పావు శతాబ్దంలో పదునెక్కిన తెలుగు రాజకీయం
సహస్రాబ్ది అంటూ 2000లో ఎంట్రీ ఇచ్చినపుడు అంతా కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్లుగానే భావించారు.
By: Satya P | 3 Jan 2026 9:22 AM ISTసహస్రాబ్ది అంటూ 2000లో ఎంట్రీ ఇచ్చినపుడు అంతా కొత్త లోకంలోకి అడుగు పెట్టినట్లుగానే భావించారు. ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. అయితే చూస్తూండగానే తొలి పాతికేళ్ళూ గడచాయి. ప్రస్తుతం 2026 లోకి కాలం బండి వచ్చేసింది. మలి పావు శతాబ్దానికి రాత రాసే పనిలో ఉంది. మరి తొలి పావు శతాబ్దంలో తెలుగు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఏమేమి జరిగాయి అన్నది చూస్తే కనుక చాలానే విశేషాలు కనిపిస్తాయి. ఎంతో నాయకులు కొత్తగా ఆవిర్భవించారు. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఉమ్మడి ఏపీ రెండుగా మారింది. కొత్త పార్టీలు పుట్టుకుని వచ్చాయి. నవతరం రాజకీయం చేయడం స్టార్ట్ అయింది. ఇవనీ గడచిన కాలంలో అంతా చూసిన విషయాలే.
యువ సీఎం గా బాబు :
2000 లోకి అడుగు పెట్టే వేళ ఉమ్మడి ఏపీకి తిరుగులేని యువ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆయన 1999 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. ఆయన మంత్రివర్గంలో తనకు చోటు దక్కలేదని భావించిన కే చంద్రశేఖరరావు టీడీపీ నుంచి వేరుపడి 2021 ఏప్రిల్ 27న తెలంగాణా రాష్ట్ర సమితి అనే ప్రాంతీయ పార్టీని ప్రారంభించారు. కేసీఆర్ గా ఆయన ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆ తరువాత తెలుగు రాజకీయం మేలి మలుపు తిరిగింది. 2004 నాటికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యారు. అలా రాష్ట్ర మంత్రి ఆశించిన కేసీఅర్ కేంద్ర మంత్రి కావడం ఒక చరిత్ర అయితే ఉప ఎన్నికలు తెస్తూ బలం పెంచుకుంటూ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని పరిమితమైన సీట్లకే టీఆర్ఎస్ తగ్గాల్సి వచ్చింది.
వైఎస్సార్ మార్క్ :
ఇక ఇదే కాలంలో 2004లో ఉమ్మడి ఏపీకి సీఎం అయిన వైఎస్సార్ అయిదుంపావు ఏళ్ళ పాటు పాలించారు. రెండు సార్లు సీఎం అయ్యారు. ఆయన హయాంలో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అంతకు ముంచు పీసీసీ చీఫ్ గా వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో పాదయాత్ర నిర్వహించి తెలుగు నాట దానికి సరికొత్త రాజకీయ వ్యూహంగా పరిచయం చేశారు. ఆయన మరణానంతరం రాజకీయాలు వేగంగా మారాయి. కేసీఆర్ అమరణ దీక్ష చేయడం కేంద్రం 2009 డిసెంబర్ 9న ప్రకటించడం జరిగిపోయాయి. ఆ తర్వాత 2014లో అయితే తెలంగాణా కల సాకారం అయింది కూడా. ఈ పావు శతాబ్దంలో తెలుగు నాట వచ్చిన అతి పెద్ద ప్రాంతీయ మార్పుగా దీనిని చూడాల్సి ఉంది.
కేసీఆర్ శకంగా :
తెలంగాణా రాజకీయాల్లో కేసీఆర్ తనదైన శకాన్ని సృష్టి చేసుకోగలిగారు. ఆయన రాదు అనుకున్న తెలంగాణాను పంటి బిగువున పోరాడి సాధించారు. 2014, 2018లలో రెండు సార్లు తెలంగాణా సీఎం గా చేసినా 2023 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఇప్పటికీ తెలంగాణా రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకమైన ప్రతిపక్షంగా ఉంది అంటే కేసీఆర్ ఆ పార్టీని తీర్చిదిద్దిన విధానమే అని అంటారు.
మెగాస్టార్ రాజకీయం :
ఇక సినీ నటుడిగా మకుటం లేని మహరాజుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. 2009లో పోటీ చేస్తే 18 సీట్లు, 70 లక్షల ఓట్లు ఆయనకు దక్కడం గొప్ప విషయంగానే ఉంది. ఆయన తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి అసెంబ్లీలో ప్రవేశించారు. సీఎం అవుతారనుకుంటే అంచనా తప్పింది కానీ ఆ తరువాత ఆయన రాజకీయ వ్యూహంతో ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. తన పార్టీని 2011లో కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా రాజ్యసభకు నెగ్గి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
జగన్ ఎంట్రీ అలా :
ఇక కాంగ్రెస్ ఎంపీగా తండ్రి చాటు బిడ్డగా ఉంటూ 2009లో కడప నుంచి నెగ్గిన వైఎస్ జగన్ తన తండ్రి మరణం తరువాత కాంగ్రెస్ నుంచి వేరుపడి 2011 మార్చిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం అదే ఏడాది జరిగిన కడప ఎంపీ ఉప ఎన్నికల్లో ఏకంగా అయిదున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి తెలుగు నాట కొత్త రాజకీయాన్ని చూపించారు. ఇక నాటి నుంచి వైసీపీ తెలుగు రాజకీయాల్లో కొత్త ప్రాంతీయ పార్టీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2014లో బలమైన ప్రతిపక్షంగా అవతరించినా 2017లో పాదయాత్ర చేసి 2019లో సీఎం గా అధికారాన్ని జగన్ అందుకున్నారు. ఇక 2024లో వైసీపీ ఓటమి పాలు అయినా 40 శాతం ఓటు షేర్ తో ఏపీలో బలమైన విపక్షంగా ఉంది.
రేవంత్ అనూహ్యం :
2000 తరువాత రాజకీయ అరంగేట్రం చేసిన రేవంత్ రెడ్డి మొదట జెడ్పీటీసీగా తరువాత ఎమ్మెల్సీగా 2009 నాటికి టీడీపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆ మీదట కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఇక 2023 తరువాత ఏకంగా తెలంగాణాకు రెండవ సీఎం గా గా కీలక స్థానాన్ని అందుకున్న వైనం మాత్రం స్పూర్తి దాయకం అని అంటారు. ఏ అండా లేకుండా కార్యకర్త స్థాయి నుంచి సీఎం పీఠం ద్వకా కేవలం రెండు దశాబ్దాల కాలంలో ఎదిగి వచ్చిన రేవంత్ రాజకీయ ప్రస్థానం అనూహ్యం అని చెబుతారు. ఆయన దూకుడు రాజకీయం వాగ్దాటి వ్యూహాలు అన్నీ ఈ పొజిషన్ కి తెచ్చాయని చెప్పక తప్పదు
పవన్ వ్యూహంతో :
అదే విధంగా చూస్తే సినీ రంగంలో ఉంటూ అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో యువ రాజ్యం అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ 2014 నాటికి జనసేనను స్థాపించారు. 2019లో ఒంటరిగా పోటీ చేసి ఆరేడు శాతం ఓట్లు తెచ్చుకున్న పవన్ తన వ్యూహంతో కూటమిగా టీడీపీ బీజేపీలతో జత కట్టి 2024 ఎన్నికల్లో అధికారంలో భాగస్వామి అయ్యారు. అలా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్నారు.
వారసులు ఎందరో :
ఇదిలా ఉంటే ఈ పాతికేళ్ళ తెలుగు రాజకీయాల ప్రస్థానంలో వారసుల హవా కూడా బాగానే ఉంది. కేటీఆర్ కేసీఆర్ కుమారుడిగా తన సత్తా చాటుతున్నారు. అలాగే ఏపీ నుంచి చంద్రబాబు కుమారుడు లోకేష్ సైతం మంత్రిగా రాణిస్తూ కాబోయే సీఎం గా అందరి దృష్టిని ఆకర్షిస్టున్నారు. జగన్ వైఎస్సార్ వారసుడిగా జనం చేత ఆమోద ముద్ర వేయించుకున్నారు. అయితే వైయస్సార్ కుమార్తె షర్మిల కేసీఆర్ కుమార్తె కవిత రాజకీయం మీద అయితే ఇంకా జనాలు ఏమీ తేల్చడం లేదు అన్నది ఉంది. రానున్న కాలంలో మరెన్ని పార్టీలు పుట్టుకుని వస్తాయో ఇంకెంతమంది నాయకులు వస్తారో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఏ కీలక మలుపులు ఉంటాయో వేచి చూడాల్సిందే
