పులివెందులకు ఉప ఎన్నికలు ఖాయమా ?
పులివెందుల నిన్నటి దాకా నలిగింది. అది కేవలం ఒక జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నిక. అయితే ఇపుడు ఏకంగా జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికే ఉప ఎన్నికలు రాబోతున్నాయా అన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది.
By: Satya P | 5 Sept 2025 5:17 PM ISTపులివెందుల నిన్నటిదాకా నలిగింది. అది కేవలం ఒక జెడ్పీటీసీకి జరిగిన ఉప ఎన్నిక. అయితే ఇపుడు ఏకంగా జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికే ఉప ఎన్నికలు రాబోతున్నాయా అన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. పులివెందుల వైసీపీ ఫ్యామిలీకి కంచుకోట అన్న భ్రమలను కానీ ధీమాను కానీ తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు తేల్చేశాయి. అధికార పార్టీ దౌర్జన్యం అని వైసీపీ అనుకున్నా గెలుపు గెలుపుగానే చూస్తారు కాబట్టి ఆ కాడికి వైసీపీ ఓటమి తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. ఇపుడు పులివెందుల అసెంబ్లీకే కూటమి పెద్దలు గురి పెడుతున్నట్లుగా కనిపిస్తోంది.
అసెంబ్లీకి రాకుంటే వేటు :
వరసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి ఏ సభ్యుడు అయినా హాజరు కాకపోతే అటోమేటిక్ గా అనర్హత వేటు పడుతుంది అని అంటున్నారు. ఇది నిబంధనలలో ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే స్పీకర్ నోటీసులో ఉంచి ఆయన అనుమతితో కనుక సభకు గైర్ హాజరు అయితే మాత్రం ఈ నిబంధన వర్తించదు. ఇక చూస్తే కనుక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కావడం లేదు. పైగా బడ్జెట్ సెషన్ కి మాత్రం గవర్నర్ ప్రసంగం వేళ హాజరువ్తోంది. అయితే ఆ రోజు హాజరైనా దానిని లెక్కలోకి తీసుకోరని స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు జరిగినపుడు సభకు హాజరైతేనే పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు.
వైసీపీ మొత్తం మీద :
వైసీపీలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈసారి వర్షాకాల సమావేశాలు ఎవరు హాజరు కాకపోయినా ఆటేమేటిక్ గా వారి సభ్యత్వం రద్దు అవుతుంది అని అంటున్నారు. దీని మీద తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలే చేశారు. చందమామ కోసం చిన్న పిల్లవాడు మారాం చేసినట్లుగా జగన్ ప్రతిపక్ష హోదా గురించి పట్టుబడుతున్నారని అన్నారు జగన్ సభకు ఈసారి తప్పనిసరిగా హాజారు కావాల్సి ఉంటుందని అన్నారు. లేకపోతే పులివెందులకు ఉప ఎన్నికలు జరగడం ఖాయమని కూడా జోస్యం చెప్పారు. దీనిని బట్టి చూతే జగన్ సభకు ఈసారి గైర్ హాజరు అయితే మాత్రం ఆయన సభ్యత్వం పోతుందని రఘురామ చెప్పకనే చెబుతున్నారన్న మాట. తాను వయసులో పెద్దవాడిగా ఉప సభాపతిగా చెబుతున్నాను అని సభకు జగన్ హాజరు కావాలని ఆయన కోరారు.
ఉప ఎన్నికలు తధ్యమేనా :
ఇదిలా ఉంటే వైసీపీ మాత్రం సభకు గైర్ హాజరు కావాలనే భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయమే తీసుకుంటుందా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తం 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు అయితే ఉప ఎన్నికలు మూకుమ్మడిగా వస్తాయి. ఎటూ అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేస్తే వాటిని గెలుచుకోవచ్చు అన్న ధీమా కూడా ఉంది అని అంటున్నారు. దాని కంటే ముందు పులివెందులలో జగన్ ఎమ్మెల్యే సీటుని తీసుకోవడానికి కూటమి చూస్తోంది అని అంటున్నారు. ఓటమి ఎరగని వీరుడిగా జగన్ ఇప్పటిదాకా ఉన్నారు. అయితే అధికారం చేతిలో ఉంచుకుని సరైన వ్యూహాలను అమలు చేస్తూ గెలుపు తీరాలకు చేరుకుంటున్న కూటమి ముందు వైసీపీ గట్టిగా పోరాడక పోతే పులివెందుల అసెంబ్లీ సీటు అయినా ఓటమి తప్పదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా ఈసారి వర్షాకాల సమావేశాల తరువాత ఏపీ రాజకీయాల్లో కీలకమైన సంచలనమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
