Begin typing your search above and press return to search.

పులివెందుల కావాలి...హీటెక్కి పోతోందిగా !

ఇదిలా ఉంటే కడప జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత అయితే రెండు జెడ్పీటీసీ సీట్లూ టీడీపీవే అని సంచలన ప్రకటన చేశారు.

By:  Satya P   |   8 Aug 2025 8:02 PM IST
పులివెందుల కావాలి...హీటెక్కి పోతోందిగా !
X

ఏపీ రాజకీయాలలో ఇపుడు హాట్ ఫేవరేట్ ఏదీ అంటే పులివెందుల జెడ్పీటీసీ సీటు. ఏపీలో వందల్లో జడ్పీటీసీ సీట్లు ఉన్నాయి. కానీ ఏ సీటుకూ లేని ప్రత్యేకత పులివెందులకు ఉంది. అన్నీ ఒక ఎత్తు. పులివెందుల మరో ఎత్తు. అందుకే ఈ సీటు కోసం కూటమి వర్సెస్ వైసీపీగా పోరు సాగుతోంది. రెండు వైపులా మోహరించి అంతా సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.

2024 తరువాత మరోసారి :

ఏపీలో 2024 ఎన్నికలు టీడీపీకి తన మొత్తం రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుతాలను సృష్టించింది. 144 సీట్లకు టీడీపీ పోటీ చేస్తే తొమ్మిది సీట్లను మాత్రమే కోల్పోయి అన్నింటినీ గెలుచుకుంది. ఆ విధంగా స్వీట్ విక్టరీగా టీడీపీ హిస్టరీలో నమోదు అయింది. అయితే ఇపుడు అలాంటి స్వీటెస్ట్ విక్టరీ కోసం టీడీపీ చూస్తోంది. అదే పులివెందుల జెడ్పీటీసీ సీటు.

బాబు కోరిక అదే :

పులివెందుల జెడ్పీటీసీ సీటును గెలుచుకుని రండి అని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పార్టీలకు ఒక గట్టి టార్గెట్ ఇచ్చారు. ఆయన కూటమి పార్టీలకు చెందిన నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతా కలసి పట్టుదలగా పనిచేస్తే జెడ్పీటీసీ టీడీపీ వశం అవుతుందని అన్నారు. గెలుచుకుని రండి అభివృద్ధి ఏంటో చేసి చూపిద్దామని బాబు చెప్పారు. జగన్ చేయని విధంగా అభివృద్ధిని టీడీపీ కూటమి చేసి చూపిస్తుందని హామీ ఇచ్చారు. తానే పులివెందుల అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి పెడతాను అని కూడా బాబు చెప్పారు.. బాబు నిర్వహించిన ఈ టెలికాన్ఫరెన్స్ పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి తదితర కూటమి నేతలు పాల్గొన్నారు.

రెండు సీట్లూ టీడీపీవే :

ఇదిలా ఉంటే కడప జిల్లా ఇంఛార్జి మంత్రి సవిత అయితే రెండు జెడ్పీటీసీ సీట్లూ టీడీపీవే అని సంచలన ప్రకటన చేశారు. కడప జిల్లాలోని ఒంటిమెట్ట, పులివెందులలలో రెండు జెడ్పీటీసీలకు ఉప ఎన్నిక ఈ నెల 12న జరగనుంది. దాంతో ఇంచార్జి మంత్రిగా ఆమె కూడా పూర్తి దృష్టి ఆ వైపు పెట్టారు. గత ఏడాది కాలంగా అనేక సంక్షేమ పధకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశామని ఆ కార్యక్రమాలే టీడీపీని గెలిపిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేసారు. తమవి సూపర్ సిక్స్ పధకాలు అని వైసీపీవి రప్పా రప్పా రాజకీయాలని ఆమె విమర్శించారు. ప్రజలు ఈ విషయం అర్ధం చేసుకున్నారు కాబట్టి సంచలన ఫలితాలు నమోదు అవుతాయని ఆమె జోస్యం చెప్పారు.

కడప రెడ్డమ్మ జోరు :

ఇదిలా ఉంటే కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవీ రెడ్డి సవాల్ గా పులివెందుల జెడ్పీటీసీ సీటుని తీసుకున్నారు. ఆమె విస్తృతంగా జనంలో పర్యటిస్తున్నారు. కడపలో వైసీపీని చాలా ఏళ్ళ తరువాత టీడీపీ ఓడించింది. ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకున్న మాధవీ రెడ్డి వై నాట్ పులివెందుల అంటున్నారు. జగన్ సొంత నియోజకవర్గంలో వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట లాంటి పులివెందుల సీటుని గెలుచుకుంటే ఆ మజాయే వేరు కదా అన్నదే కూటమి నేతల ఆలోచనగా ఉంది. దాంతో వ్యూహ రచనను పదునుగానే అమలు చేస్తున్నారు/

వైసీపీ ధీటుగానే :

మరో వైపు చూస్తే వైసీపీ కూడా తమ సొంత సీటుని వదులుకునేది లేదని పట్టుదలగా పనిచేస్తోంది. జగన్ అంటే అభిమానం ఉన్న వారు అంతా పులివెందులలో ఉన్నారు అని వారు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఈసారి ఎన్నికల్లో మళ్ళీ గెలిచి వైసీపీ సత్తా ఏమిటో చూపిస్తామని అంటున్నారు. మొత్తానికి చూస్తే పులివెందుల హోరా హోరీగానే ఉంది అని అంటున్నారు.