స్మార్ట్‌ఫోన్ ముట్టని పుతిన్.. షాకిచ్చే కారణం
ప్రపంచ నాయకుల్లో అత్యంత రహస్యంగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జీవించే నాయకుడు ఎవరైనా ఉన్నారని చెప్పాలంటే, అందులో ముందుగా గుర్తుకు వచ్చే పేరు వ్లాదిమిర్ పుతిన్.
By: Tupaki Political Desk | 4 Dec 2025 5:06 PM ISTస్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక అవిభాజ్య భాగంగా మారిపోయింది. ప్రపంచ నాయకులు కూడా సోషల్ మీడియా నుంచి, ఎన్‌క్రిప్టెడ్ కాల్స్ వరకు ఈ పరికరంపైనే ఆధారపడాల్సిందే.. కానీ ఈ ‘డిజిటల్ యుగం’లో ఒకేఒక్కడు మాత్రం పూర్తిగా విభిన్నంగా నిలుస్తున్నాడు.. అతడే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. హైటెక్ ప్రపంచాన్ని నడిపించే నాయకుడే, స్వయంగా స్మార్ట్‌ఫోన్‌ను ముట్టడంలేదు! ప్రశ్న ఏంటంటే.. ఎందుకు? ఆధునిక భద్రతా ప్రపంచానికే ఆందోళన కలిగించే ఏ రహస్య కారణం ఆయనను మొబైల్ ఫోన్‌లకు దూరం చేసింది?
అత్యంత భద్రతావలయంలో ఉండే నాయకుడు..
ప్రపంచ నాయకుల్లో అత్యంత రహస్యంగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జీవించే నాయకుడు ఎవరైనా ఉన్నారని చెప్పాలంటే, అందులో ముందుగా గుర్తుకు వచ్చే పేరు వ్లాదిమిర్ పుతిన్. అతని ప్రతి అడుగు, ప్రతి కదలిక, ప్రతి సంభాషణ అన్నింటిపైనా తీవ్ర పర్యవేక్షణ ఉండడమే ఆయన జీవన శైలి ఎలా భిన్నంగా ఉందో తెలియజేస్తుంది. డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారత్ పర్యటన నేపథ్యంలో.. ఆయన భద్రత, అలవాట్లు, వ్యక్తిగత జీవనశైలి మరోసారి చర్చలోకి వచ్చింది. డిజిటల్ యుగంలో పుతిన్ స్మార్ట్‌ఫోన్ ముట్టరన్న నిజం వినేవారిని ఆశ్చర్యపరుస్తోంది.
పుతిన్ స్వయంగా చెప్పారు..
పుతిన్ స్వయంగా 2018లో ఒక సమావేశంలో ‘నా దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదు’ అంటూ చెప్పినప్పుడు, అక్కడున్న ప్రతినిధులు మాత్రమే కాదు, ప్రపంచ మీడియా కూడా ఒక్కసారిగా వెనక్కి చూసింది. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి నాయకుడూ టెక్నాలజీపై ఆధారపడుతున్న ఈ కాలంలో, పుతిన్ మాత్రం దాన్ని ప్రమాదంగా చూస్తున్నారు. ఈ వ్యాఖ్యను క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కూడా ధృవీకరించారు. ఆయన మాటల్లో ‘స్మార్ట్‌ఫోన్ వాడడం అంటే గోప్యతను ప్రమాదంలో పడేసినట్లే.. ముఖ్యంగా ఉన్నత స్థాయి నేతలకు ఇది అత్యంత రిస్క్’ అని స్పష్టం చేశారు. అందుకే పుతిన్ నివసించే క్రెమ్లిన్ భవనం లోపల మొబైల్‌ఫోన్లకే ప్రవేశం లేదు. ఎవరితోనైనా మాట్లాడాలంటే ఆయన ఉపయోగించే ఫోన్ లైన్ పూర్తిగా గుప్తంగా టెక్నాలజీతో సెక్యూర్ గా ఉంటుంది.
టెక్నాలజీకి దూరంగా ఉండేందుకు కారణం ఇదే..
టెక్నాలజీపై పుతిన్ అనాసక్తి కొత్తది కాదు. 2017లో విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఆయన ‘నేను ఇంటర్నెట్‌ను చాలా అరుదుగా వాడుతాను’ అని చెప్పారు. అంతకుమించి, ఇంటర్నెట్‌ను స్వయంగా విమర్శిస్తూ, అది పెద్దగా ‘సీఐఏ ప్రాజెక్ట్‌లాంటిదే.. అందులో సగభాగం అశ్లీల కంటెంట్‌తో నిండి ఉంటుంది’ అన్న వ్యాఖ్య కూడా చేశారు. డిజిటల్ ప్రపంచంపై ఆయన నమ్మకం లేకపోవడం వల్లే, ఇంటర్నెట్‌కు నేరుగా కనెక్ట్ అయ్యే పరికరాలన్నిటినీ ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన సమీపానికి చేరే పరికరం సెక్యూరిటీ స్కానర్‌ను దాటకపోతే ఆయనకు చేరదు.
ఇదంతా చూస్తే పుతిన్ పాతకాలపు వ్యక్తిలా అనిపించినా, అసలు కారణం ఆయన భద్రత. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా, అనేక శత్రువులతో జీవించాల్సి వస్తున్న పుతిన్‌కు అత్యాధునిక సాంకేతికతే అత్యంత పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆయన భావిస్తారు. ఫోన్ హ్యాకింగ్, ఇంటర్నెట్ బగ్‌లు, డిజిటల్ స్పైయింగ్.. ఇవన్నీ పుతిన్ దృష్టిలో ఓ క్రమబద్ధమైన ముప్పు.
కఠినమైన భద్రత
విదేశీ పర్యటనలు చేస్తూనే ఆయన భద్రతా వ్యవస్థ మరింత కఠినమవుతుంది. ఆయన బస చేసే గది నుంచి, తినే ఆహారం వరకూ అన్నింటిని ముందుగానే ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. పుతిన్ కోసం ప్రత్యేక చెఫ్‌లు, సిబ్బంది రష్యా నుంచే వస్తారు. ఆయన తినే ఒక్క చెంచా సూప్ కూడా స్కాన్ అయిన తర్వాతే అందుతుంది. అతను పట్టుకునే గ్లాస్, తాకే టేబుల్, కూర్చునే చెయిర్ అన్నీ ముందే శుభ్రం అవుతాయి. ఆయన గదిలో ఏవైనా సీక్రెట్ కెమెరాలు, మైక్రోఫోన్‌లు ఉన్నాయా అన్నది కూడా భద్రతా బృందం ప్రత్యేక పరికరాలతో చెక్ చేస్తుంది.
ఈ భద్రతా చర్యలన్నీ చూస్తుంటే, పుతిన్ సాంకేతికతను నిరాకరిస్తున్నట్లు కనిపించదు. దానికి పూర్తిగా లోబడి ఉండే ప్రమాదాన్ని మాత్రమే నిరాకరిస్తున్నారు. ఒక నాయకుడి వ్యక్తిగత భద్రత అతని దేశ భద్రతతో ముడిపడి ఉంటుంది. అందుకే ఆయన ప్రతి అలవాటు, ప్రతి జాగ్రత్త అంతటి కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రపంచం స్మార్ట్‌ఫోన్‌లోనే జీవిస్తున్నా, పుతిన్ మాత్రం టెక్నాలజీనే అత్యంత ప్రమాదకర ఆయుధంగా భావిస్తూ దానిని ముట్టకుండానే ప్రపంచాన్ని నడిపిస్తున్న అరుదైన నాయకుడిగా నిలుస్తున్నారు.
