Begin typing your search above and press return to search.

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

ఏపీలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అవి రాజకీయంగా పవర్ ఫుల్ వైబ్రేషన్స్ కలిగి ఉంటాయి. వాటి పేరు చెప్పగానే జనాలకు ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి.

By:  Satya P   |   4 Nov 2026 5:00 AM IST
రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !
X

ఏపీలో కొన్ని ప్రాంతాలు ఉంటాయి. అవి రాజకీయంగా పవర్ ఫుల్ వైబ్రేషన్స్ కలిగి ఉంటాయి. వాటి పేరు చెప్పగానే జనాలకు ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. అలాంటిదే పులివెందుల. ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తు వచ్చే పేరు వైఎస్సార్. అవును పులివెందుల వైఎస్సార్ కుటుంబానికి కంచు కోట. నిన్నా ఈ రోజు నుంచి కాదు ఏకంగా అర్ధ శతాబ్దంగా పులివెందులను ఏలుతోంది వైఎస్సార్ కుటుంబీకులే. పులివెందులను వైఎస్సార్ కుటుంబానికి పెట్టని కోటగా మార్చిన వారు వైఎస్ రాజారెడ్డి. ఆయన పులివెందుల గ్రామ సర్పంచ్ గా కూడా పనిచేశారు. అలాగే ఆయన సతీమణి జగన్ మామ వైఎస్ జయమ్మ కూడా పులివెందులలో సర్పంచ్ గా ఉన్నారు.

తొలి రోజులలో :

రాజకీయాల మీద మొదట ఆసక్తిని పెంచుకున్నది వైఎస్ రాజారెడ్డి. వైఎస్సార్ డాక్టర్ గా ఉన్న కాలంలోనే ఆయన పులివెందుల గ్రామ పంచాయతీ రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. అలా వైఎస్ కుటుంబానికి పులివెందుల రాజకీయాల్లో బలమైన పునాది వేసింది ఆయనే అని చెబుతారు. . ఆయన సుదీర్ఘ కాలం పాటు పులివెందుల గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలా ఆయన బలమైన ముద్రను వైఎస్సార్ కుటుంబానికి వేశారు. ఆయన తరువాత రాజారెడ్డి సతీమణి వైఎస్సార్ తల్లి వైఎస్ జయమ్మ కూడా పులివెందుల సర్పంచ్‌గా సేవలు అందించారు. తదనంతర కాలంలో వైఎస్ రాజారెడ్డి సోదరుడు వైఎస్ ప్రకాష్ రెడ్డి కూడా పులివెందుల సర్పంచ్‌గా పనిచేశారు.

మున్సిపాలిటీ గా మారింది :

ఇక వైఎస్సార్ 2004లో ముఖ్యమంత్రి అయ్యాక పులివెందులను మునిసిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. అలా తొలి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తరఫున వైఎస్సార్ కుటుంబమే గెలిచి మున్సిపాలిటీ చైర్మన్ పదవిని అందుకుంది. వైఎస్సార్ సోదరుడు భార్య వైఎస్ ప్రమీలమ్మ పులివెందుల మున్సిపాలిటీకి తొలి చైర్‌ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలా పులివెందుల రాజకీయాలలో స్థానిక సంస్థలలో వైఎస్సార్ కుటుంబానికి మొదటి నుండి తిరుగులేని ఆధిపత్యం ఉంది. 2013లో కూడా మరోసారి వైఎస్సార్ కుటుంబమే అక్కడ చైర్మన్ పదవిని అందుకుంది. 2021లో కూడా వారే గెలిచారు. 2021లో జరిగిన పులివెందుల మున్సిపల్ ఎన్నికలలో వైఎస్సార్ కుటుంబానికి చెందిన వైఎస్ మనోహర్ రెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో మొత్తం 28 వార్డులకు గానూ అన్ని వార్డులనూ వైసీపీ ఏకగ్రీవంగా సొంతం చేసుకోవడం విశేషం.

తొలి ఓటమి :

అలా వైఎస్ రాజారెడ్డి పులివెందులలో బలమైన రాజకీయ కోటను కట్టి పదిలపరచిన దానిని జగన్ హయాంలో తూట్లు పడ్డాయి, బీటలు సైతం వారాయి. తాజాగా పులివెందులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన జగన్ చిన్నమ్మ వైఎస్ ప్రమీలమ్మ ఓటమి పాలయ్యారు. ఆమెపై పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థి తుగుట్ల గీతా కుమారి సుమారు 13,875 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇలా వైసీపీకి కంచుకోటగా భావించే పులివెందుల మున్సిపాలిటీలోని మొత్తం 40 వార్డులకు గాను టీడీపీ కూటమి టీడీపీ 34, బీజేపీ 2, జనసేన 1 అంటే ఏకంగా 37 వార్డులను సొంతం చేసుకోగా, వైసీపీ కేవలం 3 వార్డులకే పరిమితమైంది.

జగన్ ఇలాకాలో :

పులివెందుల ఎమ్మెల్యేగా కూడా నాలుగున్నర దశాబ్దాలుగా వైఎస్ కుటుంబమే నెగ్గుతూ వస్తోంది. జగన్ కూడా మూడు సార్లు ఎమ్మెల్యేగా అక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇపుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా జగన్ ఉండగా ఆయన పరిధిలోని పులివెందుల మునిసిపాలిటీ టీడీపీకి దక్కడం చూస్తే వైఎస్సార్ కుటుంబానికి ఇది రాజకీయంగా ఇరకాటంగా మారింది అని అంటున్నారు. పులివెందులలో పట్టున్న నాయకులు వైసీపీకి తగ్గిపోయారా లేదా జనంతో కనెక్షన్ తగ్గిందా అన్న చర్చ కూడా వస్తోంది. ఏది ఏమైనా ఇది వైఎస్సార్ ఫ్యామిలీకి అభిమానులకు అనుచరులకు జీర్ణించుకోలేని పరాజయంగా చెబుతున్నారు.