మేలురకం పోయే, నాసిరకం మిగిలే.. చందనం మార్కెట్ లో భారత్ కు ఏమైంది?
వాస్తవానికి ఒకప్పుడు ప్రధాన చందన తైలం ఉత్పత్తిదారుగా ఉన్న భారత్.. క్రమంగా భారీ దిగుమతిదారుగా మారింది
By: Raja Ch | 2 Nov 2025 11:32 AM ISTఎర్ర చందనంపై ‘పుష్ప’ల ప్రభావం ఓ రేంజ్ లో ఉందని అంటారు. ఇదే క్రమంలో చందన మార్కెట్ లో భారత ప్రాభవం కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన శాండల్ వుడ్ డెవలప్మెంట్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దీనికి గల ప్రధాన కారణం ఈ వృక్షజాతిని విపరీతంగా నరికేయడమేనని అంటున్నారు. ఫలితంగా మేలురకం జాతులు అంతరించిపోతున్నాయని చెబుతున్నారు.
అవును... దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో అత్యధికంగా పెరిగే చందనం మొక్కలను విపరీతంగా నరికేయడం వల్ల మేలురకం జన్యురకాలు అంతరించి, నాసిరకం జాతులు మిగిలినట్లు శాండల్ వుడ్ డెవలప్మెంట్ కమిటీ వెల్లడించింది. ఒకవైపు సరఫరా తగ్గి, అంతర్జాతీయ మార్కెట్ లో చందనానికి డిమాండ్ విపరీతంగా పెరిగిందని పేర్కొంది.
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా చందనం మార్కెట్ లో ఓ వెలుగు వెలిగిన భారత ప్రభావాన్ని పునరుద్ధరించాలంటే, మన ప్రభుత్వాలు జోక్యం చేసుకుని దేశంలో చందన మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని కమిటీ సూచించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 70% మార్కెట్ వాటాను గుప్పిట్లో ఉంచుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.
వాస్తవానికి ఒకప్పుడు ప్రధాన చందన తైలం ఉత్పత్తిదారుగా ఉన్న భారత్.. క్రమంగా భారీ దిగుమతిదారుగా మారింది. తాజా ఘణాంకాలు ఆ పరిస్థితిని క్లియర్ గా చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా... 2023-24లో మనదేశం నుంచి 0.62 మిలియన్ డాలర్ల విలువైన చందనం ఎగుమతి జరిగితే దిగుమతులు మాత్రం 5.59 మిలియన్ డాలర్లు జరిగాయి.
ప్రపంచవ్యాప్తంగా చందన మార్కెట్ విస్తరిస్తోంది. ఇందులో భాగంగా... 2023లో 265.8 మిలియన్ డాలర్ల మేర ఉన్న ఈ మార్కెట్, 2030 నాటికి 502.2 మిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఈ ఏడేళ్లలో 9.4% మేర వార్షిక వృద్ధిరేటు నమోదు చేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. దేశంలో అమూల్యమైన ఈ వనరుపై దృష్టిసారించాలని చెబుతున్నారు!
ఈ నేపథ్యంలో... కేంద్ర పర్యావరణ, అటవీశాఖ భారత అటవీచట్టం 1927ని సవరించి, పంట పొలాల్లో పెంచిన చందన మొక్కలను అటవీ ఉత్పత్తుల నుంచి తొలగించాలని.. ఆర్థిక సంస్థలు ఈ మొక్కల పెంపకానికి అవసరమైన రుణాలు ఇవ్వడంతో పాటు, బీమా సౌకర్యం కల్పించాలని, అన్నిరకాల ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు.
ఇదే క్రమంలో... చందన మొక్కల పెంపకం కోసం సంస్థాగతంగా రుణ సౌకర్యం, ప్రోత్సాహకాలు, బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర పర్యావరణం, అటవీ, ఆయుష్ మంత్రిత్వశాఖలు చర్యలు తీసుకోవాలని.. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం అమలయ్యేలా చూడాలని చెబుతున్నారు.
వాస్తవానికి.. చందనం చెట్లు ప్రధానంగా కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో ఎక్కువగా పెరుగుతాయి. అయితే.. ఈ వనరుకున్న ప్రాధాన్యాన్ని గుర్తించకుండా విపరీతంగా కొట్టేయడంతో నాణ్యమైన జాతులన్నీ అంతరించిపోయి, నాసిరకం సరుకు మిగిలిపోయింది. ఈ లోపాన్ని అధిగమించాలంటే మళ్లీ మేలురకం మొక్కల పెంపకంపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు.
దీనికోసం ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో చాలా ప్రైవేటు సంస్థలు, సంఘాలు, రైతులు వాణిజ్యపరంగా పెద్దసంఖ్యలో మొక్కల పెంపకం చేపట్టారు. దీనివల్ల పంటపొలాల్లో ఈ మొక్కల పెంపకం 30,000 హెక్టార్ల దాకా చేరే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి రతన్ పి.వాటాల్ నేతృత్వంలో శాండల్ వుడ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులన్నింటినీ సమీక్షించి ఇప్పుడున్న విధానాలు, న్యాయపరమైన నిబంధనావళిలో మార్పులు సూచిస్తూ సిఫార్సులు చేసింది.
