అలెర్ట్: ప్రొఫెసర్ అని చెప్పి.. రెండున్నర కోటి కొట్టేసిన నేరగాడు.. ఎక్కడంటే?
ప్రపంచ దేశాలు టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి. ఓ పక్క టెక్నాలజీ పెరిగిపోతుంటే మరోపక్క ఈ టెక్నాలజీ వల్ల ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.
By: Madhu Reddy | 12 Sept 2025 9:00 PM ISTప్రపంచ దేశాలు టెక్నాలజీలో దూసుకుపోతున్నాయి. ఓ పక్క టెక్నాలజీ పెరిగిపోతుంటే మరోపక్క ఈ టెక్నాలజీ వల్ల ఎన్నో సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు మొదలుపెట్టారు. అయితే తాజాగా ప్రొఫెసర్ ని అంటూ చెప్పుకొని ఏకంగా విశ్వవిద్యాలయం నుండి కోట్లు కొట్టేసిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. మరి ఇంతకీ అది ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా పూణేలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయ అధికారి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. సైబర్ నేరగాళ్లు పూణేలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఫోన్ చేసి నేను ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ను అంటూ నమ్మబలికారు. అంతేకాదు బాంబే యూనివర్సిటీ పేరు చెప్పుకొని ఐఐటి బాంబే యూనివర్సిటీ నుండి ఫోన్ చేస్తున్నాను.నేను ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. మీకు కోట్ల విలువ చేసే కొన్ని ప్రాజెక్టులు అప్పజెప్పుతాను అంటూ నమ్మ బలికాడు. అయితే ఇదంతా మోసం అని తెలియని ఆ ప్రైవేటు విశ్వవిద్యాలయ అధికారి ఫోన్లో మాట్లాడేది నిజంగానే ఐఐటి ప్రొఫెసర్ అని నమ్మి వాళ్ళు చెప్పేవన్నీ విన్నారు.
అలా కొద్ది రోజులయ్యాక రూ.28 కోట్ల విలువ చేసే పలు ప్రాజెక్టులను మీ విశ్వవిద్యాలయానికి ఇస్తామని చెప్పారు. అయితే ఇదంతా నిజం అని నమ్మిన ఆ ప్రైవేటు విశ్వవిద్యాలయ అధికారి ఓకే చెప్పారు. ఆ తర్వాత మీకు ఈ ప్రాజెక్టు ఇవ్వాలంటే మొదట కొన్ని డబ్బులను అడ్వాన్స్ గా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి.. మొదట రూ.56 లక్షలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అలా చాలాసార్లు కొన్ని ప్రాజెక్టుల పేర్లు చెప్పి ఎలాంటి ప్రాజెక్టు వర్కులు విశ్వవిద్యాలయానికి ఇవ్వకుండానే దాదాపు 2.46 కోట్లు నొక్కేశారు. అంతేకాదు త్వరలోనే మీ విశ్వవిద్యాలయానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి వస్తున్నాం అని ఆ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన అధికారితో చెప్పారు.
అయితే ఇదంతా నిజమేనని నమ్మిన అధికారి ఐఐటి బాంబే ప్రొఫెసర్ ఇంకా రావడం లేదని చాలా రోజులు ఎదురు చూసాడు. కానీ ఆ తర్వాత ఎవరూ రాకపోవడంతో చివరికి ఐఐటి బాంబే ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి అసలు విషయం అడగగా..నేను ప్రాజెక్టు పేరుతో ఎలాంటి ఒప్పందాలు చేయలేదు అనే నిజం బయటపెట్టారు. ఇక ప్రొఫెసర్ చెప్పిన మాటలు విన్న ఆ ప్రైవేట్ యూనివర్సిటీ అధికారి మోసపోయామని అర్థం చేసుకొని వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలా జూలై 25 నుండి ఆగస్టు 7 మధ్య జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
