలసీమ జిల్లాలలో పర్యటనలు చేస్తూ వస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. బనకచర్ల ద్వారా సాగు నీటిని ఇస్తామని శాశ్వతంగా కరవు లేకుండా చూస్తామని చెబుతున్నారు. హార్టీ కల్చర్ హబ్ గానూ పారిశ్రామికంగానూ రాయలసీమను నిలుపుతామని చెబుతున్నారు. ఈ విధంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమలో వచ్చే ఎన్నికల్లో తమ హవా ఇదే తీరున కొనసాగిస్తే ఫ్యాన్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందులే అన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే నిన్న కడపలో మహానాడుని నిర్వహించారు. ఈ నెల 10న అనంతపురంలో సూపర్ సిక్స్ విజయోత్సవాలకు వేదికగా ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు.
