Begin typing your search above and press return to search.

ట్రోలర్లకు ఒలింపియన్ పీవీ సింధు గట్టి కౌంటర్.. రెండోసారి భూమి పూజపై క్లారిటీ!

విశాఖపట్నంలోని ఆరిలోవలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సెలెన్స్ అకాడమీ ఏర్పాటుకు బుధవారం భూమిపూజ జరిగింది.

By:  Tupaki Political Desk   |   6 Aug 2026 4:02 PM IST
ట్రోలర్లకు ఒలింపియన్ పీవీ సింధు గట్టి కౌంటర్.. రెండోసారి భూమి పూజపై క్లారిటీ!
X

విశాఖలో తాను ఏర్పాటు చేస్తున్న పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సెలెన్స్ అకాడమీకి రెండోసారి భూమి పూజ చేశారంటూ జరుగుతున్న ట్రోలింగుపై స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఘాటుగా స్పందించారు. మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమాన్ని రెండో సారి ఎందుకు చేయాల్సివచ్చిందో వివరిస్తూ ఎక్స్ వేదికగా సింధు ట్వీట్ చేశారు. గతంలో కేవలం బ్యాడ్మింటన్ అకాడమీ కోసం, కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో అకాడమీకి శంకుస్థాపన చేసిన విషయమై వాస్తవమే అయినప్పటికీ, ఇప్పుడు అకాడమీని మరికొన్ని క్రీడలకు విస్తరించామని, అదే సమయంలో గతంలో హడావుడిగా ముఖ్యలు ఎవరూ లేకుండా పనులు ప్రారంభించామని వివరించారు. ఇప్పుడు తనను ప్రోత్సహిస్తున్న వారితోపాటు బంధువుల సమక్షంలో భూమిపూజ చేయడం ఎంతో ఆనందంగా ఉందని సింధు స్పష్టం చేశారు.

విశాఖపట్నంలోని ఆరిలోవలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సెలెన్స్ అకాడమీ ఏర్పాటుకు బుధవారం భూమిపూజ జరిగింది. అయితే అకాడమీకి రెండోసారి భూమిపూజ చేస్తున్నారని, మంత్రి లోకేశ్ క్రెడిట్ కోసమే ఈ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని విపక్షం వైసీపీ ఆరోపించింది. అంతేకాకుండా ఆ పార్టీకి సానుకూల మీడియాతోపాటు సోషల్ మీడియాలో వైసీపీ సానుభూతిపరులు ఈ అంశాన్ని ట్రోల్ చేస్తూ మంత్రి లోకేశ్ క్రెడిట్ చోరీ చేస్తున్నారని పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దీనిపై పీవీ సింధు స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. వాస్తవానికి బుధవారం భూమిపూజ చేసిన అనంతరం జరిగిన సమావేశంలోనే ఈ విషయమై పీవీ సింధు తన వివరణ ఇచ్చారు.

గతంలో భూమిపూజ చేశానని, కొంతవరకు నిర్మాణ పనులు కూడా జరిగాయని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్లీ భూమిపూజ చేయడానికి కారణం కూడా సమావేశంలో వివరించారు. 2024 నవంబరులో శంకుస్థాపన చేసిన తర్వాత తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని, ఆ తర్వాత అకాడమీని కేవలం బ్యాడ్మింటన్ కు మాత్రమే పరిమితం చేయకుండా మరికొన్ని క్రీడలను చేర్చాలని సీఎం సూచించారని తెలిపారు. అంతేకాకుండా వందేళ్ల ప్రణాళికతో అకాడమీని నిర్మించాలని సీఎం చంద్రబాబు చెప్పారని, ఆయన సూచనలతో తన ఆలోచనలు మారిపోయాయని వివరించారు.

అయితే బుధవారం సింధు చెప్పిన ఈ అంశాలు పెద్దగా ప్రచారంలోకి రాకపోగా, విపక్షానికి అనుకూలమైన సోషల్ మీడియా పేజీల్లో రెండోసారి భూమిపూజపైనే ట్రోలింగు ఎక్కువగా జరిగింది. దీంతో సింధు సోషల్ మీడియా వేదికగా మరోసారి తన వివరణ ఇచ్చుకున్నారు. ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ తాము మళ్లీ భూమి పూజ నిర్వహించడానికి బలమైన కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. "మేము ఇవాళ మరోసారి భూమి పూజ ఎందుకు చేయాల్సి వచ్చిందో కొందరు ప్రశ్నించారు. అందుకే దీనిపై అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను" అంటూ ఆమె తన వివరణను ప్రారంభించారు.

మొదటిసారి భూమి పూజ అత్యవసర పరిస్థితుల్లో జరిగిందని సింధు వెల్లడించారు. ఆ సమయంలో కేవలం 7 గంటల ముందే ఏర్పాట్లు జరగడం వల్ల తన కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, ఆరంభం నుంచి తన కలను వెన్నంటి నిలిచిన గ్రీన్కోకు చెందిన అనిల్ అన్నా, స్వాతి అక్క వంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరూ ఆ వేడుకకు హాజరు కాలేకపోయారని ఆమె తెలిపారు. అంతేకాకుండా, మొదటి పూజ జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు సూచనలతో ప్రాజెక్ట్ స్వరూపంలో భారీ మార్పులు చోటుచేసుకున్నట్లు సింధు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ను కేవలం ఒక సాధారణ బ్యాడ్మింటన్ అకాడమీ స్థాయి నుంచి, ఒక సమగ్రమైన క్రీడా, విద్యా సంస్థగా విస్తరించాలని నిర్ణయించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ విధంగా ప్రాజెక్ట్ స్థాయి పెరిగిన తర్వాత, దానిని సరికొత్త ఉత్సాహంతో పునఃప్రారంభించే సమయంలో.. తన క్రీడా ప్రయాణంలో మొదటి నుంచి అండగా నిలిచినవారందరితో కలిసి ఈ మైలురాయిని జరుపుకోవాలని తాను కోరుకున్నట్లు సింధు వివరించారు. ఈ కొత్త ఆరంభ వేడుకకు మంత్రి నారా లోకేష్ హాజరు కావడం ఎంతో గౌరవంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇకపై తమ పూర్తి దృష్టి వివాదాలపై కాకుండా, అనుకున్న సమయానికి అంటే 2028 నాటికి ఈ ప్రతిష్టాత్మక సంస్థను విజయవంతంగా పూర్తి చేయడంపైనే ఉంటుందని సింధు స్పష్టం చేశారు. ఈ వివరణ ద్వారా సోషల్ మీడియాలో కొందరు కావాలనే చేస్తున్న రాజకీయ విమర్శలను పీవీ సింధు సమర్థవంతంగా తిప్పికొట్టారని అంటున్నారు. ఎలాంటి అనవసర వివాదాలకు తావు లేకుండా ప్రాజెక్ట్ విస్తరణ వెనుక ఉన్న అసలు నిజాలను ఆమె బయటపెట్టారని చెబుతున్నారు.