రెడ్ కార్పెట్ పై చాయ్ వాలాగా ప్రధాని
మన దేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4,5 తేదీల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది.
By: Tupaki Political Desk | 3 Dec 2025 3:13 PM ISTమన దేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4,5 తేదీల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇరుదేశాల స్నేహబాంధవ్యాలు బలపడేలా సుహృత్ వాతావరణం సృష్టించేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ ప్రధానిపై ఓ వివాదాస్పద ఏఐ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బీజేపీ భగ్గుమంటోంది. సమయం సందర్భం చూసుకోకుండా అనుచితంగా ప్రవర్తిస్తూ కాంగ్రెస్ తన మర్యాదను తనే పోగొట్టుకొంటోందని కొందరు నేతలు విమర్శిస్తున్నారు.
పుతిన్ కోసం భారత్ ఘనంగా రాజసంగా రెడ్ కార్పెట్ సిద్ధం చేసింది. రష్యాఅధ్యక్షుడికి రెడ్ కార్పెట్ వెల్ కమ్ చెప్పేందుకు దేశం రెడీగా ఉంటున్న సమయంలో ఆ రెడ్ కార్పెట్ పైనే ప్రధాని సూటు వేసుకుని చాయ్ అమ్ముతున్నట్లు వీడియో చేశారు. దీన్ని కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అంతర్జాతీయ జెండాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంగా అధికార పక్షం చేసే పనుల్ని ఎండగట్టే అవకాశం హక్కు కాంగ్రెస్ కు ఎప్పుడూ ఉంటుంది. కానీ సమయం సందర్భం చూసుకోకుండా ప్రయోగిస్తే ప్రజల ముందు చులకనయ్యే ప్రమాదముంది.
సరిగ్గా పదేళ్ల కిందట అంటే 2014లో లోక్ సభ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యార్ చాయ్ వాలా నేపథ్యాన్ని హేళన చేశారు. ఆ తర్వాత రాగిణి నాయక్ ఇలా పోస్ట్ చేశారు.ఈ ట్వీట్ ప్రతిభావంతులైన 140 కోట్ల మంది భారతీయులకు చేసిన తీవ్ర అవమానం అని బీజేపీ సీనియర్ నేత సీఆర్ కేశవన్ అన్నారు. ఇది ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) వర్గంపై కాంగ్రెస్ చేసిన ప్రత్యక్ష దాడి అని ఆయన అభివర్ణించారు. అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా...కరమ్ దారి ప్రధానిపై నామ్ దారి కాంగ్రెస్ వెళ్ళగక్కుతున్న అసూయగా తెలిపారు. గతంలోనూ మోదీని, తల్లిని అవమానించారని ఆయన అన్నారు.
