2 నెలల్లో భారత్ కు కీలక దేశాధినేత..! ప్రపంచంలో ముఖ్య పరిణామం
భారత్-రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి 15 ఏళ్లు పూర్తయింది. దీనిపై మోదీ-పుతిన్ చర్చించనున్నట్లు సమాచారం.
By: Tupaki Political Desk | 1 Oct 2025 5:53 PM ISTఉక్రెయిన్ పై యుద్ధం మొదలైన దాదాపు నాలుగేళ్లకు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా సుంకాలు విధిస్తున్న సమయంలో కీలక సమయంలో ఓ ప్రముఖ నాయకుడు భారత దేశాన్ని సందర్శించనున్నారు. గత నాలుగేళ్లలో ఆయన కేవలం కొన్ని మిత్రదేశాల్లో మాత్రమే పర్యటించారు. అవి కూడా తమ ఇరుగుపొరుగు దేశాల్లోనే . ఇప్పుడు మాత్రం మన దేశానికి వస్తున్నారు. ఈ పర్యటన జరుగుతుందని గతంలోనే సమాచారం వచ్చినా, తాజాగా తేదీలు ఖరారయ్యాయి. ఈ నేపథంలో ఆయన ఒక్కసారి వచ్చి వెళ్తే ప్రపంచ రాజకీయ పరిణామాలు చాలా వరకు మారతాయి అనడంలో సందేహం లేదు.
ఏటా సమావేశాలు..
భారత్ కు రష్యా ఎప్పటినుంచో మిత్రదేశం. దశాబ్దాలుగా రష్యా మనకు అండగా నిలుస్తోంది. అయితే, గత 30 ఏళ్లలో పరిస్థితులు కొంత మారాయి. భారత దేశం అమెరికాకు దగ్గర కావడం నేపథ్యమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. కానీ, ఇప్పుడు మాత్రం రష్యా-భారత్ మైత్రి మరింత బలపడుతోంది. కొన్నేళ్ల నుంచి ఇరు దేశాల మధ్య ఏటా సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఈసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు రానున్నారు.
నిరుడు మోదీ..
భారత్ రష్యా వార్షిక సమావేశాలకు మోదీ పలుసార్లు హాజరయ్యారు. ఇటీవల సంవత్సరాల్లో ఆయన రష్యాలో రెండుసార్లు పర్యటించారు. నిరుడు జూలైలో మోదీ రష్యా వెళ్లగా.. ఇప్పుడు పుతిన్ మన దేశానికి వస్తున్నారు. డిసెంబరు 5, 6 తేదీల్లో ఆయన పర్యటన ఉండనుంది. భారత్-రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడి 15 ఏళ్లు పూర్తయింది. దీనిపై మోదీ-పుతిన్ చర్చించనున్నట్లు సమాచారం.
ట్రంప్ నకు చెక్..
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టాక పుతిన్ చైనా, మాజీ సోవియట్ దేశాల్లోనే పర్యటించారు. అలాంటిది ఇప్పుడు భారత్ కు రానుండడం గమనార్హం. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజూ టారిఫ్ ల మోత మోగిస్తున్న సమయంలో ఈ పర్యటన జరగనుండడం విశేషం. పుతిన్ రాకతో.. భారత్-రష్యా సంబంధాలు మరింత బలపడడం కాయం. రక్షణ, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకుంటారు. బ్రిక్స్, ఎస్సీవో ఇతర దేశాల పాత్ర పైనా సంభాషణలు జరుగుతాయి.
-మరో ముఖ్యమైన అంశం ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం. మోదీ-పుతిన్ భేటీలో దీనిపైనా ప్రస్తావన ఖాయం. తాము ఈ యుద్ధంలో ఎవరి పక్షమూ కాదని శాంతిపక్షమని భారత ఇప్పటికే పలుసార్లు తేల్చిచెప్పింది. ఇప్పుడు ఇంకేం నిర్ణయం ఉంటుందో చూడాలి.
