సరిగ్గా టైం చూసి నొక్కిపట్టిన పుతిన్... ట్రంప్ ముందు కీలక డిమాండ్!
అవును... సుదీర్ఘంగా సాగుతున్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 17 Aug 2025 2:00 PM ISTరష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఈ యుద్ధం ముగించాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ పుతిన్ ముందు ఆయన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి! ఈ క్రమంలో తాజా భేటీలో పుతిన్ తెరపైకి తెచ్చిన డిమాండ్ వైరల్ గా మారింది.
అవును... సుదీర్ఘంగా సాగుతున్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధాన్ని ఆపాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధాన్ని ఆపుతానని ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చారు! ఈ క్రమంలో అలాస్కాలో పుతిన్ తో భేటీ అయ్యి చర్చలు జరిపారు. అయితే... ఈ భేటీలో వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదు కానీ.. పుతిన్ తెరపైకి ఓ కీలక డిమాండ్ ని తెచ్చారు.
ఇందులో భాగంగా... యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న దొనెట్ స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని పుతిన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాస్కా భేటీ అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో పాటు యూరోపియన్ నేతలతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్.. పుతిన్ చేసిన ఈ కీలక ప్రతిపాదనను వారికి వివరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ డిమాండ్ ను జెలెన్ స్కీ తక్షణం తిరస్కరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జెలెన్ స్కీతో డొనాల్డ్ ట్రంప్ సమావేశమవుతున్నారు. ఆ భేటీలో ఈ మేరకు హాట్ హాట్ చర్చ జరగొచ్చని తెలుస్తోంది.
పుతిన్ కోరిన దొనెట్ స్క్ ప్రత్యేకత ఏమిటి?:
యుద్ధం ముగించాలంటే దొనెట్ స్క్ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ పూర్తిగా వైదొలగాలని పుతిన్ డిమాండ్ చేసిన వేళ... ఏమిటీ ప్రాంతం ప్రత్యేకం అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతం రష్యా సరిహద్దుల వెంబడి తూర్పు ఉక్రెయిన్ లో ఉంది. పారిశ్రామిక హబ్ గా ఉన్న ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా ఎక్కువగానే జరుగుతుంది.
ఈ క్రమంలో... 2022లోనే ఈ ప్రాంతంలోని అధిక భాగాన్ని మాస్కో తన సొంతం చేసుకుంది. ఇటీవల మాస్కో బలగాలు మరింతగా చొచ్చుకు వచ్చి సుమారు 70% ప్రాంతాన్ని ఆక్రమించాయి. అంటే.. కేవలం 30 శాతం దొనెట్ స్క్ ప్రాంతం మాత్రమే ఉక్రెయిన్ ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మిగిలిన ఆ ప్రాంతం కూడా తమకే కావాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు.
మరి ఈ డిమాండ్ విషయంలో జెలెన్ స్కీని అమెరికా అధ్యక్షుడు నయానో, భయానో ఒప్పించగలరా.. యుద్ధం ముగించగలరా.. లేక, ఇది కంటిన్యూ కావాల్సిందేనా అనేది సోమవారం భేటీలో తెలియొచ్చు!
