కేతన్ హత్య కేసులో మరిన్ని సంచలనాలు: పాలీగ్రాఫ్ టెస్టుకు సియా, చేతన్ నిరాకరణ!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ దర్యాప్తును మలుపులు తిప్పుతోంది.
By: A.N.Kumar | 4 July 2026 11:55 PM ISTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే వ్యాపారవేత్త కేతన్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ దర్యాప్తును మలుపులు తిప్పుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేతన్ కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు చేతన్ తాజాగా పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షకు నిరాకరించడం చట్టపరంగా.. మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పరీక్షకు కోర్టు నిరాకరణ.. ఎరవాడ జైలుకు నిందితులు
చట్టప్రకారం పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలంటే నిందితుల స్వచ్ఛంద అంగీకారం తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది. అయితే తమపై ఈ పరీక్షలు జరపడానికి ఇద్దరు నిందితులు సమ్మతించకపోవడంతో కోర్టు అందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ పరిణామం అనంతరం న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో అధికారులు సియా, చేతన్‌లను పూణేలోని ప్రముఖ ఎరవాడ జైలుకు తరలించారు.
లోయలోకి తోసివేసి హత్య.. మూడో వ్యక్తిపై అనుమానాలు
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈ హత్య వెనుక ఒక పక్కా స్కెచ్ ఉన్నట్లు తేలింది. పూణేకు దూరంగా ఉన్న ఒక చారిత్రక కోట వద్దకు కేతన్‌ను నమ్మించి పిలిపించి, అక్కడ లోయలోకి తోసివేసి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కేతన్‌ను చంపడానికి నిందితులు గతంలో కూడా రెండుసార్లు ప్రయత్నించారని.. అవి విఫలం కావడంతోనే ఈ మూడో ప్లాన్ అమలు చేశారని విచారణలో వెల్లడైంది. కేతన్ నుండి నిందితులు భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి సహకరించిన ఒక మూడో వ్యక్తి పాత్రపై కూడా విచారణ ముమ్మరంగా సాగుతోంది.
స్పై ఫోన్.. కోడ్ లాంగ్వేజ్ చాటింగ్
ఈ కేసులో టెక్నాలజీ ఆధారాలు పోలీసులకు అత్యంత కీలకంగా మారాయి. దర్యాప్తు సంస్థల కన్నుగప్పేందుకు సియా ప్రత్యేకంగా ఒక 'స్పై ఫోన్' ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించి, దానిని స్వాధీనం చేసుకున్నారు. చేతన్, సియా ఇద్దరూ సాధారణ సందేశాలు కాకుండా ప్రత్యేకమైన కోడ్ భాష , రహస్య సంకేతాలను ఉపయోగించి చాటింగ్ చేసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఈ డేటాను డీకోడ్ చేయడానికి సైబర్ క్రైమ్ నిపుణుల సహాయం తీసుకుంటున్నారు.
మీడియాపై సియా అసభ్య ప్రవర్తన
ఇటీవల దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో సీన్ రీక్రియేషన్ నిర్వహిస్తుండగా, అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులను చూసి సియా మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
పాలీగ్రాఫ్ పరీక్షకు వారు నిరాకరించినప్పటికీ.. ఇప్పటికే లభించిన డిజిటల్ ఆధారాలు, కాల్ డేటా రికార్డులు, లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా కేసును పటిష్టం చేయాలని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కస్టడీ ముగిసేలోపు మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ ఆరోపణలన్నీ విచారణ దశలోనే ఉన్నాయి.. తుది తీర్పు కోర్టు పరిధిలోనే తేలనుంది.
