Begin typing your search above and press return to search.

వార్ జోన్‌లో పీవీ సింధు.. దుబాయ్ విమానాశ్రయంలో టెన్ష‌న్ టెన్ష‌న్

సింధు తన టీమ్ (కోచ్, ఫిజియో) తో కలిసి సురక్షితంగా ఉన్నా కానీ, విమానాశ్రయం సమీపంలో జరిగిన కొన్ని పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోయిందని సమాచారం.

By:  Sivaji Kontham   |   1 March 2026 10:52 AM IST
వార్ జోన్‌లో పీవీ సింధు.. దుబాయ్ విమానాశ్రయంలో టెన్ష‌న్ టెన్ష‌న్
X

ప్రపంచ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసివేయడంతో.. సింధు ప్రయాణిస్తున్న విమానం దుబాయ్ విమానాశ్రయంలో నిలిచిపోయింది. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్ వెళ్తున్న క్రమంలో ఈ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

దుబాయ్ విమానాశ్రయంలో నెలకొన్న భయానక పరిస్థితులపై పీవీ సింధు సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన నోట్‌ను షేర్ చేసారు. ``ప్ర‌స్తుతం జరుగుతున్న పరిణామాలను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ఆకాశంలో వినిపిస్తున్న క్షిపణి గర్జనలు.. విస్ఫోటనాల శబ్దాలు భయాన్ని కలిగిస్తున్నాయి. ఎంతో ప్రశాంతంగా ఉండే దుబాయ్ నగరం ఇలా యుద్ధ నీడలో చిక్కుకోవడం బాధాకరం`` అంటూ సింధు తన ఆవేదనను వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయి ఆందోళన చెందుతున్న దృశ్యాలను ఆమె వివరించారు.

ఇరాన్ వ‌ర్సెస్ అమెరికా-ఇజ్రాయెల్ వార్ ఇప్పుడు ప్ర‌కంప‌నాలు సృష్టిస్తోంది. మూడు వైపులా దళాల మధ్య ఘర్షణ తీవ్రం కావడంతో దుబాయ్ వంటి బిజీ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. సింధు తన టీమ్ (కోచ్, ఫిజియో) తో కలిసి సురక్షితంగా ఉన్నా కానీ, విమానాశ్రయం సమీపంలో జరిగిన కొన్ని పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోయిందని సమాచారం. సాధారణ జీవితం ఎంత సున్నితమైనదో ఇటువంటి క్షణాలు గుర్తు చేస్తాయి అని పీవీ సింధు ఆవేద‌న‌గా పేర్కొనడం అక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఈ క్లిష్ట సమయంలో భారత ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించాయి. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే సింధుతో పాటు అక్కడ చిక్కుకున్న ఇతర భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వారి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, విమానాశ్రయ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. అవసరమైతే భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది.

ప్రభుత్వం గతంలో నిర్వహించిన `ఆపరేషన్ సింధు` (గత ఏడాది ఇరాన్ నుండి భారతీయుల తరలింపు) తరహాలోనే ఇప్పుడు కూడా గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయుల కోసం రక్షణ చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24/7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందిస్తోంది. భారత క్రీడాకారిణి పీవీ సింధు భద్రత గురించి దేశవ్యాప్తంగా అభిమానులు ఆందోళన చెందుతుండటంతో త‌న‌ను సురక్షితంగా చేరాల్సిన చోటికి చేర్చడానికి లేదా స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం దౌత్యపరమైన మార్గాలను వేగవంతం చేసింది.

ప్రస్తుతానికి విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరించబడతాయనేది స్పష్టంగా తెలియదు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మార్చి 3 నుండి ప్రారంభం కావాల్సి ఉంది .. కానీ ఈ అస్థిరత కారణంగా సింధు అందులో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఏది ఏమైనా ఆట కంటే ప్రాణం ముఖ్యమని.. సింధు క్షేమంగా తిరిగి రావాలని కోట్లాది మంది భారతీయులు ప్రార్థిస్తున్నారు. యుద్ధం ముగిసి త్వరగా శాంతి నెలకొనాలని సింధు తన నోట్‌లో ముగించారు.