పులివెందులలో రీ పోలింగ్...డిమాండ్ వెనక ?
రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈ మేరకు కడప ఎంపీ వైసీపీ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు.
By: Satya P | 13 Aug 2025 12:22 AM ISTపులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీలకు రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు చోట్ల ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ రెండు సీట్లలో అధికార తెలుగుదేశం పోలీసుల సాయంతో అక్రమాలు చేసింది అని విమర్శిస్తోంది. అందుకే తిరిగి ఎన్నికలు పెట్టాలని కోరుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఈ మేరకు కడప ఎంపీ వైసీపీ నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు.
అవకాశాలు ఉన్నాయా :
రెండు బలమైన పార్టీలు కనుక ఢీ అంటే ఢీ అంటూ పోరాడితే ఎన్నికల్లో ఉద్రిక్తతలు ఉంటాయి. అయితే ఉప ఎన్నికల సమయంలో అధికార పార్టీకి కొంత వెసులుబాటు ఉంటుంది. అంతమాత్రం చేత ప్రజలు అంతా అధికార పార్టీకి జై కొడతారని కూడా అనుకోవడానికి వీలు లేదు. అదే సమయంలో ఉప ఎన్నికల్లో ఓడిన అధికార పార్టీలు కూడా ఉన్నాయి. అయితే అక్రమాలు జరిగినట్లుగా రుజువులు బలంగా ఉంటే కనుక ఎన్నికల సంఘం ఏమైనా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మొత్తం పోలింగ్ బూతులకు ఎన్నికలు పెట్టాలా లేక కొన్ని చోట్ల మాత్రమేనా అన్నది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. ఏకంగా ఎన్నికలు రద్దు చేయడం అంటే అది అంత ఆషామాషీగా అయ్యేది కాదు.
న్యాయ పోరాటం చేసినా :
మరో వైపు చూస్తే తమ వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని వైసీపీ చెబుతోంది. దీని మీద ముందుగా ఈసీని కలసి వినతి చేయడం అక్కడ కూడా ఏమీ స్పందన లేకపోతే న్యాయ పోరాటం ద్వారా తేల్చుకోవాలని భావిస్తోంది. తమ ఊరి వారు కాదని బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఓట్లేశారు అని వైసీపీ ఆరోపిస్తోంది. దానికి తోడు పోలీసు బలగాలు అధికార పార్టీకి సహకరించారని నిందిస్తోంది. ఇక ఓటర్లు కాళ్లా వేళ్ళా పడినా కొన్ని పోలింగ్ బూతులలో ఓటేయనీయలేదని కూడా చెబుతోంది. ఈ ఆధారాలు అన్నీ సమర్పిస్తామని అంటోంది.
కేంద్ర బలగాలతో ఎన్నికలు :
ఈ డిమాండ్ చేస్తోంది వైఎస్ జగన్. ఆయన పులివెందుల ఒంటిమెట్ట ఎన్నికలను టీడీపీ హైజాక్ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా జరిగిన ఎన్నికలు అంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యం అన్నది డొల్లగా ఏపీలో మారిందని ఆయన విమర్శించారు. పూర్తిగా విలువలకు పాతరేసి జరిపించిన ఎన్నికలు ఇవి అని అన్నారు.
ఏం జరగనుంది :
పులివెందుల ఒంటిమెట్టలలో టీడీపీ తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని అంటోంది. తొలిసారి పులివెందుల కోట మీద తమ పార్టీ జెండా ఎగరబోతోంది అని చెబుతోంది. అయితే ఈ ఎన్నికలు నిజానికి సవ్యంగా జరగలేదని అందుకే తాము గుర్తించమని వైసీపీ అంటోంది. తిరిగి ఎన్నికలు అన్న డిమాండ్ ని చేస్తోంది. కానీ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏమి జరగనుంది అన్నదే చర్చగా ఉంది. కేవలం పది నెలల సమయం మాత్రమే ఉంది. అతి చిన్న ఎన్నికలు ఇవి. అయినా ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు తీసుకున్నాయి. దాంతో ఈ రకమైన ఉద్రిక్తతలు జరుగుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా సీరియస్ యాక్షన్ అయితే ఉంటుందా లేక షరా మామూలుగా కధ సాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.
