పులివెందుల...వైసీపీ తప్పుకుంటుందా ?
పులివెందుల పేరు చెబితేనే రాజకీయంగా వైబ్రేషన్స్ వస్తాయి. పులివెందుల వైయస్సార్ ఫ్యామిలీకి పెట్టని కోట.
By: Satya P | 7 Aug 2025 12:23 PM ISTపులివెందుల పేరు చెబితేనే రాజకీయంగా వైబ్రేషన్స్ వస్తాయి. పులివెందుల వైయస్సార్ ఫ్యామిలీకి పెట్టని కోట. అటువంటి చోట ఇపుడు జెడ్పీటీసీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కురుక్షేత్ర సంగ్రామమే జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉండడంతో పాటు పులివెందుల ఇంచార్జ్ బీటెక్ రవి భార్య అభ్యర్థి కావడంతో మరినింత పట్టుదలగా పనిచేస్తున్నారు. పులివెందుల జగన్ సొంత ఇలాకా కావడంతో రాష్ట్ర స్థాయి టీడీపీ పెద్దలు సైతం ఫోకస్ పెట్టేశారు. దాంతో ఎటు చూసినా పులివెందుల జెడ్పీటీసీ అన్నది ఆషామాషీ ఎన్నిక కాదని అంటున్నారు.
వైసీపీకి ప్రతికూలత ఉందా :
వైసీపీకి ఇపుడు ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలు నిజంగా చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. నేరుగా జగన్ ఇమేజ్ కే అగ్ని పరీక్ష పెట్టనున్నాయి. పులివెందులలో ఒక చిన్న జెడ్పీటీసీకి ఇంత అలజడి అల్లరి చేస్తారా అని వైసీపీ అధినాయకత్వం కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయవచ్చు. కానీ పులివెందుల అంటే మామూలుది కాదని వారికీ తెలుసు. అందుకే ఇంతటి ప్రతిష్టగా తీసుకుంటున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే పులివెందులలో అంతా వైసీపీకి ప్రతికూలత కనిపిస్తోంది అంటున్నారు. అక్కడ నాయకులు బయటకు రావడానికే భయపడే వాతావరణం కనిపిస్తోంది అని చెబుతున్నారు.
ఎమ్మెల్సీకే గాయాలు :
వైసీపీకి చెందిన ఎమ్మెల్సీకే గాయాలు అయ్యాయి. ఇక సామాన్య నేతల పరిస్థితి ఏముంది అన్నదే చర్చగా ఉంది. స్వేచ్చగా ఎన్నికలు జరిగితే తాము ఓటమి పాలు అవుతామని భయంతోనే ఇలా అధికార కూటమి చేస్తోంది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు కానీ జరుగుతుంది చూస్తే ఇది ఎన్నికల రాజకీయం, వ్యూహాలు ఇలాగే ఉంటాయని అంటున్నారు. వాటిని తట్టుకుని గెలవాలి. లేదా వదిలేయాలి అన్నదే అంటున్నారు.
ఆ ఇద్దరే వైసీపీకి :
ఇక వైసీపీ ఇద్దరు నేతల మీద తన భారాన్ని అంతా మోపుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అలాగే సతీష్ రెడ్డిల మీదనే బాధ్యతలు ఉంచింది. అయితే ఈ ఇద్దరి విషయంలో క్యాడర్ ఎంతగా మమేకం అయి పనిచేస్తుంది అన్నది చర్చగా ఉంది. అంతే కాదు ఈ ఇద్దరి నేతలలో ఒకరి మీద వివేకా హత్య కేసు ఆరోపణలు ఉంటే మరొకరి విషయంలో నిన్నటిదాకా టీడీపీలో ఉండి వచ్చారు అన్న చర్చ ఉంది. ఇక ఈ ఇద్దరు నాయకులు మనస్పూర్తిగా కలసి పనిచేస్తున్నారా అన్నది మరో ప్రశ్నగా ఉందిట.
వివేకా మళ్ళీ సీన్ లోకి :
ఇక అన్నిటికంటే ఇబ్బంది పెట్టే విషయం ఏమిటి అంటే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు మళ్ళీ చర్చనీయాంశం అవుతోంది. వివేకాకు పులివెందులలో ఎంతో అనుబంధం ఉంది. ఆయన హత్య కేసుని ప్రత్యర్ధులు కావాలని కెలుకుతున్నారు అది రాజకీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారుతోంది. మరో వైపు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కూడా అభ్యర్ధిగా బరిలో ఉండడం. దాంతో వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి.
అంగబలం అర్ధబలం :
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో ముందు నుంచి ఒక పధకం ప్రకారం టీడీపీ వ్యవహరిస్తోంది. దానికి తోడు అంగబలం అర్ధ బలం కూడా ఆ వైపు నిండుగా ఉన్నాయి. దాంతో మొత్తానికి మొత్తం పార్టీ నేతలు మోహరించేశారు. పులివెందులలో పసుపు జెండా ఎగరేయాలన్న కసితో పనిచేస్తున్నారు. వ్యూహాలను సైతం చలా గట్టిగానే అమలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పులివెందులలో నువ్వా నేనా పరిస్థితి ఉంది. అయితే వైసీపీ వైపున అభిమాన జనం ఉన్నా వారు బయటకు రాలేని స్థితిలో ఉందని అంటున్నారు.
వైసీపీ సంచలన నిర్ణయం :
అయితే పులివెందులలో జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తూ వస్తున్న వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో పునరాలోచన చేస్తుందా అన్నదే చర్చగా ఉంది. గెలుపు కోసం సర్వం ఒడ్డుతున్న టీడీపీ వైసీపీని పూర్తిగా ఇబ్బందుల్లో పెడుతోంది అని అంటున్నారు. ఎన్నికలు ఈ నేపధ్యంలో సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. దాంతో పులివెందులలో విద్వంశం సాకుగా చూపించి ఎన్నికలను బహిష్కరించాలని వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. పోటీ చేసి అనూహ్యంగా ఓటమి చెందడం కంటే పోటీ నుంచి తప్పుకుని కూటమి కుట్రలను ఎస్టాబ్లిష్ చేయడమే మేలు అన్నది కనుక వైసీపీ ఆలోచన అయితే ఆ పార్టీ నుంచి ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే వస్తుందని అంటున్నారు.
