మాధవ్ సారథ్య యాత్రలు.. కొన్ని సంగతులు..!
ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రజలకు చెరువ కావాలి. అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా చెరువ కావాలి. అప్పుడే ఒక నాయకుడిగా ఆయన బలోపేతం అవుతారు.
By: Garuda Media | 10 Sept 2025 12:00 AM ISTరాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు వినూత్నంగా ఉన్నాయనే చర్చ ఉన్నప్పటికీ.. ఇది పార్టీలో సీనియర్లకు జూనియర్లకు మధ్య భారీ గ్యాప్ ను పెంచుతోంది అన్న వాదన కూడా వినిపిస్తోంది. అదేవిధంగా సారధ్య యాత్రలు, జిల్లాల పర్యటనలు, గ్రామాల విజిట్ వంటి వినూత్న పేర్లతో మాధవ్ కార్యక్రమాలు రూపొందించుకున్నారు. ఇది మంచి పరిణామమే. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రజలకు చెరువ కావాలి. అదేవిధంగా పార్టీ నాయకులకు కూడా చెరువ కావాలి. అప్పుడే ఒక నాయకుడిగా ఆయన బలోపేతం అవుతారు.
ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన నేపథ్యంలో బిజెపిని మరింత విస్తృత స్థాయిలో ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడడం... ఏమీ లేని స్థితి నుంచి బిజెపిని వచ్చే ఎన్నికలనాటికి బలోపేతం చేయటం అనే కీలక లక్ష్యాలు మాధవ్ పై ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని సారధ్యయాత్రలు పేరుతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనలకు కేవలం ఆ జిల్లాలోని ప్రముఖ నాయకులకు మాత్రమే ఆహ్వానాలు అందుతున్నాయి అన్న చర్చ నడుస్తోంది.
మిగిలిన కార్యకర్తలు, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకులకు అసలు మాధవ్ వస్తున్న విషయమే తెలియడం లేదని అంటున్నారు. మరి ఇది అంతవరకు వాస్తవం అనేది తెలియకపోయినా పార్టీని బలోపేతం చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం నాయకుడిగా ఆయనపైనే ఉంటుంది. జిల్లా స్థాయికి వెళ్లినప్పుడు జిల్లాల్లో పర్యటించినప్పుడు ఆ జిల్లాలోని నాయకులు అందర్నీ కలిసేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఆయనదే.
కానీ, ఈ విషయంలో ఆయనను ఎవరు దిశా నిర్దేశం చేస్తున్నారనే విషయం తెలియదు గానీ మొత్తానికి ద్వితీయశ్రేణి నాయకుల నుంచి కార్యకర్తల వరకు లేకుండానే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీనివల్ల పార్టీ బలోపేతం కన్నా మాధవ్ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల గుంటూరులో పర్యటించినప్పుడు ఇదే జరిగింది. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు ఇక మేము పార్టీలో ఉండి ప్రయోజనం ఏమిటి.. ఇన్నాళ్లు జండా మోసి మాకు ఏం లాభం అనే మాట వినిపించారు. ఇప్పుడు శ్రీకాకుళం అదేవిధంగా విశాఖపట్నంలో కూడా పర్యటిస్తున్నారు.
ఇక్కడ కూడా అదే జరుగుతోంది. కొంతమంది నాయకులకు మాత్రమే ఆహ్వానాలు అందుతున్నాయి. మిగిలిన వారిని అసలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ తరహా రాజకీయాలకు దూరంగా ఉండి సారధ్య యాత్రలను సామరస్య పూర్వకంగా అదేవిధంగా అందరినీ కలుపుకొని వెళ్లే లాగా నిర్వహిస్తే అది మేలు చేస్తుంది. కేవలం మీడియా కోసం, ఫోటోలు కోసం కార్యక్రమాలు నిర్వహించి తాను ఒక్కడు మాత్రమే హైలెట్ అవ్వాలని భావిస్తే పార్టీ డెవలప్ అవ్వటం మాట అటు ఉంచితే నాయకుడిగా ఆయన సొంత పార్టీలోనే విఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
గతంలో సోమ వీర్రాజు కూడా ఇటువంటి వాదనే తెచ్చుకున్నారు. దీంతో ఆయన ఒక వర్గానికి మాత్రమే పరిమితం అయిపోయారు. ఫలితంగా బీజేపీలో సోము వీర్రాజు అంటే ఒక వర్గానికి మాత్రమే నాయకుడనే పేరు వచ్చేలా చేసుకున్నారు. ఇప్పుడు మాధవ్ అలా కాకుండా అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందన్నది పార్టీ నాయకులు చెబుతున్న. మాట మరి ఏం చేస్తారో చూడాలి.
