కోడలి కోరికను గౌరవించి కేతన్‌ను ఒప్పించి కోటకు పంపింది తల్లే... జీవితాంతం వెంటాడే కన్నీటి గాథ!
పెళ్లి పీటలు ఎక్కాల్సిన కొడుకు.. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన కోడలు.. కళ్లముందు ఎన్నో రంగుల కలలు.. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఒక తల్లి నమ్మకం ముక్కలైపోయింది.
By: A.N.Kumar | 24 Jun 2026 3:23 PM ISTపెళ్లి పీటలు ఎక్కాల్సిన కొడుకు.. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన కోడలు.. కళ్లముందు ఎన్నో రంగుల కలలు.. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఒక తల్లి నమ్మకం ముక్కలైపోయింది. పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు కేవలం ఒక నేరవార్త మాత్రమే కాదు.. ఒక తల్లి పేగు బంధం, ఆమె నమ్మిన మానవత్వం ఎంత దారుణంగా మోసపోయాయో చెప్పే గుండెను పిండేసే విషాద గాథ.
సొంత కూతురిలా చూసుకున్నా...
కేతన్ తల్లి సియా గోయల్‌ను ఎన్నడూ కోడలిలా చూడలేదు. అమ్మాయి లేని వెలితిని పూరిస్తూ ఆమెను తన సొంత కూతురిలా గుండెల్లో పెట్టుకుంది. "కేతన్ ఎప్పుడైనా ఆమెతో కఠినంగా మాట్లాడితే నేను సహించేదాన్ని కాదు. ఎప్పుడూ ఆమెను గౌరవించమని చెప్పేదాన్ని" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన తీరు వింటుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. సియా చెప్పిన అబద్ధాలను నిజమని నమ్మి ఆమె అమాయకత్వాన్ని ప్రేమించింది ఆ తల్లి. గతంలో ఒక ప్రేమ కథ ముగిసిపోయిందని చెబితే గతాన్ని వదిలేసి వర్తమానాన్ని ఆదరించింది. కానీ ఆ నమ్మకమే తన కొడుకు ప్రాణాలకు ముప్పవుతుందని ఆమె ఊహించలేకపోయింది.
ఒక్క నిర్ణయం... జీవితాంతం తీరని పశ్చాత్తాపం!
వివాహానికి ముందు కుటుంబమంతా కలిసి బాలి వెళ్లాలని కేతన్ ఎంతో ఆశపడ్డాడు. కానీ పెళ్లికి ముందు కేతన్‌తో ఒంటరిగా గడపాలని ఉందంటూ సియా చేసిన ఫోన్ కాల్ ఆ తల్లి మనసును కరిగించింది. కోడలి కోరికను గౌరవించి కేతన్‌ను ఒప్పించి లోహగడ్ కోటకు పంపింది ఆమే. "నా కొడుకుతో నేను మాట్లాడిన చివరి మాటలు... 'సియాను జాగ్రత్తగా చూసుకో... ఆమెను ఇబ్బంది పెట్టొద్దు' అన్నవే. అవే ఇప్పుడు నన్ను ప్రతి క్షణం వెంటాడుతున్నాయి..."
ఆమె నోటి నుంచి వచ్చిన ఈ మాటలు వింటే రాయి లాంటి గుండె కూడా కరిగిపోతుంది. తాను ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన చేతులే.. తన కొడుకు ఊపిరి తీయడానికి కుట్ర పన్నాయని తెలిశాక ఆ తల్లి గుండె ఎలా తట్టుకోగలదు? ఆ నిర్ణయం వల్లే తన కొడుకును కోల్పోయాననే పశ్చాత్తాపంతో ఆమె క్షణక్షణం కుంగిపోతోంది. తరచూ స్పృహ తప్పిపోతూ జీవచ్ఛవంలా మారింది.
న్యాయం కోసం ఆక్రందన
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. సియా గోయల్ తన ప్రియుడితో కలిసి కేతన్‌ను హత్య చేసేందుకు క్రూరమైన కుట్ర పన్నినట్లు తేలింది. ఇంత జరుగుతున్నా "కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లింది కేతనే కాబట్టి అతడిదే తప్పు" అంటూ సియా కుటుంబం తమపై ఒత్తిడి తెస్తోందని ఆ తల్లి ఆరోపించడం మరింత దారుణం.
ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రేమ, నమ్మకం అనే పదాలకే అర్థం మార్చేసింది. నిపుణులు చెబుతున్నట్లు.. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని మొత్తం మహిళలకో కోడళ్లకో ఆపాదించలేం. నేరానికి బాధ్యత వ్యక్తులదే. కానీ ఒక తల్లిగా ఆమె అనుభవిస్తున్న నరకయాతనకు, కోల్పోయిన కొడుకు ప్రాణానికి సమాధానం ఎవరు చెబుతారు?
తన కోడలిని జాగ్రత్తగా చూసుకోమన్న ఆ తల్లి చివరి మాటలు.. ఇప్పుడు ఒక శాపమై ఆమె జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోవచ్చు.. కోర్టులు తీర్పులు ఇవ్వచ్చు.. కానీ ఆ కన్నతల్లి గుండెకు తగిలిన గాయానికి.. ఆమె అనుభవిస్తున్న పశ్చాత్తాపానికి ఏ న్యాయస్థానం ఉపశమనం కలిగించగలదు? కేతన్ ఆత్మకు శాంతి కలగాలని, ఆ తల్లికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.
