Begin typing your search above and press return to search.

పులివెందులలో హైటెన్షన్.. గాలిలోకి పోలీసుల కాల్పులు

పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానంపై అధికార పార్టీ గట్టిగా ఫోకస్ చేసింది.

By:  Tupaki Political Desk   |   17 Oct 2026 4:13 PM IST
పులివెందులలో హైటెన్షన్.. గాలిలోకి పోలీసుల కాల్పులు
X

మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు సందర్భంగా అధికార, విపక్షాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు ముందుగా టియర్ గ్యాస్ ప్రయోగించారని చెబుతున్నారు. అప్పటికీ ఉద్రిక్తతలు సద్దుమణగకపోవడంతో గాలిలోకి కాల్పులు జరిపారని చెబుతున్నారు. పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారని అంటున్నారు. ఈ ఘటనకు అధికార టీడీపీదే బాధ్యత అంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారనే సమాచారంతో ఆయన నామినేషన్ సెంటర్ వద్దకు వచ్చారు.

పులివెందులలో హై టెన్షన్ నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఈ స్థానంపై అధికార పార్టీ గట్టిగా ఫోకస్ చేసింది. పులివెందులలో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్న విపక్ష వైసీపీ తన సర్వశక్తులు ఒడ్డుతోంది. దీంతో శనివారం నామినేషన్ల దాఖలు సమయంలో బలప్రదర్శనకు దిగిందని అంటున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా భారీగానే తరలివచ్చినట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు.

నామినేషన్ కేంద్రం వద్ద ఉన్న పోలీసులతోనే వైసీపీ నాయకులు గొడవ పడుతున్నారని తెలియడంతో పట్టణంలోనే ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎంపీ వచ్చిన తర్వాత గొడవ మరింత ఎక్కువ అయిందని అంటున్నారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ తోపాటు గాలిలోకి కాల్పులు జరిపారని చెబుతున్నారు. ఈ ఘటనలో తమ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని ఎంపీ అవినాశ్ రెడ్డి మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో పోలిసింగ్ అధ్వానంగా తయారైందని ఈ ఘటనతో రుజువైందని ఆయన విమర్శించారు. తాము పోలీసులతో పోరాడాల్సివస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై సాధారణ ప్రజానీకం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. నామినేషన్ల సమయంలోనే ఈ స్థాయిలో యుద్ధ వాతావరణం ఉండటంతో రానున్న రోజుల్లో పరిస్థితులు ఇంకెంత దారుణంగా తయారవుతాయోనని ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెబుతున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి ఎన్నికలు శాంతియుతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.