Begin typing your search above and press return to search.

పుట్టా విష‌యంలో బాబు ఆ ప‌ని చేస్తారా...?

ఏలూరు ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్‌.. డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   21 March 2026 2:00 PM IST
పుట్టా విష‌యంలో బాబు ఆ ప‌ని చేస్తారా...?
X

ఏలూరు ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్‌.. డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న టీడీపీ అధిష్టానం ఆయ‌న నుంచి వివ‌ర‌ణ కోరింది. దీనికిగాను ఐదు రోజుల స‌మ‌యం ఇచ్చింది. ఈ గ‌డువు ముగియ‌డంతో పుట్టా.. తాజాగా త‌న వివ‌ర‌ణ‌ను పార్టీ ఏపీ చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అందించారు. దీనిలో ఏముంది.. అనేది పెద్ద‌గా సందేహ‌మేమీ లేదు. దీనిపై పెద్ద‌గా ఎవ‌రికీ ఉత్కంఠ కూడా లేదు.

ఈ కేసు బ‌య‌ట ప‌డిన‌ప్ప‌టి నుంచి పుట్టా చేస్తున్న వాద‌న ప్ర‌కారం.. ఈ కేసుతో త‌న‌కు సంబంధం లేదని.. త‌న‌కు ఎలాంటి అలవాట్లు లేవ‌ని.. చెబుతున్నారు. బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి త‌న చిర‌కాల మిత్రుడ‌ని.. అందుకే ఆయ‌న పిలిస్తే డిన్న‌ర్ పార్టీకి వెళ్లాన‌ని అంటున్నారు. దీనికి సంబం ధించి ఆయ‌న రెండు సార్లు త‌న వివ‌ర‌ణ‌ను బ‌హిరంగంగానే వెల్ల‌డించారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కూడా సెల్ఫీ వీడియో ద్వారా వివ‌రించారు.

సో.. ఇప్పుడు కూడా అదే వివ‌ర‌ణ‌ను పార్టీకి ఇచ్చి ఉంటారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారు ? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. పార్టీలో ఇంత పెద్ద స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న‌వారు లేకున్న‌ప్ప‌టికీ.. త‌ర‌చుగావివాదాల‌కు కేంద్రంగా మారుతున్న నాయ‌కులు ఉన్నారు. అలాంటి వారు.. త‌మ‌పై చ‌ర్య‌ల‌కు అధిష్టానం సిద్ధ‌మ‌వుతుంద‌న్న బెంగ వెంటాడుతోంది. ఇలాంటి స‌మ‌యంలో పుట్టా వ్య‌వ‌హారం వ‌చ్చే స‌రికి.. పార్టీలో ఆస‌క్తిగా మారింది.

వాస్త‌వానికి ప్ర‌తిప‌క్షం కంటే సొంత పార్టీలోనే పుట్టాపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న విష‌యంపై ఆస‌క్తి, ఉత్కంఠ నెల‌కొంది. కానీ, చంద్ర‌బాబుకు ఈ విష‌యం మింగుడు ప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారింది. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతోపాటు.. యువ నేత అనే ట్యాగ్ కూడా ఉంది. మ‌రీ ముఖ్యంగా పార్టీకి సుదీర్ఘ సేవ‌లందిస్తున్న మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు స్వ‌యానా అల్లుడు కావ‌డంతోపాటు.. పార్టీకి కీల‌క‌మైన పుట్టా సుధాక‌ర్ త‌న‌యుడు కూడా కావ‌డంతో ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా.. అది దీర్ఘ‌కాలిక ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌న్న చ‌ర్చ సాగుతోంది.

అయితే.. కొన్నాళ్ల పాటు పార్టీ నుంచి స‌స్పెండ్ చేసేందుకు మాత్ర‌మే చంద్ర‌బాబు మొగ్గు చూపుతార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ త‌ర్వాత‌.. ఈ కేసు ప‌రిణామాల‌ను బ‌ట్టి.. ఆయ‌న‌ను చేర‌దీయ వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఏదే మైనా.. బ‌ల‌మైన, భ‌యంక‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ఊహించ‌లేమ‌ని ప‌లువురు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.