క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ? దాంతో ఏంటి ప్రయోజనం?
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "గతంలో సిలికాన్ వ్యాలీ ఐటీ విప్లవానికి నాంది పలికితే రాబోయే రోజుల్లో క్వాంటం వ్యాలీ ప్రపంచాన్ని శాసించబోతోంది.
By: A.N.Kumar | 8 Feb 2026 6:00 PM ISTఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరికొత్త చరిత్రకు వేదికైంది. ఐటీ రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమరావతిని భవిష్యత్ టెక్నాలజీ 'క్వాంటం కంప్యూటింగ్'కు గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా అడుగులు వేశారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో దేశంలోనే మొట్టమొదటి 'అమరావతి క్వాంటం వ్యాలీ' భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌తో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
సిలికాన్ వ్యాలీ గతం.. క్వాంటం వ్యాలీ వర్తమానం!
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. "గతంలో సిలికాన్ వ్యాలీ ఐటీ విప్లవానికి నాంది పలికితే రాబోయే రోజుల్లో క్వాంటం వ్యాలీ ప్రపంచాన్ని శాసించబోతోంది. హైదరాబాద్‌కు హైటెక్ సిటీ ఎలాగో, దేశానికి అమరావతి క్వాంటం వ్యాలీ అలా గేమ్ ఛేంజర్ కానుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అమరావతిలో దేశంలోనే మొదటి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను అందుబాటులోకి తెస్తాం" అని ప్రకటించారు.
ప్రాజెక్టు ప్రత్యేకతలు:
సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ వ్యాలీ రూపుదిద్దుకోనుంది. 48 అంతస్తులు, 29 అంతస్తులతో కూడిన ఎనిమిది భారీ టవర్లను నిర్మిస్తున్నారు. ఐబీఎం , టీసీఎస్ , ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. 2030 నాటికి దేశానికి అవసరమైన 2.5 లక్షల క్వాంటం నిపుణులలో మెజారిటీ వాటా అమరావతి నుంచే ఉండేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఎందుకు ఈ క్వాంటం టెక్నాలజీ?
సాధారణ కంప్యూటర్లు సంవత్సరాల తరబడి చేసే క్లిష్టమైన లెక్కలను క్వాంటం కంప్యూటర్లు కేవలం సెకన్లలో పూర్తి చేస్తాయి. దీనివల్ల వాతావరణ అంచనాలు, క్యాన్సర్ వంటి వ్యాధులకు కొత్త మందుల తయారీ, హ్యాకింగ్‌కు గురికాని సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
అరుదైన పురస్కారం.. ₹100 కోట్ల బహుమతి!
పరిశోధనలను ప్రోత్సహించేందుకు చంద్రబాబు ఒక సంచలన ప్రకటన చేశారు. క్వాంటం టెక్నాలజీ రంగంలో ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹100 కోట్ల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అమరావతే నాలెడ్జ్ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
