షర్మిల అజ్ఞానికి ఎక్కువ.. అవివేకికి తక్కువ: బీజేపీ చీఫ్
ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తొలిసారి హాట్ కామెంట్స్ చేశారు.
By: Garuda Media | 30 Sept 2025 9:33 AM ISTఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తొలిసారి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టిన మాధవ్.. అనేక సందర్భాల్లో మీడియా ముందు మాట్లాడినా.. ఎప్పుడూ షర్మిలపై కామెంట్లు చేయలేదు. షర్మిల గురించి ప్రస్తావించలేదు కూడా. కానీ, తొలిసారి ఆయన విజయవాడలో సోమవారం మాట్లాడుతూ.. ''షర్మిల అజ్ఞానికి ఎక్కువ.. అవివేకికి తక్కువ'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఆమె మత మార్పిడిలను ప్రోత్సహిస్తున్నారని.. రాష్ట్రాన్ని క్రిస్టియానిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఏం జరిగింది?
తాజాగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు.. తిరుమల శ్రీవారి సంపదతో దేశవ్యాప్తంగా 5వేల శ్రీవారి ఆలయాలను నిర్మించే ప్రణాళిక ఉందన్నారు. తద్వారా హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయాలతో పాటు.. జీర్ణ దశలో ఉన్న మరిన్ని ఆలయాలను కూడా పునరుద్దరిస్తామని చంద్రబాబు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన.. షర్మిల.. చంద్రబాబు పూర్తిగా ఆర్ ఎస్ ఎస్ వాదిగా మారుతున్నారని చురకలు అంటించారు. అంతేకాదు.. ఆర్ ఎస్ ఎస్ అజెండాను పుణికి పుచ్చుకుని తిరుమల నిధులను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. మాధవ్.. షర్మిలపై విరుచుకుపడ్డారు. హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించే విధంగా షర్మిల వ్యాఖ్యానించారని అన్నారు. మత మార్పిడులను ఆమె తన భర్త అనిల్‌తో కలిసి ప్రోత్సహిస్తున్నా రని అన్నారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు. ''తిరుమల నిధుల ను దేవాలయాలకు కాకుండా.. చర్చిలకు ఖర్చు పెడతారా? .. ఏమైనా జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా? అజ్ఞానికి ఎక్కువ.. అవివేకికి తక్కువగా ఆమె మాట్లాడుతున్నారు.'' అని విమర్శించారు. షర్మిలకు దేవాలయ వ్యవస్థపై ఎటువంటి అవగాహన, ఆలోచన లేదని మండి పడ్డారు.
