పురందేశ్వరి ప్రయత్నం ఎందాకా.. బీజేపీలో హాట్ టాపిక్ ..!
అయితే.. ఏపదవి అన్నది తెలియకపోయినా.. బీజేపీ అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె అవకాశం దక్కించుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి.
By: Garuda Media | 28 Aug 2025 9:07 AM ISTబీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రస్తుత రాజమండ్రి ఎంపీ.. దగ్గుబాటి పురందేశ్వరి ఆ పార్టీపై అలిగారా?.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అయితే.. ప్రస్తుతం నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆమె కుటుంబ వ్యవహారాలకే పరిమితమయ్యారన్న వాదన వినిపిస్తున్నా.. అంతర్గతంగా బీజేపీ వ్యవహారాలపై మాత్రం పురందేశ్వరి ఇబ్బందిగానే ఉన్నారని తెలుస్తోంది.
రాష్ట్రం పార్టీ చీఫ్‌గా ఆమెను పక్కన పెట్టారు. కేంద్రంలో ఎలాంటి ప్రాధాన్యం లేని.. 'మహిళా పదవి'ని ఒకటి ఇచ్చారు. అయితే.. ఆ పదవి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక, ఇప్పుడు కేంద్రం ఇచ్చే నామినేటెడ్ పదవి అయినా.. దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలో కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం, ఎంపీగా ఉన్న పరిచయాలు వంటివాటిని దృష్టిలో పెట్టుకుని పురందేశ్వరి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్టు సమాచారం.
అయితే.. ఏపదవి అన్నది తెలియకపోయినా.. బీజేపీ అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె అవకాశం దక్కించుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడు కు చెందిన నిర్మలా సీతారామన్‌తోపాటు.. మరో మహిళానాయకురాలు... ఏపీ నుంచి పురందేశ్వరి లైన్‌లో ఉన్నారని అప్పట్లో తెరమీదికి వచ్చింది. ఇక, తాజాగా కూడా ఈ వ్యవహారం మరింత పుంజుకుంది. వచ్చే నెలలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి.
అవి పూర్తికాగానే.. పార్టీలో జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక జరుగుతుందన్నది ఖాయం. అయితే.. దీనిని దక్కించుకునేందుకు పురందేశ్వరి ప్రయత్నిస్తున్నా.. ఎంత మేరకు సానుకూల రిజల్ట్ వస్తుందన్నది చూడాలి. ఒకవేళ.. అది సాధ్యం కాకపోతే.. నామినేటెడ్ పదవి అయినా.. జాతీయస్థాయిలో దక్కించుకునే ప్రయత్నంలో పురందేశ్వరి ఉన్నారు. ఇక, ఆమె అలకకు ప్రధాన కారణం.. రాష్ట్రం నుంచి ఆమెను సిఫారసు చేయడం లేదా.. మద్దతుగా ఆమెకు నిలబడడం వంటివి ఎవరూ చేయకపోవడం.. కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో పురందేశ్వరి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
