ఉన్నవి '33 స్థానాలే' అయినా.. ఫ్లవర్ కాదు.. ఫైరే!
అది అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా ఉంటారు. కానీ, శాంతి భద్రతల అధికారం మాత్రం కేంద్రం పరిధిలో ఉంటుంది.
By: Garuda Media | 22 March 2026 9:30 AM ISTఅది అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా ఉంటారు. కానీ, శాంతి భద్రతల అధికారం మాత్రం కేంద్రం పరిధిలో ఉంటుంది. కేవలం 33 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితేనేం.. ముప్పేట అనేక చిక్కులు. నాయకులు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలకు అంతు ఉండదు. అదే.. పుదుచ్చేరి. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా పేరు తెచ్చుకుంది. ఇక్కడ వచ్చే నెల 9న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే.. చిన్న అసెంబ్లీ కదా.. చిన్న ఎన్నికలే కదా.. అని లైట్ తీసుకుంటే కుదరదు. ఎందుకంటే.. పెద్ద రాష్ట్రంతో సమానంగా ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండి.. ముఖ్యమంత్రి కూడా అయిన.. ఎన్ రంగస్వామి.. తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి `ఎన్ ఆర్ కాంగ్రెస్‌పార్టీ`ని పెట్టుకున్నారు. అంతేకాదు.. బీజేపీతో చేతులు కలిపి.. వరుసగా విజయాలు కూడా అందుకుంటున్నారు. మొత్తంగా నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లోనూ రంగస్వామి బీజేపీతోనే ముందుకు సాగుతున్నారు. మరోవైపు కాంగ్రె స్ తన మిత్ర పక్షం డీఎంకేతోకలిసి ఎన్నికలకు వెళ్తోంది. ఇదిలావుంటే.. అధికార రంగస్వామి కూటమి ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది. బీజేపీతో సీట్ల పంపకం ఖరారు చేసిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి ఒక కీలకమైన ఎన్డీఏ సమన్వయ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో 2021 నుంచి అధికారంలో ఉన్న ఈ కూటమిలో ఎన్నికల వేళ అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రంగస్వామి, కాంగ్రెస్‌లోనే ఎదిగి, 2011లో ఆ పార్టీ నుండి విడిపోయి ఏఐఎన్‌ఆర్‌సిని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ పునాదిని నిర్మించుకున్నారు. ఆయన అధికారం ఎన్నడూ కేవలం వాక్చాతుర్యం లేదా సిద్ధాంతాలపై ఆధారపడలేదు. అది ఆయన ఉనికి, ప్రజలకు అందుబాటులో ఉండటం, సంక్షేమ పథకాల పంపిణీ ద్వారా వచ్చిందని విశ్లేషకులు చెబుతారు.
కేవలం 33 అసెంబ్లీ సీట్లు ఉండి, స్వల్ప మెజారిటీలే సర్వసాధారణమైన పుదుచ్చేరిలో, పార్టీ విధేయత కంటే రంగస్వామి ఇమేజే ఎక్కువగా పనిచేస్తోంది. అయితే.. సీఎం సీటు విషయంలో బీజేపీ వైఖరితో ఆయన విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. పుదుచ్చేరిని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని కూడా కోరుతున్నారు. ఈ రెండు విషయాల్లోనూ బీజేపీ వైఖరి మారడం లేదు. ఈ క్రమంలో రంగస్వామి వయసును బీజేపీనాయకులు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం రంగస్వామి వయసు 78 ఏళ్లు. దీంతో సీఎం పదవిని తాము కోరుతున్నారు.
ఇక, ఈ ఎన్‌డిఎకు అనుకూలమైన విషయం ఏమిటంటే.. ప్రత్యర్థి డిఎంకె-కాంగ్రెస్ కూటమిలో కూడా కలహాలు జరుగుతున్నాయి. డిఎంకెకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు ఇద్దరే ఉన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ అగ్రస్థానాన్ని కోరుకుంటుండగా, దాని మిత్రపక్షం కేంద్రపాలిత ప్రాంతానికి "ద్రావిడ" నమూనాను విస్తరించాలని కోరుతోంది. మరోవైపు.. తమిళ రాజకీయాల ప్రభావం ఈ కేంద్ర పాలిత ప్రాంతంపై ఎక్కవగా కనిపిస్తోంది. సో.. మొత్తంగా 33 సీట్లే అయినా.. పోరు మాత్రం 330 సీట్లు అన్నట్టుగా ఉండడం గమనార్హం.
