మాధవ్ మాట.. బీజేపీకి మతం అంటిచ్చొద్దట.. !
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) నుంచి ఆవిర్భవించిన బీజేపీ.. ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్ ఎస్ ఎస్ బాటలోనే నడుస్తోందన్నది ముమ్మాటికీ నిజం.
By: Garuda Media | 19 Oct 2025 1:34 PM ISTపుట్టుకతోనే మతాన్ని ముడి వేసుకుని కళ్లు తెరిచిన బీజేపీకి మతం అంటించొద్దంటూ.. రాష్ట్ర బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. సైద్ధాంతిక వైరుధ్యాలు ఉన్న వివిధ పార్టీలతో పోల్చినప్పుడు.. ఆది నుంచి ఒకే బాట.. ఒకే మాట అన్నట్టుగా వ్యవహరిస్తున్న బీజేపీకి సనాతన ధర్మాన్ని ఆపాదించవద్దంటూ.. తొలిసారి మాధవ్ వంటి సీనియ ర్లు వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగానే ఉంటుంది. అయోధ్య రామమందిర ఏర్పాటుపై చేసిన ఉద్యమాలు ఆయన మరిచిపోయారా? లేక.. కాశీలోని మసీదు స్థానంలో కూడా హిందూ దేవతల ఆరాధన జరిగిందన్న ఉద్యమం లేవనెత్తిన నాయకులను ఆయన పక్కనపెట్టారో తెలియదు కానీ.. ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించకమానవు.
ఆర్ ఎస్ ఎస్ మాటను వేరుగా..!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) నుంచి ఆవిర్భవించిన బీజేపీ.. ఆది నుంచి ఇప్పటి వరకు కూడా ఆర్ ఎస్ ఎస్ బాటలోనే నడుస్తోందన్నది ముమ్మాటికీ నిజం. ఆర్టికల్ 370ని ఉపసంహరించడంతోపాటు.. యూసీసీ, సివిల్ కోడ్, ట్రిపుల్ తలాక్ వంటి వాటిని ఎత్తేయడం కూడా దానిలో భాగమేనన్నది జగమెరిగిన సత్యం. అయోధ్య రామమందిరం కోసం.. సుదీర్ఘంగా నాలుగు దశాబ్దాల పాటు బీజేపీ నేతలు ఉద్యమించారు. ఈ విషయాన్ని మాధవ్ తోసిపుచ్చలేరు. అంతేకాదు.. దేశంలో ఎక్కడ ఏ హిందూదేవాలయానికి ఇబ్బంది వచ్చినా..లేచేది కమల నాథుల జెండానే.
అంతెందుకు.. ఏపీలో వైసీపీ పాలనలో అంతర్వేదిరథం దగ్ధమైనప్పుడు, విజయనగరంలోని రామతీర్థంలో శ్రీరాముని తల చ్ఛేదం జరిగినప్పుడు కూడా ఉద్యమించింది.. ఆనాటి బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కాదు. అప్పటి గ్రూపులో మాధవ్ లేరా? అనేది ఆయన ఆలోచన చేయాలి. అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన వెండి రథానికి సింహాలను దొంగలు ఎత్తుకు పోయినప్పుడు.. ఉద్యమించిన వారిలోనూ బీజేపీ నేతలే ముందున్నారు. ఈ పరిణామాలతోపాటు.. దేశ వ్యాప్తంగా జరిగిన అనేక ఘటనలు ఉన్నాయి. ఇవన్ని మాధవ్ మరిచిపోలేదు. కానీ, ప్రస్తుతం మారుతున్న రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీని ఒక వర్గానికే పరిమితం చేయడాన్ని ఆయన సహించలేక పోతున్నారు.
ఇది యాదృచ్ఛికం కాదు. కానీ.. వ్యూహాత్మకంగా మాధవ్ వ్యాఖ్యానించారు. పెరుగుతున్న మహిళా ఓటర్లలో క్రిస్టియానిటీని ఎక్కువగా పాటిస్తున్నవారి సంఖ్య ఎక్కువగాఉందని ఇటీవల అంచనా వచ్చింది. అదేసమయంలో వివిధ మతాలు ఆచరిస్తున్న ప్రజలు కూడా పెరుగుతున్నారు. దీంతో కేవలం హిందూ వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నామన్న వాదనను బలోపేతం చేయడం ద్వారా.. పార్టీ వీగిపోతుందన్న ప్రధాని విమర్శ వస్తోంది. దీని నుంచి బయటకు వచ్చేందుకు మాధవ్ మతం రంగు పులమొద్దంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఇది వ్యవస్తీకృతంగా బీజేపీకి అంటుకున్న హిందూ మతం రంగును తుడిచేయడం అంత ఈజీ ఎలా? అవుతుంది? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
