Begin typing your search above and press return to search.

సింధు కణత పై 'టెంపుల్'.. అదేం చేస్తోంది?

ఇంతకూ ఈ స్టిక్కర్ చేసే పనేంటి? దీని అవసరమేంటి? దీన్ని సింధు ఎందుకు ధరించింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి.

By:  Garuda Media   |   25 April 2026 10:48 AM IST
సింధు కణత పై టెంపుల్.. అదేం చేస్తోంది?
X

క్రీడా ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ చేయని రీతిలో మన బ్యాడ్మింటన్ స్టార్ సింధు చేసింది. తన కణతపై ఆమె అంటించుకున్న స్టిక్కర్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. టెంపుల్ గా పేర్కొనే ఈ బూడిద రంగు - బ్లూ కలర్ లో ఉండే ఈ ప్యాచ్ గురించి తెలిసినోళ్లంతా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. కొద్ది వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ ప్యాచ్ ను ధరించిన సింధు.. తాజాగా డెన్మార్క్ లో జరిగిన పోరులో ఆమె ఈ స్టిక్కర్ ను కణత మీద పెట్టుకొని కోర్టులోకి దిగింది. ఒక అంతర్జాతీయ మ్యాచ్ లో మొదటిసారి ఈ టెక్నాలజీ పరికరాన్ని సింధు ధరించింది.

ఇంతకూ ఈ స్టిక్కర్ చేసే పనేంటి? దీని అవసరమేంటి? దీన్ని సింధు ఎందుకు ధరించింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. మెదడు పని తీరు.. రక్త ప్రసరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఈ పరికరం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆట ఆడే క్రీడాకారుడి ఏకాగ్రత.. మెదడులో రక్త ప్రవాహం.. ఆక్సిజన్ స్థాయిలను రియల్ టైంలో కొలవటం ద్వారా.. మెదడు పని తీరును ఎప్పటికప్పుడు తెలిపేలా చేస్తుంది.

నియర్ ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికతను ఉపయోగించి మెదడులో ఆక్సిజన్ స్థాయిని అంచనా వేస్తుంది. ఈ ప్యాచ్ అందించే డేటా ద్వారా మానసిక అలసట.. ఒత్తిడి.. ఏకాగ్రత.. బ్రెయిన్ పని తీరుపై పూర్తి సమాచారం లభిస్తుంది. సింఫుల్ గా చెప్పాలంటే బ్రెయిన్ ఫిట్ నెస్ ట్రాకర్ గా దీన్ని చెప్పొచ్చు. గడిచిన కొన్నేళ్లుగా చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకొని.. హార్ట్ రేట్.. స్టెప్స్ ను కొలిచినట్లుగా.. ఈ ప్యాచ్ మెదడు పని తీరును నమోదు చేస్తుంది.

దీన్ని ధరించటం ద్వారా ఏకాగ్రత స్థాయి ఎంతన్న విషయంతో పాటు.. ఆలసట ఏమేరకు ఉందన్న విషయాన్ని తెలుసుకునే వీలుంది. అంతేకాదు.. ఆలసట నుంచి మెదడు ఎంత త్వరగా రికవరీ అవుతుందో కూడా సాయం చేసేందుకు దీన్ని ఉపయోగించొచ్చు. అయితే.. ఈ పరికరం ఇంకా మార్కెట్ లోకి రాలేదు. ప్రయోగదశలోనే ఉంది. దీన్ని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ టీం డెవలప్ చేస్తోంది. ఈ పరికరాన్ని టెంపుల్ అని కూడా వ్యవహరిస్తారు. మొత్తంగా క్రీడాకారుడి మెదడు పని తీరును రియల్ టైంలో తెలుసుకునే అవకాశం దీని ద్వారా లభిస్తుందని చెప్పక తప్పదు.