పంజాబ్ లో మూడు ముక్కలాటేనా ?
ఈ ఎన్నికలను ప్రభుత్వ పనితీరుగా ఆప్ భావిస్తుంది. అయితే ఇది అధికార యంత్రాంగం దుర్వినియోగం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
By: Garuda Media | 6 Sept 2026 8:00 PM ISTపంజాబ్ లో శాసనసభ ఎన్నికలకు ఆరు నెలల ముందే రాజకీయ వేడి రాజుకుంది. ఓటర్ల జాబితా సవరణలో అక్కడ ఓటర్ల సంఖ్య 9 శాతం తగ్గింది. మొత్తంగా 20.66 లక్షల పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించబడ్డాయి. శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందు గత మే లో అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 1977 వార్డులకు గాను 958 వార్డులు గెలుచుకుని అధికార ఆప్ ఉత్సాహంగా ఉంది. 397 స్థానాలలో కాంగ్రెస్, 192 స్తానాలలో అకాలీదళ్, 172 స్థానాలలో బీజేపీ విజయం సాధించాయి.
ఈ ఎన్నికలను ప్రభుత్వ పనితీరుగా ఆప్ భావిస్తుంది. అయితే ఇది అధికార యంత్రాంగం దుర్వినియోగం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో 18.5 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో మొత్తం 117 స్థానాలలో పోటీ చేస్తానని ప్రకటించింది. అకాలీదళ్ తో పొత్తు ఉంటుందని భావిస్తున్నా, బీజేపీ అధిక స్థానాలు కావాలని పట్టుబట్టడం ప్రతిబంధకంగా మారుతుంది.
ఇక్క ఈ సారి పోటీ ప్రధానంగా ఆప్ - కాంగ్రెస్ - బీజేపీల మధ్య కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అయితే 2022లో 3 స్థానాలకు పరిమితం అయిన అకాళీదల్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ నాయకత్వంలో పంథిక్ బేస్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్త ర్యాలీలతో గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
గత ఎన్నికల్లో 92 స్థానాలు గెలిచిన ఆప్ కు ఐదేళ్ల పాలనపై వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత, డ్రగ్స్ సమస్యలు, రుణాలు, ఆర్థిక సంక్షోభం, ఏడు మంది రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం, మతపరమైన విమర్శలు ప్రతిబంధకాలుగా నిలిచాయి. స్థానిక ఎన్నికల్లో బలం కనిపించినా, శాసనసభ ఎన్నికల్లో అది కొనసాగుతుందా ? అన్న అనుమానాలు ఉన్నాయి.
డబల్ ఇంజన్ ప్రభుత్వమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇతర నేతలు పర్యటనలతో పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మ్ లాస్ వారసత్వం, గ్రామీణ సిక్కులలో నమ్మకలోపం, పంజాబ్ లో మెజారిటీ హిందువులు లేకపోవడం బీజేపీకి సవాళ్లుగా మారాయి.
2022 ఎన్నికల్లో 18 స్థానాలకు పరిమితం అయిన కాంగ్రెస్ ప్రధానంగా అంతర్గత కలహాలను ఎదదుర్కొంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ను కొనసాగించాలని నిర్ణయించడం, మాజీ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీని ఎన్నికల క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ గా నియమించడం అంతర్గత కలహాలకు దారి తీసింది. బహుళ నాయకత్వాలు ఇక్కడ సమస్యగా మారాయి.
మొత్తంగా ఆప్ బలంగా ఉన్నా కొన్ని వత్తిళ్లలో ఉంది. అంతర్గత సమస్యలతో కాంగ్రెస్ కష్టపడుతున్నది. అకాళీదల్ పోయిన వైభవాన్నితిరిగి పునరుద్దరించుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. బీజేపీ దూకుడుగా విస్తరించాలనే చూస్తున్నది. అయితే పంథిక్ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేకత ఎలా మారుతాయి అన్నదాన్ని బట్టి ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది.
