70 వేల జాబ్స్ రెఢీ.. భారతీయుల కోసం పుతిన్ ప్రయారిటీ
ఈ ఏడాది చివర్లో మన దేశానికి వస్తున్న రష్యా అధినేత పుతిన్.. భారీ ఆఫర్ తో భారత్ కు వస్తున్నట్లుగా చెప్పాలి.
By: Garuda Media | 11 Nov 2025 11:34 AM ISTఈ ఏడాది చివర్లో మన దేశానికి వస్తున్న రష్యా అధినేత పుతిన్.. భారీ ఆఫర్ తో భారత్ కు వస్తున్నట్లుగా చెప్పాలి. భారతీయులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు తమ దేశంలో కల్పించేందుకు వీలుగా ఒక ఒప్పందం కూడా తన వెంట తీసుకురానున్నట్లుగా చెబుతున్నారు. నాలుగేళ్లుగా ఉక్రెయిన్ తో చేస్తున్న యుద్దంతో రష్యాలో అర్హత కలిగిన నిపుణులైన కార్మికుల కొరతతో రష్యా తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. దీనికి పరిష్కారంగా భారత్ లోని నిపుణులను తమ దేశానికి ఆహ్వానించాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా మన దేశంతో ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. సుమారు 70 వేలకు పైగా భారతీయులకు ఈ ఏడాది చివర్లో రష్యాలోని వివిధ ప్రాంతాల్లోని నిర్మాణ.. వస్త్ర.. ఇంజనీరింగ్.. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాల్ని కల్పించనున్నారు. ఇందుకు అవసరసమైన ఏర్పాట్లను రష్యా కార్మిక శాఖ చేపట్టింది. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు.
భారత్ - రష్యా సంబంధాల్లో ఇదో కొత్త అధ్యాయంగా చెబుతున్నారు. భారతీయ నిపుణులకు సురక్షితమైన.. గౌరవప్రదమైన ఉపాధిని కల్పిస్తూనే.. రష్యా ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యం కలిగిన వనరుల్నిఅందించేలా భారత్ వ్యవహరించనుంది. భారతీయ సిబ్బందికి అవసరమైన రష్యన్ భాషా నైపుణ్యాన్ని అందించేలా చర్యలు తీసుకోనున్నారు.
