పుతిన్ ఫుడ్ మెనూలో ఉన్నవి ఇవే.. వీటిని ఎవరు తయారు చేస్తారంటే..?
భారతదేశానికి అతి పెద్ద మిత్రదేశం రష్యా. భారత్ పైకి ఏ దేశం రావాలనుకున్నా మొదలు రష్యాను దాటాలని పుతిన్ ఎప్పుడూ చెప్తుంటారు.
By: Tupaki Political Desk | 4 Dec 2025 12:59 PM ISTభారతదేశానికి అతి పెద్ద మిత్రదేశం రష్యా. భారత్ పైకి ఏ దేశం రావాలనుకున్నా మొదలు రష్యాను దాటాలని పుతిన్ ఎప్పుడూ చెప్తుంటారు. అందుకే రష్యా మనకు నమ్మదగిన చాలా మంచి మిత్ర దేశం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం (04.12.2025) భారత పర్యటనకు వీచ్చేయనుండడంతో ఆయన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరోసారి చర్చకు వచ్చాయి. నాలుగేళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న పుతిన్, పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ప్రధానితో ప్రైవేట్ డిన్నర్ కూడా చేయనున్నారు. ఒక ప్రపంచ నాయకుడిగా ఆయన తీసుకునే భోజనం ఎలా ఉండాలి? ఆయన ఏమేమి ఇష్టపడతారు? అన్నది సహజంగానే ఆసక్తిని పెంచింది. ఇదే నేపథ్యంలో పలు అంతర్జాతీయ మీడియా పుతిన్ ఫుడ్ పై కథనాలు ప్రచురించాయి.
తేలికపాటి వంటలంటేనే ఇష్టం..
పుతిన్ జీర్ణమయ్యే సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారట. ఉదయం టోవోరాగ్ అనే కాటన్ చీజ్, తేనె కలిపిన వంటకం ఆయన డెయిలీ మెనూలో భాగంగా ఉంటుందట. దీని రుచి, ప్రోటీన్ కంటెంట్ కారణంగా రష్యాలో ఇది పాపులర్. దీనితో పాటు కౌజుపిట్ట గుడ్లు, తాజా పళ్ల రసం బ్రేక్‌ఫాస్ట్‌లో రెగ్యులర్ ఐటమ్స్. పుతిన్ ఎక్కువగా చేపలను ఇష్టపడతారని, రోజూ తన ఆహారంలో తప్పకుండా ఉంటాయని అధికారులు చెబుతారు. స్టర్‌జియన్ చేప, గొర్రె పిల్ల మాంసం ఆయనకు ప్రీతిపాత్రమట.
షుగర్ తో చేసిన వాటికి దూరం..
పుతిన్ చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటారట. తీపి ఉన్న డెజర్ట్స్ ఆయనను ఆకర్షించవు. డిన్నర్‌లో స్వీట్ అందించినా అరుదుగానే తీసుుంటారట. దానికి బదులుగా తేలికైన టమోటా, దోసకాయలతో చేసిన సలాడ్‌లను తీసుకుంటారట. అత్యవసరంగా మాత్రమే ఐస్‌క్రీమ్ లేదా పేస్ట్రీల వంటివి తీసుకుంటారని వైట్ హౌస్‌లోనూ, క్రెమ్లిన్‌లోనూ పనిచేసిన చెఫ్‌లు వెల్లడించారు. ప్రత్యేకంగా అధికారిక డిన్నర్లలో చేపల సూప్, లైట్ నాన్‌వెజ్ ఐటమ్స్ ఎక్కువగా ఆయన టేబుల్‌పై ఉంటాయని సమాచారం.
ఇండియాలో ప్రత్యేకం..
భారత్ పర్యటనల్లో పుతిన్ ఆహారం కూడా ప్రత్యేకమే. 2014లో వచ్చినప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కశ్మీరీ సంప్రదాయ వంటకాలను ఆయనకు రుచి చూపించారు. కుంకుమపువ్వుతో చేసిన పానీయం, హాక్ కా సాగ్, గులాటీ కబాబ్, ముర్గ్ ధనివాల్ కుర్మా, బాదాం షోర్బా, గులాబ్ ఖీర్, చీజ్ కేక్ వంటివి ప్రస్తుతం మెనూలో పెట్టారు. ఇందులో ఆయన ఏవి తీసుకుంటారో చూడాలి.
2018 పర్యటనలోనూ పుతిన్ కోసం ప్రత్యేకంగా వెజ్, నాన్‌వెజ్ డిషెస్ సిద్ధం చేశారు. సాల్మన్ ఫిల్లెట్, మొఘలాయ్ స్టైల్‌లో తయారుచేసిన గొర్రె మాంసం, చికెన్ డెలికసీలు, వాటర్‌మిలన్ క్రీమ్ సూప్, మొలకెత్తిన గింజలతో చేసిన పఫ్, అద్భుతమైన కబాబ్, రికోటా సిల్వర్ పెరల్స్ వంటి వంటకాలు ఉన్నాయి. ఈ మెనూను పుతిన్ నిజంగా రుచి చూశారా? అనే ప్రశ్నకి స్పష్టమైన సమాధానం లేదు.
అత్యంత కఠినమైన భద్రత..
పుతిన్ పర్యటనలలో ఆహారంపై భద్రతా అత్యంత కఠినంగా ఉంటుంది. ఆయన ఏ దేశం వెళ్లినా ఫుడ్ ల్యాబ్ కూడా ఆ దేశం వెళ్తుంది. ఇక ఏ హోటలైనా.. చెఫ్ లు రష్యా నుంచే పుతిన్ తో పాటే వస్తారు. వారు మాత్రమే వంటకం చేస్తారు. ప్లేట్లు, పానీయాలు కూడా ప్రత్యేక చెక్ చేసిన తర్వాతే వడ్డిస్తారు. ఇంతటి హై సెక్యూరిటీ ఎందుకంటే రష్యా అధ్యక్షుడి పట్ల ఉన్న ప్రపంచవ్యాప్త ఆసక్తి, విమర్శలు, భద్రతా ముప్పులు దృష్ట్యా ఇది తప్పనిసరి అవుతోంది.
ఫుడ్ పై సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు...
భారత పర్యటనలో పుతిన్ కోసం ఏ వంటకాలు సిద్ధమయ్యే అవకాశం ఉందో ఆసక్తికరం. భారతీయ వంటకాలలో కూడా ఆయనకు నచ్చేలా తేలికైన, ప్రోటీన్ పుష్కలంగా ఉన్న మెనూనే సిద్ధం చేస్తారని అధికారులు చెప్తున్నారు. ప్రత్యేకంగా చేపలు, గ్రిల్ ఐటమ్స్, తాజా కూరగాయల సలాడ్, హర్బల్ టీ వంటి ఎంపికలు ఎక్కువగా ఉండొచ్చు. ప్రధాని మోదీతో జరగనున్న ప్రైవేట్ డిన్నర్‌లో కూడా పుతిన్ ఇష్టాలను దృష్టిలో ఉంచుకొని స్పెషల్ మెనూ సిద్ధం చేస్తున్నారట.
అంతా చూసుకున్నప్పుడు పుతిన్ ఆహారం కూడా ఆయన రాజకీయ శైలి లాగే మితంగా, క్రమశిక్షణతో, లైట్‌గా, కానీ ప్రత్యేకత కలిగినదే అని అర్థం అవుతుంది. ఇప్పుడు భారత్ పర్యటనలో ఆయన డిన్నర్ డిప్లమసీ ఎలా ఉండబోతోందో చూడాలి.
