Begin typing your search above and press return to search.

క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న కేతన్ హత్య కేసు: పెళ్లికి ముందే ప్రియుడితో సియా రహస్య వివాహం?

ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా.. తన ప్రియుడు చేతన్‌ను ఇప్పటికే రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పరిణామం కేసు విచారణను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తోంది.

By:  A.N.Kumar   |   7 July 2026 6:38 PM IST
క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న కేతన్ హత్య కేసు: పెళ్లికి ముందే ప్రియుడితో సియా రహస్య వివాహం?
X

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజురోజుకూ మరిన్ని మలుపులు తిరుగుతోంది. ప్రేమ వ్యవహారం.. పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యగా భావిస్తున్న ఈ కేసు దర్యాప్తులో తాజాగా మరో విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా.. తన ప్రియుడు చేతన్‌ను ఇప్పటికే రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ పరిణామం కేసు విచారణను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తోంది.

నిశ్చితార్థానికి ముందే రహస్య పెళ్లి

పోలీసుల కథనం ప్రకారం.. వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో సియాకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు వీరిద్దరికీ వచ్చే నవంబర్‌లో వివాహం జరిపించాలని నిశ్చయించారు. అయితే సియాకు కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదని, ఆమె అప్పటికే చేతన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు విచారణలో తేలింది. ఇరు కుటుంబాలకు తెలియకుండా సుమారు నాలుగు నెలల క్రితమే పుణెలోని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో సియా, చేతన్ ప్రత్యేక వివాహ చట్టం కింద రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వివాహానికి వారిద్దరి సన్నిహిత స్నేహితులు ఇద్దరు సాక్షులుగా సంతకాలు కూడా చేసినట్లు సమాచారం.

వాట్సాప్ చాట్స్, డిజిటల్ ఆధారాలే కీ పాయింట్

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సియా, చేతన్ మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విశ్లేషించారు. వారి వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డులు, ఇతర డిజిటల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించగా ఈ రహస్య వివాహానికి సంబంధించిన గుట్టు రట్టయింది. ప్రస్తుతం ఈ వివాహానికి సంబంధించిన అధికారిక రిజిస్ట్రేషన్ పత్రాలు నిజమైనవేనా? ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం సర్టిఫికేట్ జారీ అయిందా? అనే కోణంలో పోలీసులు ధృవీకరణ ప్రక్రియను చేపట్టారు.

కీలకమైన ఇన్‌స్టాగ్రామ్ ఆధారాలు

రహస్య వివాహం అనంతరం సియా తన ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని వివాహ ఫొటోలను పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ తర్వాత ఆమె వాటిని డిలీట్ చేసింది. ప్రస్తుతం సాంకేతిక నిపుణుల సహాయంతో ఆ ఫొటోలను రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇవి లభిస్తే కేసులో అత్యంత బలమైన డిజిటల్ సాక్ష్యాలుగా మారనున్నాయి.

ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్‌తో హత్య

జూన్ 18న పుణెలోని చారిత్రక లోహగఢ్ కోట సమీపంలో కేతన్ అగర్వాల్ లోయలో పడి మృతి చెందిన ఘటన మొదట ప్రమాదంగానే అందరూ భావించారు. కానీ ఘటనాస్థలిలో లభించిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలు, నిందితుల కాల్ డేటా ఆధారంగా ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అని పోలీసులు తేల్చారు. చేతన్‌తో తన రహస్య పెళ్లి విషయం బయటపడకుండా ఉండేందుకు అలాగే తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే సియా, తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను హతమార్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టమైంది.

ప్రస్తుతం సియా, చేతన్ ఇద్దరూ పోలీసు కస్టడీలో ఉన్నారు. వారి రహస్య వివాహం, సోషల్ మీడియా పోస్టులు, డిజిటల్ కమ్యూనికేషన్స్, అలాగే వీరి వెనుక ఏవైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.