Begin typing your search above and press return to search.

చిన్నమ్మకు పెద్ద ఆశలు తీరే చాన్స్ లేదా ?

ఆమె రెండు దశాబ్దాల క్రితం రాజకీయ అరంగేట్రం చేశారు. వస్తూనే ఎంపీ అయ్యారు. అలా చూస్తూండగానే కేంద్ర మంత్రి కూడా అయ్యారు.

By:  Satya P   |   6 Oct 2025 1:00 PM IST
చిన్నమ్మకు పెద్ద ఆశలు తీరే చాన్స్ లేదా ?
X

ఆమె రెండు దశాబ్దాల క్రితం రాజకీయ అరంగేట్రం చేశారు. వస్తూనే ఎంపీ అయ్యారు. అలా చూస్తూండగానే కేంద్ర మంత్రి కూడా అయ్యారు. పదేళ్ల యూపీయే ప్రభుత్వ హయాంలో ఆమె బాగానే రాణించారు. ఆమెకు మంచి ప్లేస్ కూడా దక్కింది. ఆమె దగ్గుబాటి పురంధేశ్వరి. నందమూరి తారక రామారావు కుమార్తె. ఏ కాంగ్రెస్ కి అయితే వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఏపీలో హస్తం పార్టీని చిన్నాభిన్నం చేసారో అదే పెద్దాయన కుమార్తె కాంగ్రెస్ తీర్ధం తీసుకోవడం అప్పట్లో పెద్ద రాజకీయ చర్చగా మారింది. అయినా సరే పురంధేశ్వరి తన సమర్థతతో వాటిని పటాపంచలు చేయగలిగారు. తనకు అప్పగించిన బాధ్యతలను ఆమె సక్రమంగా నెరవేర్చి మంచి పేరు సంపాదించుకున్నారు.

బీజేపీ గూటికి :

ఇక విభజన ఏపీలో కాంగ్రెస్ టోటల్ గా కుదేల్ అయింది. దాంతో చాలా మంది బడా నేతలు అంతా ఆ పార్టీని వీడారు. దాంతో పురంధేశ్వరి కూడా బీజేపీ కండుగా కప్పుకున్నారు. ఆ పార్టీ తరఫున 2014లో రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేస్తే ఓటమి పాలు అయ్యారు. 2019లో పొత్తులు లేకపోవడంతో విశాఖ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు దక్కలేదు. చివరికి 2024లో పొత్తులతో రాజమండ్రి నుంచి ఎంపీ అయ్యారు. ఆమె గెలవడంతోనే కేంద్ర మంత్రి గ్యారంటీ అనుకున్నారు. కానీ అది మాత్రం దక్కకపోవడమే అసలైన పాలిటిక్స్ గా చూస్తున్నారు.

అనూహ్యంగా ఆయనకు చాన్స్ :

ఇక రేసులో లేని ఊసులో లేని నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి వరించింది. దాంతో ప్రాంతీయంగా గోదావరి జిల్లాల వాటా పూర్తి అయినట్లు అనుకుంటే సామాజిక కోణంలో నుంచి చూస్తే గుంటూరు నుంచి ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కి మంత్రి పదవి దక్కింది. ఆయన టీడీపీ నుంచి అలా చాన్స్ అందుకున్నారు. ఇలా సామాజికవర్గం పరంగా కూడా చిన్నమ్మకు అవకాశం లేకుండా పోయినట్లు అయింది. మరో వైపు కేబినెట్ బెర్తులను లెక్కలు చూసుకుని మరీ కేటాయిస్తారు. తెలంగాణాలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు. అక్కడ ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఏపీలో ముగ్గురు మాత్రమే గెలిచారు. అందుకే ఒక్కరికే ఇచ్చారు. ఇలా చూసుకుంటే కనుక రెండవ బెర్త్ బీజేపీ కోటాలో దక్కేది ఉండదని అంటున్నారు. ఒకవేళ దక్కినా సామాజిక ప్రాంతీయ సమీకరణలతో చిన్నమ్మకు చాన్స్ వస్తుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది అని అంటున్నారు.

ఈ టెర్మ్ కి ఇంతేనా :

దీంతో పాటుగా జాతీయ బీజేపీ అధ్యక్ష పదవి మీద కూడ ఆమెకు ఇస్తారు అని వస్తున్న వార్తలు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అంటున్నారు. ఆ పదవి ఆర్ఎస్ఎస్ కి చెందిన వారికే ఇస్తారని అంటున్నారు. ఇలా పార్టీ పదవులు కానీ ఇతర అవకాశాలు కానీ ఈ పదవీ కాలంలో దక్కే చాన్స్ లేదని అంటున్నారు. 2029లో మరోసారి కూటమి తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచి కేంద్రంలో కూటమి వస్తే కనుక అపుడే ఆమెకు మంత్రి యోగం ఉంటుందని అంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఉందిట. ఏది ఏమైనా రాజయోగం పట్టాలీ అంటే చాలా లెక్కలు సరిపోవాలి. అందుకే చిన్నమ్మ పెద్ద ఆశలేవీ నెరవేరడం లేదా అంటే జవాబు ఇలాగే వస్తోంది మరి.