Begin typing your search above and press return to search.

పీవీ సాక్షిగా కలిసిన వైసీపీ కూటమి నేతలు !

భారత రత్న అపర చాణక్యుడు పీవీ నర సింహారావు జయంతి సందర్భంగా విశాఖలో జరిగిన కార్యక్రమాలలో వైసీపీ కూటమి నేతలు కలసి పాల్గొనడం విశేషం.

By:  Satya P   |   29 Jun 2026 9:34 AM IST
పీవీ సాక్షిగా కలిసిన వైసీపీ కూటమి నేతలు !
X

భారత రత్న అపర చాణక్యుడు పీవీ నర సింహారావు జయంతి సందర్భంగా విశాఖలో జరిగిన కార్యక్రమాలలో వైసీపీ కూటమి నేతలు కలసి పాల్గొనడం విశేషం. ఎపుడూ ఉప్పూ నిప్పులా ఉండే ఈ రెండు వైపుల నుంచి రాజకీయ శిబిరాలు కలిసేది అయితే ఉండదు, వారు ఉన్న చోటకు వీరు రారు. వీరు ఉన్న చోటకు వారు వెళ్లేది ఉండదు, అలాంటి ఈ తూర్పు పడమరల రాజకీయాన్ని అపర చాణక్యుడు ఆర్ధిక సంస్కరణల రూపశిల్పి పీవీ నరసింహారావు కలిపారు అని అంటున్నారు. విశాఖలో ఈసారి పీవీ 105వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక నగరంలోని పీవీ కాంశ్య విగ్రహం వద్ద వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కలసి నివాళి అర్పించడం విశేషం.

ఒకే వేదికను పంచుకుని :

ఆ మీదట విశాఖ నగరంలోని బ్రాహ్మణ సంఘాలు అన్నీ కలసి నిర్వహించిన పీవీ జయంతి వేడుకలకు టీడీపీ జనసేన బీజేపీ వైసీపీ నేతలు అంతా వేదికను పంచుకుని మరీ ప్రసంగాలు చేశారు. అంతా కలసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. ఒకరిని ఒకరు ఆప్యాయంగా సంభోదించుకుంటూ ఆహూతులను ఆకట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ అలాగే టీడీపీ కూటమి నుంచి పోటీ చేసి గెలిచిన శ్రీభరత్ పక్క పక్కన కూర్చుని పలకరించుకోవడం విశేషంగానే చెప్పుకోవాలి.

శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు :

ఈ సందర్భంగా విశాఖ ఎంపీ శ్రీభరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అయితే రాజకీయ నాయకులు అంతా కలిసి మెలసి ఉండేవారు అని అన్నారు. తన తాతగారు ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ఎంపీగా పనిచేసిన రోజులలో అందరితోనూ రాజకీయాలకు అతీతంగా స్నేహంగా ఉండేవారు అని గుర్తు చేసుకున్నారు. ఎన్నికలపుడే రాజకీయం అన్నది నాటి తరం చెప్పిన విషయం అన్నారు. విశాఖ దిగ్గజం ద్రోణం రాజు సత్యనారాయణ కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య రాజకీయాలకు అతీతమైన స్నేహ బాంధవ్యాలు ఉండేవని అన్నారు. ఇపుడు చూస్తే రాజకీయ ప్రత్యర్ధులు కాదని శతృవులుగా మారిపోతున్న పరిస్థితులు ఉన్నాయని ఇదంతా ఆవేదన చెందాల్సిన విషయం అని ఎంపీ వ్యాఖ్యానించడం విశేషం.

అంతా ఒక్కటిగానే :

ఇక బీజేపీ నుంచి హాజరైన రాజ్యసభ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎంపీ భరత్ అలాగే జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ వంటి వారు కలసి వేదిక మీద కనిపించి కను విందు చేశారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుని జీవీఎల్ ఆశించిన సంగతి తెలిసిందే. ఇలా నాయకుల మధ్య ఏ రకమైన గ్యాప్ ఉన్నా కూడా పీవీ సాక్షిగా తామంతా ఒక్కటి అని తెలుగు బిడ్డకు నివాళి అర్పించడం తమ కర్తవ్యం అని అంతా చాటి చెప్పిన తీరు పట్ల జనంలో హర్షం వ్యక్తం అవుతోంది. ఇదే తీరున అంతా ముందు ముందు కలసి మెలసి ఉంటే నగర సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.