Begin typing your search above and press return to search.

తాజా ఓటమితో జగన్ సామ్రాజ్యం కూలిందా?

అప్పటి సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యిందని చెప్పాలి. అయితే..కొందరు కుప్పాన్ని.. పులివెందులను ఒకేలా చూడలేమని చెబుతారు.

By:  Garuda Media   |   15 Aug 2025 11:16 AM IST
తాజా ఓటమితో జగన్ సామ్రాజ్యం కూలిందా?
X

ఒక్క ఓటమి దశాబ్దాల పాటు నిర్మించిన ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కూలదోసినట్లా? అంటే.. అవునని కొందరు అంటే.. మరికొందరు ఒక చూపు చూస్తారు. నిజమే.. రాజరికంలో.. రాజ్యాల మధ్య యుద్ధాల్లో ఓటమితో సామ్రాజ్యాలు కూలిపోవటం.. కొత్త శకం షురూ కావటం మామూలే. అయితే.. ఇదే తీరును ప్రజాస్వామ్యంలో పోల్చి చెప్పటం తప్పే అవుతుంది. ఎందుకంటే.. ఎన్నికల భారతంలో చోటు చేసుకుంటున్న మార్పులే దీనికి కారణం. గతంలో రాజకీయ పార్టీలు తమ గీతను దాటేందుకు పెద్దగా ఇష్టపడేవి కావు.

రాజకీయంగా ఎంత పంచాయితీ ఉన్నా.. అవన్నీ కొన్ని అంశాలకే పరిమితం చేసే వారే తప్పించి.. వ్యక్తిగత కక్షలకు వెళ్లటం.. ఏది ఏమైనా గుణపాఠం నేర్పించాల్సిందే అన్నట్లుగా వ్యవహరించటం.. టార్గెట్ చేసిన పాయింట్ ను చేరుకోవటానికి ఎంత వరకు వీలైతే అయితే అంత వరకు వెళదామన్నట్లుగా వ్యవహరించే తీరు ఈ మధ్యనే తెలుగు రాజకీయాల్లో మొదలైంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పులివెందుల వారికి పొలిటికల్ అడ్డాగా మారింది.

వైఎస్ కుటుంబం నుంచి ఎవరిని బరిలోకి దించినా గెలుపు వారిదే అన్నట్లుగా పులివెందుల ఉండేది. ఎన్నిక ఏదైనా.. వైఎస్ కుటుంబానిదే విజయంగా ఉండేది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉండే పులివెందుల జెడ్పీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురుకావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సందర్భంగా కొందరు మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజా ఓటమిని ఘోర పరాభవంగా.. వైఎస్ కుటుంబానికి కొండంత అండగా నిలిచే పులివెందుల ఓటమితో వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం కూలినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ తరహా వ్యాఖ్యల్లో పస లేదన్న విషయాన్ని రాజకీయంగా అవగాహన ఉన్న వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో.. అధికార పార్టీ ఒకసారి డిసైడ్ అయితే.. ప్రత్యర్థికి ఎంత బలం ఉన్నప్పటికి ఓటమి పరిచయం కావటం ఈ మధ్యన అలవాటుగా మారింది. విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు పెట్టనికోటగా ఉండే కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏమయ్యాయి? ఆ సందర్భంలో ఎదురైన ఓటమితో ఇదే రీతిలో చంద్రబాబు సామ్రాజ్యం కుప్పకూలినట్లుగా ప్రచారం చేశారు.కట్ చేస్తే.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఏ స్థాయిలో విజయం సాధించారో తెలిసిందే.

అప్పటి సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యిందని చెప్పాలి. అయితే..కొందరు కుప్పాన్ని.. పులివెందులను ఒకేలా చూడలేమని చెబుతారు. కానీ.. ఆ వాదనలో వాస్తవం లేదు. వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల ఎలానో.. చంద్రబాబుకు కుప్పం అలాంటిది. రాజకీయంగా టార్గెట్ చేసినప్పుడు.. అధినాయకుడి బలం మీద దెబ్బ కొట్టే క్రమంలో.. అధినాయకుడ్నే టార్గెట్ చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. తాజా ఎన్నికల ఫలితాన్ని ఈ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఒకవేళ.. జగన్ ఇమేజ్ మసకబారిందనే అనుకుందాం. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైన పార్టీ అధినేత.. రోడ్ల మీదకు వచ్చినప్పుడు ఆయనకున్న అభిమానగణం ఎంతన్న విషయం తరచూ ఎదురవుతూనే ఉంది. ఇంతటి ప్రజాదరణ ఉన్న అధినేత ఇలాకాలో ఎదురైన ఓటమిని రాజకీయకోణంలోనే చూడాలే తప్పించి.. ఇమేజ్ కొలతలతో చూడటం తప్పే అవుతుంది.

మారిన తెలుగు రాజకీయాల నేపథ్యంలో కొన్ని ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని కొత్త కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో అధికారంలో ఎవరు ఉంటే వారికి అనుకూలంగా ఫలితాలు రావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ముఖ్యంగా అధినేతలు ప్రాతినిథ్యం వహించే ప్రాంతాలు.. వారు ప్రతిష్టాత్మకంగా తీసుకునే స్థానాల్లో వారికి ఓటమిని పరిచయటం చేయటం ద్వారా.. వారి స్థైర్యాన్ని దెబ్బ తీయటమనే మైండ్ గేమ్ కు తెర తీస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో తిరుపతి ఉప ఎన్నిక.. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలు దీనికి నిదర్శనంగా చెప్పాలి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే జగన్ కు చంద్రబాబు చేతిలో ఎదురైందని చెప్పక తప్పదు.