Begin typing your search above and press return to search.

వైసీపీ సీనియర్లు ఉండి ఉండలేక !

ఇక పీవీఎల్ నరసింహారావు సీనియర్ నేతగా వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయన 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

By:  Satya P   |   25 July 2026 12:13 AM IST
వైసీపీ సీనియర్లు ఉండి ఉండలేక !
X

వైసీపీలో అధినాయకత్వం తీసేసినా పదవి పోతుంది. తాము కోపగించినా కూడా పదవి పోతుంది. అయితే ఎవరు వెళ్ళాలనుకున్నా అక్కడ అడ్డేమీ ఉండదు, బతిమాలడం ఉండవని చెబుతారు. తాజాగా అలాగే ఒక సీనియర్ నేత వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఆయనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఇంచార్జి పీవీఎల్ నరసింహరాజు. ఆయన ఇంచార్జి పదవిని తాజాగా తీసేశారు. ఆయన ప్లేస్ లో కొత్త వారికి చాన్స్ ఇచ్చారు. దాంతో అలిగిన ఆయనకు మరో పదవి ఇచ్చారు. అయితే తనకు ఆ పదవి వద్దు పార్టీ వద్దు అంటూ ఒక దండం పెట్టి మరీ రాజు గారు తప్పుకున్నారు. ఆయన మీడియా ముందుకొచ్చి సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.

సీనియర్ గా ఉంటూ :

ఇక పీవీఎల్ నరసింహారావు సీనియర్ నేతగా వైసీపీలో కొనసాగుతున్నారు. ఆయన 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2019లో 72 వేల దాకా ఓట్లు వస్తే 2024లో 60 వేల ఓట్లు వచ్చాయి. ఒక విధంగా కూటమి ప్రభంజనంలో బాగానే ఓట్లు లాగారు అని అంటున్నారు. అయితే ఆయనను సడెన్ గా తీసి మంతెన యోగేంద్ర కుమార్ కి ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. దాంతో రాజు గారికి కోపం వచ్చింది. ఆయన్ని రాజకీయ సలహా కమిటీలో సభ్యుడిగా నియమించారు. కానీ నాకొద్దీ పదవి అని ఆయన తప్పుకున్నారు. పార్టీకి దూరం జరిగారు.

ప్రముఖుడిగా పేరు :

వైసీపీకి ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా ప్రముఖుడిగా నరసింహ రాజు ఉన్నారని అంటున్నారు. ఆయన వైసీపీ ప్రభుత్వ కాలంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇదిలా ఉంటే తనకు జగన్ 2017లో స్వయంగా ఆహ్వానించి పార్టీ బాధ్యతలు అప్పగించారని నరసింహ రాజు గుర్తు చేశారు. ఉండి టీడీపీకి కంచుకోట అని అలాంటి చోట తాను విజయం సాధించడం కష్టమని తెలిసినా ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు సొంత నిధులు వెచ్చించాను అని ఆయన చెప్పారు. నిజాయతీగా పనిచేసిన తనకు ఈ బహుమతి దక్కిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్లకు ఇబ్బంది :

తాను సీనియర్ గా ఉన్నాను అని జిల్లాలో గిట్టని కొందరు ఈ విధంగా చేశారని అన్నారు. వారి మాటలు నమ్మి అధినాయకత్వం చర్యలు తీసుకుంటోంది అని అన్నారు. దాని వల్ల వైసీపీ నష్టపోతోంది అని ఆయన చెప్పారు. పార్టీని వీడాలనుకునే సీనియర్ల విషయంలో వైసీపీ వైఖరి సరిగ్గా లేదని ఆయన విమర్శించారు. గతంలో గ్రంధి శ్రీనివాస్ పార్టీని వీడినా కూడా పట్టించుకోలేదని గుర్తు చేసారు.

సీనియర్లలో మధనం :

ఏ పార్టీకి అయినా సీనియర్లు అవసరం. వారి అనుభవం అవసరం. అయితే వారిని సడెన్ గా ఉన్న చోట నుంచి కదిపేసి కొత్త పదవులు ఇచ్చినా లాభం లేదని పైగా వారిలో అసంతృప్తి ఉన్నపుడు పిలిచి మాట్లాడకపోవడం అధినాయకత్వం చేస్తున్న తప్పుగా గుర్తు చేస్తున్నారు. అలా చేయడం వల్ల వెళ్ళిన వారు వెళ్ళిపోతారు కానీ పార్టీకి అది పెద్ద దెబ్బ అంటున్నారు. మొత్తానికి ఉండి రాజు గారు బయటకు వెళ్ళిపోయారు. వైసీపీలో చాలా మంది సీనియర్లు ఉండీ ఉండలేక అలా ఉన్నారని అంటునారు. వారు కూడా రాజు గారి బాట పడతారా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది అని అంటున్నారు.