ఫార్చ్యూనర్ కారులో మోదీ, పుతిన్.. ఏంటి స్పెషల్?
ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణించిన ఫార్చ్యూనర్ టయోటా కంపెనీకి చెందిన సిగ్మా 4 ఎంటీ వాహనం.
By: Tupaki Political Desk | 5 Dec 2025 11:07 AM ISTరష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత పర్యటన ఆసక్తికరంగా మారింది. గురువారం పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టిన పుతిన్ బృందానికి ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం పుతిన్ భారత్ వచ్చారు. ఏడేళ్ల తర్వాత ఆయన దేశంలో అడుగు పెట్టడంపై ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అమెరికాతో టారిఫ్ లపై చర్చలు కొనసాగుతున్న వేళ పుతిన్ భారత్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ తొలిసారిగా భారత్ వచ్చారు. యుద్ధం జరుగుతున్న సమయంలో పుతిన్ చాలా దేశాల్లో పర్యటించారు. కానీ, రష్యాకు అత్యంత సన్నిహితమిత్ర దేశం భారత్ కు ఇప్పుడే వచ్చారు.
ఇక పాలెం విమానాశ్రయానికి వచ్చిన పుతిన్ బృందానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడిని హత్తుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో రెండు దేశాల అధినేతలు ఒకే కారులో ప్రయాణించడం, ఆ వాహనం సాధారణ ఫార్చ్యూనర్ కారు కావడంపై విస్తృత చర్చ జరుగుతోంది. రెండు దేశాల అధినేతలకు కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రత్యేక వాహనాలు ఉన్నాయి. కానీ, ఇద్దరూ ఆ కారులలో కాకుండా సాధారణ ఫార్చ్యూనర్ లో ప్రయాణించడమే అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణించిన ఫార్చ్యూనర్ టయోటా కంపెనీకి చెందిన సిగ్మా 4 ఎంటీ వాహనం. MH01EN5795 మహారాష్ట్ర నంబరుతో రిజిస్ట్రర్ అయింది. ఈ బీఎస్-06 వాహనం 2024 ఏప్రిల్ లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం. 2039 వరకు ఈ ఫార్చ్యూనర్ కారుకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుంది. రష్యా అధినేతను తీసుకువెళ్లేందుకు ప్రధాని మోదీ ఈ కారును ఎంచుకోవడమే సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దీనికి తోడు పుతిన్ తన ఆరస్ సెనేట్ లిమోసిస్ కారులో కాకుండా ఫార్చ్యూనర్ లో ప్రయాణించేందుకు అంగీకరించడం కూడా విశేషం అంటున్నారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రయాణాలు సాగించే ఇద్దరు దేశాధినేతలు భద్రతా నిబంధనలకు విభిన్నంగా ఒక సాధారణ కారులో ప్రయాణించడం గమనార్హం. ఇక రెండు రోజుల పర్యటనలో భాగంగా పుతిన్ గురువారం దేశానికి వచ్చారు. పాలం విమానాశ్రయం నుంచి లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసానికి వెళ్లారు. అక్కడ పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. కాగా, శుక్రవారం ఇద్దరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి.
