లైకులు, షేర్ల కోసం పనంగా ప్రాణాలు.. ఫూణె ఉదంతం చెప్తున్నది ఇదే..
సోషల్ మీడియాలో వచ్చే లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలను, స్నేహితుల జీవితాలను పణంగా పెట్టడం విచారకరం.
By: Tupaki Political Desk | 24 March 2026 4:58 PM ISTసోషల్ మీడియాలో వచ్చే లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలను, స్నేహితుల జీవితాలను పణంగా పెట్టడం విచారకరం. ‘రీల్స్’ పిచ్చి ఎంతలా ముదిరిపోయిందంటే.. చేతిలో ఉన్నది నిజమైన గన్ అని, అది పేలితే ప్రాణాలు పోతాయని తెలిసినా.., కేవలం ఒక ఫొటో కోసం అంతటి సాహసానికి ఒడిగట్టడం విచక్షణారాహిత్యానికి నిదర్శనం. పుణెలో జరిగిన ఈ ఘటన కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే నేటి యువతకు ఒక గట్టి హెచ్చరిక. లైసెన్స్ లేని తుపాకీతో విన్యాసాలు చేస్తూ ఒక నిండు ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టిన ఈ ఉదంతాన్ని పరిశీలిస్తే..
గన్‌తో ఫోటోషూట్
మహారాష్ట్రలోని పుణె, కేశవనగర్‌లో నలుగురు స్నేహితులు యువరాజ్ గైక్వాడ్ (19), ఓం దుర్గా గైక్వాడ్ (19), సోను (21) ఒక మైనర్ బాలుడు కలిసి వినూత్నంగా ఏదో చేయాలని భావించారు. ఇందుకు వారు ఒక లైసెన్స్ లేని దేశీయ తుపాకీని సంపాదించారు. ఆ తుపాకీతో స్టైల్‌గా ఫోటోలు, వీడియోలు తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఆ ఉత్సాహం కాస్తా క్షణాల్లో విషాదంగా మారుతుందని ఊహించలేకపోయారు.
నడుములోకి దూసుకెళ్లిన బుల్లెట్!
ఫోటోషూట్ మధ్యలో సోను అనే యువకుడు సరదా కోసం ఆ తుపాకీని మైనర్ బాలుడి వైపు గురిపెట్టి జోక్ చేశాడు. కానీ, అనూహ్యంగా ఆ తుపాకీ పేలిపోయింది. బుల్లెట్ నేరుగా ఆ బాలుడి నడుము భాగంలోకి దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో ఆ బాలుడు కుప్పకూలిపోవడంతో, భయాందోళనకు గురైన స్నేహితులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఒక చిన్న 'జోక్' ఇప్పుడు ఒకరి జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది.
ముగ్గురు యువకుల అరెస్ట్!
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పుణె పోలీసులు తక్షణమే స్పందించి సోనుతో పాటు మిగిలిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. నిందితులపై హత్యాయత్నం, అక్రమ ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కేవలం రీల్స్ మోజులో పడి ఇలా చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ, అసలు ఆ దేశీయ తుపాకీ వీరి వద్దకు ఎలా వచ్చింది? దీని వెనుక ఏదైనా ముఠా ఉందా? అనే కోణంలో కూడా లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణాల కంటే లైకులే మిన్ననా?
నేటి తరం యువతలో సోషల్ మీడియా గుర్తింపు కోసం విపరీతమైన ఆరాటం కనిపిస్తోంది. ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం, ఆయుధాలతో ఫోటోలు దిగడం వంటివి గొప్పగా భావిస్తున్నారు. కానీ, ఆ క్షణికమైన ఆనందం వెనుక ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో గ్రహించలేకపోతున్నారు. తుపాకీ వంటి ప్రాణాంతక ఆయుధాలను ఆడుకునే వస్తువులుగా చూడడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
యువత పెడదోవ పడుతున్న తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహాలు, వారి అలవాట్లపై నిఘా ఉంచడం అత్యంత అవసరం. అక్రమ ఆయుధాలు యువత చేతుల్లోకి రావడం అనేది సమాజ భద్రతకు కూడా ముప్పు. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టవద్దని యువతకు అవగాహన కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ దొరికితే కెరీర్ నాశనం అవ్వడమే కాకుండా, స్నేహితుల ప్రాణాలను కూడా బలిగొన్న వారవుతారని ఈ పుణె ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
