పులివెందులలో పోలీసుల కాళ్లు పట్టుకున్న ఓటర్లు.. రీజనేంటి?
వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం పులివెందులలో జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
By: Garuda Media | 12 Aug 2025 4:39 PM ISTవైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గం పులివెందులలో జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అయితే.. పరిస్థితి మాత్రం తీవ్ర టెన్షన్‌గానే ఉంది. ఏకంగా 2000 మంది కి పైగా పోలీసులు పులివెందులలో భద్రత ఏర్పాటు చేశారు. ఉన్నవి 10,600 ఓట్లే అయినా.. ఈ ఎన్నికను టీడీపీ, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
దీంతో పోటా పోటీ ప్రచారంతోపాటు.. ఓటర్ను ఆకర్షించేలా ఇరు పార్టీలూ వ్యూహప్రతివ్యూహాలతో ముందు కు సాగాయి. ఇక, తాజాగా పోలింగ్ ప్రారంభానికి ముందే.. పోలీసులు అటు టీడీపీలో ఉన్న ఎమ్మెల్సీ సహా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారు. చాలా మంది నాయకులను గృహ నిర్బంధం చేశారు. అయి నప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎవరికి వారు రెచ్చగొట్టుకునే ధోరణినే అవలంభిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు అధికార పక్షం పులివెందులలోనే తిష్ట వేసింది.
ఇక, వైసీపీ నాయకులు కూడా అక్కడే ఉన్నారు. ఇదిలావుంటే.. పులివెందులలోని రెండు మండలాలకు చెందిన ఓటర్లకు 4 కిలో మీటర్ల దూరంలోని పోలింగ్ బూతులను కేటాయించారు. దూరాభారం అయినా.. ఓటర్లు అక్కడికి వెళ్లి తమ హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, పోలీసులు తమను వెళ్లనివ్వడం లేదని ఆరోపిస్తూ.. పోలీసుల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది కూడా వివాదంగా మారడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అయితే, ఓటు హక్కుఉన్న తమను ఎందుకు పోనివ్వరని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు.. తమ ఓటరు స్లిప్పులను కొందరు బలవంతంగా లాగేసుకున్నారని 150 మంది ఓటర్లు పులివెందుల అడ్డాలో ధర్నాకు దిగారు. తాము ఓటు వేసేందుకు వెళ్తుండగా కొందరు వచ్చి తమ స్లిప్పులను లాక్కున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించాలని ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. టీడీపీ కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం అంటే ఏంటో పులివెందుల ప్రజలకు ఇప్పుడు తెలుస్తోందని.. మూడు దశాబ్దాలుగా వారిని ఓటు కూడా వేయనివ్వలేదని ఆరోపించారు. ప్రస్తుతం స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.
