భారత్ వణకదు.. జణకదు.. ట్రంప్ కు జ్ఞానోదయం కావాలి
రష్యా-భారత్ మధ్య కొనసాగుతున్న ఇంధన వాణిజ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కఠినంగా స్పందించారు.
By: A.N.Kumar | 3 Oct 2025 5:00 PM ISTరష్యా-భారత్ మధ్య కొనసాగుతున్న ఇంధన వాణిజ్యం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కఠినంగా స్పందించారు. బయటి దేశాల ఒత్తిడికి భారత్ ఏనాటికీ తలొగ్గదని స్పష్టం చేస్తూ.. ట్రంప్ విధానాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. దక్షిణ సోచిలో జరిగిన అంతర్జాతీయ 'వాల్దాయ్ చర్చా వేదిక'లో పుతిన్ మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సహా 140 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
*భారత్ ఒత్తిళ్లకు తలొగ్గదు: ట్రంప్‌కు గట్టి జవాబు
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గించుకోవాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తోందని పుతిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. "మాస్కోతో వాణిజ్యాన్ని తగ్గించమని అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఇది తప్పు. ఇలాంటి చర్యల వల్ల చివరికి అమెరికాకే దెబ్బ తగులుతుంది" అని ఆయన హెచ్చరించారు. వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలు విధించడం ప్రపంచ ఇంధన ధరలను పెంచుతుందని, ఆ ప్రభావం నేరుగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతుందని పుతిన్ స్పష్టం చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచక తప్పదని, దాంతో అమెరికా వృద్ధి మందగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్ సార్వభౌమత్వం
"భారత ప్రజలు తమ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను నిశితంగా గమనిస్తారు. వారు ఎప్పటికీ ఎవరి ముందు కూడా అవమానాన్ని అంగీకరించరు. నాకు ప్రధాని మోదీ తెలుసు, ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకోరు" అని భారత్ స్వాతంత్య్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని పుతిన్ పరోక్షంగా బలపరిచారు. అమెరికా సుంకాల కారణంగా భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు సర్దుబాటు చేస్తాయని పుతిన్ వివరించారు.
అదేవిధంగా అమెరికా అణు విద్యుత్ ఉత్పత్తికి రష్యా యురేనియంపై ఆధారపడుతోందని, తాము అమెరికాకు రెండవ అతిపెద్ద యురేనియం సరఫరాదారులమని పుతిన్ గుర్తు చేశారు. ఒకవైపు తమ నుంచే యురేనియం కొనుగోలు చేస్తూ, మరోవైపు ఇతర దేశాలు చమురు కొనుగోలు చేయొద్దని ఒత్తిడి చేయడం అమెరికా ద్వంద్వ వైఖరిని సూచిస్తుందని విమర్శించారు.
* మోదీతో సత్సంబంధాలు: భారత్‌తో బంధం బలోపేతం
పుతిన్ ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో తనకున్న స్నేహబంధాన్ని, బలమైన ద్వైపాక్షిక సంబంధాలను గుర్తు చేసుకున్నారు. డిసెంబర్‌లో భారత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అవుతానని పుతిన్ తెలిపారు. "మోదీతో నాకు మంచి స్నేహబంధం ఉంది. వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు రష్యా కృషి చేస్తుంది" అని ఆయన చెప్పారు. భారత్‌తో పెరిగిన వాణిజ్య అసమతుల్యతను తగ్గించేందుకు (భారత్ భారీగా రష్యా చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో) రష్యా నుంచి భారత్‌కు మరిన్ని రాయితీలు ఇవ్వడానికి సిద్ధమన్నారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతిని పెంచుతామని, అలాగే కృత్రిమ మేధ (AI) భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని పుతిన్ ప్రకటించారు.
*"రష్యా 'పేపర్ టైగర్' అయితే.. నాటో ఏంటి?"
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోన్న రష్యాను ట్రంప్ “పేపర్ టైగర్” (కాగితపు పులి)గా పేర్కొన్న వ్యాఖ్యలపైనా పుతిన్ ఘాటుగా స్పందించారు. "మేము కేవలం ఉక్రెయిన్‌తోనే కాదు.. మొత్తం నాటో కూటమితో యుద్ధం చేస్తున్నాం. ఇంతటి పరిస్థితుల్లో మమ్మల్ని కాగితపు పులిగా పిలిస్తే.. మరి నాటో ఏంటీ?" అంటూ ట్రంప్ వ్యాఖ్యలకు పుతిన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా-రష్యా మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమవుతున్న నేపథ్యంలో, స్వతంత్రంగా వ్యవహరిస్తోన్న భారత్ పాత్ర అంతర్జాతీయ వర్గాల్లో కీలకంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
