Begin typing your search above and press return to search.

ప్రేమ కోసం కలిసి చం*పారు... ఇప్పుడు నెపం నెట్టేసుకుంటున్న ప్రేమికులు?

అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్కపెడుతున్న ఈ ఇద్దరు ప్రేమికులు.. విచారణలో మాత్రం పరస్పరం నిందలు వేసుకుంటున్నారు.

By:  A.N.Kumar   |   26 Jun 2026 12:09 AM IST
ప్రేమ కోసం కలిసి చం*పారు... ఇప్పుడు నెపం నెట్టేసుకుంటున్న ప్రేమికులు?
X

మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రేమించిన ప్రియుడి కోసం కాబోయే భర్తను అత్యంత దారుణంగా అంతమొందించిన ఓ యువతి.. ఇప్పుడు పోలీసుల విచారణలో ప్లేట్ ఫిరాయించినట్టు సమాచారం.. పక్కా స్కెచ్‌తో హత్య చేసిన ఈ ప్రేమికులు.. తీరా దొరికిపోయాక శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పోలీసులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.

లోయలో పడదోసి హత్య.. ప్రమాదంగా చిత్రీకరణ

ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కుమారుడు, కుటుంబ వ్యాపార సంస్థలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కేతన్ అగర్వాల్ (25) జూన్ 18న పుణె సమీపంలోని లోహగడ్ కోట వద్ద లోయలో పడి మృతి చెందాడు. అమెరికాలోని బోస్టన్‌లో మాస్టర్స్ పూర్తి చేసి ఇటీవలే భారత్‌కు వచ్చిన కేతన్‌కు.. సియా గోయల్ (20) అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లోని ఒక ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా వివాహం జరపడానికి ఇరు కుటుంబాలు ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. అయితే జూన్ 18న కేతన్ మరణించిన వెంటనే సియానే స్వయంగా కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించింది. మొదట దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించారు. కానీ సియా చెప్పిన వివరాల్లో అనేక విరుద్ధతలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు కోట పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. అక్కడ అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తి సియా ప్రియుడు చేతన్ చౌదరి (22)గా గుర్తించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే కేతన్‌ను లోయలోకి తోసి హత్య చేసినట్లు నిర్ధారించుకుని జూన్ 23న సియా, చేతన్‌లను అరెస్ట్ చేశారు.

‘నువ్వే చంపావు అంటే.. కాదు నువ్వే’.. విచారణలో డ్రామాలు..

అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్కపెడుతున్న ఈ ఇద్దరు ప్రేమికులు.. విచారణలో మాత్రం పరస్పరం నిందలు వేసుకుంటున్నారు. నేర బాధ్యతను అవతలి వ్యక్తిపైకి నెట్టేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియుడు చేతన్ "నేను సియాను ప్రాణంగా ప్రేమించాను. ఆమెతో కలిసి ఎక్కడికైనా పారిపోవాలని అనుకున్నాను తప్ప కేతన్‌ను చంపాలనే ఉద్దేశం నాకు లేదు. కేతన్‌ను పూర్తిగా వదిలించుకోవాలనే ప్లాన్.. హత్య చేయాలనే ఆలోచన పూర్తిగా సియాదే" అని పోలీసులకు తెలిపాడు.

సియా గోయల్ మాత్రం "కేతన్‌ను చంపాలనే పథకం మొత్తం చేతన్‌దే. అంతకుముందు జూన్ 14న కూడా కేతన్‌ను చంపడానికి చేతన్ ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో నా ముందే కూర్చొని ఏడ్చాడు" అంటూ సియా కొత్త పల్లవి అందుకుంది.

కేఫేలో రహస్య సమావేశాలు.. పోలీసుల వద్ద పక్కా ఆధారాలు

ఈ ఇద్దరి వాదనలను, డ్రామాలను పోలీసులు అస్సలు నమ్మడం లేదు. కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని అధికారులు స్పష్టం చేశారు. వీరిద్దరూ కలిసి మే 31 నుంచి జూన్ 4 మధ్య పుణెలోని ఒక కేఫేలో రహస్యంగా కలుసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ సమావేశంలోనే కేతన్ హత్యకు సంబంధించిన పూర్తి కుట్ర జరిగినట్లు అనుమానిస్తున్నారు.

పోలీసుల ప్రకటన ఇదీ..

"నిందితులు ఇద్దరూ కలిసి పకడ్బందీగా కుట్ర పన్ని ఈ దారుణానికి ఒడిగట్టారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాల గొలుసు మా వద్ద ఉంది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన చట్టం నుంచి తప్పించుకోలేరు." అని ప్రకటించారు. మరి ఇందులో నిజానిజాలు ఏమిటి అన్నది పోలీసుల విచారణ ముగిశాక అధికారికంగా వారు వెల్లడించాల్సి ఉంటుంది. అప్పటివరకూ ఈ ఊహాగానాలు సాగుతూనే ఉంటాయి.

ప్రస్తుతం ఈ సంచలన కేసులో మరిన్ని కీలక సాక్ష్యాలు, డిజిటల్ ఆధారాలను సేకరించే పనిలో పుణె పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రేమ కోసం కాబోయే భర్త ప్రాణాలు తీసిన ఈ కిరాతక ప్రేమికుల ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.