సౌదీలో మరోసారి మనోడికి భారీ జాక్ పాట్
మరోసారి మనోడి సుడి తిరిగింది. సౌదీ అరేబియాలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు.
By: Garuda Media | 4 Dec 2025 9:21 AM ISTమరోసారి మనోడి సుడి తిరిగింది. సౌదీ అరేబియాలో నిర్వహించిన లక్కీ డ్రాలో భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. కేరళకు చెందిన పీవీ రాజన్ రూ.61.37 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కొద్ది నెలల క్రితం మరో భారతీయుడికి లాటరీ తగలగా.. ఆయన తీసిన డ్రాలో మరో భారతీయుడికి అదృష్టం వరించటం విశేషం. గడిచిన పదిహేనేళ్లుగా లాటరీ కొంటున్నా.. తాజాగా మాత్రం అతడికి బిగ్ టికెట్ లాటరీ లక్ తగిలింది.
లాటరీలో విజేతగా నిలిచిన విషయాన్ని రాజన్ కు తెలియటంతో ఆయన ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. లాటరీలో విజేతగా నిలిచిన సమాచారాన్ని నిర్వాహకులు రాజన్ కు చెప్పే సమయంలో ఆయన బయట ఉన్నారు. తాను లైవ్ షో చూడలేదని.. ఆ సమయంలో తాను బయట ఉన్నట్లుగా పీవీ రాజన్ వెల్లడించారు. లాటరీలో విజేతగా నిలిచి.. భారీ మొత్తంలో ప్రైజ్ మనీని చాలామంది సొంతం చేసుకుంటారు.
కానీ.. రాజన్ మాత్రం కాస్త భిన్నంగా రియాక్ట్ అయ్యారు. సౌదీ అరేబియాలోని ఒక కంపెనీలో సూపర్ వైజర్ గా పని చేసే అతను.. తాను గెలుచుకున్న ప్రైజ్ మనీని తన పదిహేను మంది సహజరులతో పంచుకుంటానని చెప్పి మనసు దోచుకున్నారు. సౌదీలో ‘బిగ్ టికెట్ అబుధాబి’ లాటరీ చాలా ఫేమస్. ప్రతి నెలలోనూ లక్కీ డ్రా నిర్వహిస్తుంటారు.
ప్రతి నెలా గ్రాండ్ ప్రైజ్ తో పాటు పలు కన్సోలేషన్ బహుమతుల్ని అందిస్తుంటుంది. ఈసారి పది మంది కన్సోలేషన్ విజేతలుగా ప్రకటించగా.. వీరిలో ముగ్గురు భారతీయులు ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఈ పది మంది విజేతలకు మన రూపాయిల్లో రూ.2.45 లక్షల చెప్పున అందుకుంటారు. గత నెల (నవంబరు) మూడున తీసిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో తమిళనాడుకు చెందిన శరవణ్ వెంకటాచలం విజేతగా నిలిచారు. తాజాగా ఆయన తీసిన లాటరీలో మరో భారతీయుడైన కేరళకు చెందిన పీవీ రాజన్ విజేతగా నిలిచారు. ఇలా వరుసగా రెండు నెలలు లక్కీ డ్రా విజేతగా భారతీయులు నిలిస్తే.. ఆ ఇద్దరూ దక్షిణ భారతానికి చెందిన వారు కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.
