తండ్రిపై కొడుకు పైచేయి.. దటీజ్ పాలిటిక్స్.. !
ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మహేష్ కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు.. పాతవి, మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెడుతున్నారు.
By: Garuda Media | 13 Aug 2025 9:00 AM ISTరాజకీయాల్లో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారన్నది వారు వారు వ్యవహరించే తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రజలతో మమేకమయ్యే తీరు.. వారి సమస్యలపై ప్రశ్నించే తీరును బట్టి.. నాయకుల గ్రాఫ్ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో దూకుడుగా ఉన్న నాయకులకే ప్రజలు కూడా మార్కులు వేస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టీడీపీలోని తండ్రి, తనయుల విషయంలో కుమారుడి దూకుడు ముందు తండ్రి వెనుకబడ్డారని.. పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
వారే.. పుట్టా మహేష్ యాదవ్, పుట్టా సుధాకర్ యాదవ్. వీరిద్దరి గ్రాఫ్‌లపై.. టీడీపీలో చర్చ జోరుగా సాగు తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సుధాకర్.. ఉమ్మడి కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. ఆయన కుమారుడు మహేష్ ఏలూరు ఎంపీగా గెలుపు గుర్రం ఎక్కారు. ఇక, వీరి పనితీరుకు సంబంధించి సీఎం చంద్రబాబు తెప్పించుకున్న నివేదికల్లో తండ్రిని మించిన తనయుడిగా మహేష్ దూకుడుగా వ్యవహరిస్తున్నారని స్పష్టమైంది.
ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మహేష్ కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు.. పాతవి, మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెడుతున్నారు. వాటిపై పార్లమెంటులోనూ ఆయన తరచుగా ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలోనూ ఆయన కేంద్రం వద్ద సక్సెస్ అయ్యారు. దీంతో ఏలూరులో పలు ప్రాజెక్టులు వడివడిగా ముందుకు సాగుతున్నాయి. దీనిపై చంద్రబా బు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యువనేతగా అందరినీ కలుపుకొని పోవడం కూడా మంచి మార్కులు పడేలా చేస్తోంది.
ఇక, పుట్టా సుధాకర్ వ్యవహారం మాత్రం మహేష్ కన్నా వెనుకబడిందన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మైదు కూరులో కానీ, స్టేట్ లెవిల్లో కానీ.. సుధాకర్‌యాదవ్ పేరు వినిపించడం లేదు. ఆయన గురించి ఎవ రూ చర్చించుకోవడం కూడా లేదు. పార్టీ పరంగా కూడా దూకుడుగా ఉండలేక పోతున్నారని అంటున్నా రు. అయితే.. అందరినీ కలుపుకొని వెళ్లే క్రమంలో మాత్రం ఆయన లౌక్యంగానే వ్యవహరిస్తున్నారని చెబు తున్నారు. కానీ.. ప్రజలకు చేరువ కావడంలో మాత్రం సుధాకర్ యాదవ్ వెనుకబడ్డారన్నది చంద్రబాబు సైతం చెబుతున్నారు. అయితే వయసు రీత్యా కూడా ఇబ్బందులు ఎదుర్కొనడంతో ఈ ఇబ్బందులు వస్తున్నాయని తెలుస్తోంది.
