Begin typing your search above and press return to search.

నాకన్న అన్నయ్య పవనే అందగాడు : లోకేశ్ సరదా వ్యాఖ్యలు

ఇక విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న పీవీ సింధు అకాడమీకి అన్నివిధాలుగా సహకరిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.

By:  Tupaki Political Desk   |   5 Aug 2026 2:54 PM IST
నాకన్న అన్నయ్య పవనే అందగాడు : లోకేశ్ సరదా వ్యాఖ్యలు
X

ఏపీ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కంటే అందగాళ్లు ఎవరూ లేరని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. విశాఖలో ప్రముఖ బ్యాండ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సెలెన్స్ అకాడమీకి బుధవారం మంత్రి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంపై మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన ఒలింపియన్ పీవీ సింధు మంత్రి లోకేశ్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. దీనిపై తన ప్రసంగంలో స్పందించిన మంత్రి నారా లోకేశ్ సింధు చెప్పిన చాలా అంశాలపై తాను ఏకీభవించినప్పటికీ కేబినెట్ లో అందగాడు అనే విషయమై విభేదిస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. క్యాబినెట్లో తమ అందరికంటే పవన్ అన్న అందంగా ఉంటారని లోకేశ్ అనడంతో సభలో నవ్వులు విరిశాయి.

ఇక విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న పీవీ సింధు అకాడమీకి అన్నివిధాలుగా సహకరిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. క్రీడల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 90 దశకం నుంచి నమ్మకం ఉంచారని గుర్తుచేశారు. తమ ఇంట్లో కూడా దేవాన్ష్ ఏయే ఆటలు ఆడుతున్నది అడిగి తెలుసుకుంటారని చెప్పారు. విశాఖపట్నంలో సింధు అకాడమీ విజయవంతం చేయడానికి ప్రభుత్వంతోపాటు ప్రజల సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సింధు స్థాపించిన అకాడమీ రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, విశాఖనగరంలోని ఆరిలోవలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్ ఎక్సెలెన్స్ అకాడమీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు. యువ క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. అత్యాధునిక కోర్టులు, ఫిజియోథెరపీ స్పోర్ట్స్ సైన్స్ యూనిట్లు ఇందులో ఉంటాయని అంటున్నారు. స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ వంటి క్రీడలకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కేవలం బ్యాడ్మింటన్ కు మాత్రమే పరిమితం చేయకుండా అన్నిరకాల క్రీడలకు కేంద్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.

ఇక కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన పీవీ సింధు అకాడమీ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అకాడమీ ఎలా ఉండాలనే అంశమై తాను చాలా ఆలోచించానని, ఆస్ట్రేలియా, ఖతార్ తరహాలో ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయా దేశాల్లో పర్యటించానని తెలిపారు. విశాఖ అకాడమీలో దేశం కోసం మంచి క్రీడాకారులను తయారు చేస్తానని హామీ ఇచ్చారు.