Begin typing your search above and press return to search.

సూప‌ర్ 'సిక్స్' కాదు.. సిక్స‌ర్లు: బీజేపీ

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో అనంత‌పురంలో నిర్వ‌హించిన `సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్‌` భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న కూట‌మి మిత్ర‌ప‌క్ష పార్టీ బీజేపీ రాష్ట్ర చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు

By:  Garuda Media   |   10 Sept 2025 9:22 PM IST
సూప‌ర్ సిక్స్ కాదు.. సిక్స‌ర్లు:  బీజేపీ
X

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో అనంత‌పురంలో నిర్వ‌హించిన `సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్‌` భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న కూట‌మి మిత్ర‌ప‌క్ష పార్టీ బీజేపీ రాష్ట్ర చీఫ్ పీవీఎన్ మాధ‌వ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``ఇది సూప‌ర్ సిక్స్.. స‌భే అయినా.. ఇప్ప‌టికే అనేక సూప‌ర్ సిక్స‌ర్లు.. కొట్టాం. మూడు పార్టీల ఐక్య‌త వ‌ర్థిల్లుతుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా మూడు పార్టీలు క‌లిసే పోటీచేస్తాయి. మూడు పార్టీల నాయ‌కుల మ‌ధ్య చిన్న‌పాటి విభేదాలు ఉన్నా.. అవి లెక్క‌లోకి రావు. వాటిని ప‌రిష్క‌రించుకునేందుకు అన్ని విధాలా ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి.`` అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. రాష్ట్రానికి కేంద్రం నుంచి ఊహించ‌నంత‌గా సాయం అందుతోంద‌ని.. ఇది కూట‌మి ప్ర‌భుత్వానికి వెన్నుద‌న్నుగా ఉంద‌ని మాధ‌వ్ వ్యాఖ్యానించారు. రాజ‌ధాని అమ‌రావ‌తికి భారీ ఎత్తున నిధులు ఇస్తోంద‌ని చెప్పారు. అదేవిధంగా పోల‌వ‌రం ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకువెళ్తున్నామ‌ని.. వ‌చ్చే రెండేళ్ల‌లోనే పోలవ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డిం చారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. 10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని.. ఇది కేంద్రంలోని న‌రేంద్ర మోడీ దూర‌దృష్టికి, ఏపీపై ఆయ‌న చూపుతున్న అభిమానానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

అదేవిధంగా సీఎం చంద్ర‌బాబు కూడా రాష్ట్రం కోసం ఎంతో ప‌రిత‌పిస్తున్నార‌ని మాధ‌వ్ అన్నారు. చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో పెట్టుబ‌డుల సాధ‌న‌లో ఏపీ ముందంజ‌లో ఉంద‌న్నారు. సెమీకండెక్ట‌ర్ హ‌బ్‌గానే కాకుండా.. క్వాంట‌మ్ వ్యాలీగా కూడా రాష్ట్ర‌రాజ‌ధాని రూపాంత‌రం చెందుతుంద‌న్నారు. కూట‌మి ప్ర‌భుత్వంలో బీజేపీ పాత్ర కూడా కీల‌కంగా ఉంద‌న్నారు. పార్టీ నాయ‌కులు అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఉంటే.. ఇత‌ర పార్టీల‌కు అవ‌కాశం ఉండ‌ద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌రోక్షంగా ఆయ‌న వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అవినీతి, అక్ర‌మాల‌కు ఆ పార్టీ పుట్టిల్లుగా పేర్కొన్నారు. వారు త‌ప్పులు చేసి.. కూట‌మిపై పులుముతున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇది స‌రైన విధానం కాద‌ని.. త‌ప్పులు స‌రిదిద్దుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం ఇప్పుడున్న 11 స్థానాలైనా ద‌క్కుతాయ‌ని.. లేక‌పోతే.. ఆ 1 కూడా తీసేస్తార‌ని వైసీపీని మాధ‌వ్ హెచ్చ‌రించారు.