Begin typing your search above and press return to search.

ట్రంప్ కు మూడింది.. అమెరికాలో తిరుగుబాటు మొదలైంది

రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ వివాదాల కేంద్రబిందువుగా మారారు.

By:  A.N.Kumar   |   18 Oct 2025 10:48 PM IST
ట్రంప్ కు మూడింది.. అమెరికాలో తిరుగుబాటు మొదలైంది
X

రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ వివాదాల కేంద్రబిందువుగా మారారు. “పాలనా సంస్కరణలు” పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు, వరుసగా జారీ చేస్తున్న వందలాది ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేపుతున్నాయి. ఆయన విధానాలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపిస్తూ అమెరికా వ్యాప్తంగా ‘నో కింగ్స్‌’ పేరుతో భారీ నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.

*నిరసనల ఉద్దేశం

“అమెరికాలో రాజులు లేరు” అనే నినాదంతో ఈ ఉద్యమం సాగుతోంది. ట్రంప్‌ పాలన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న పౌరులు, ఆయనను “అధికార దుర్వినియోగం చేస్తున్న నేత”గా అభివర్ణిస్తున్నారు. వలసదారుల హక్కుల పరిరక్షణ, ట్రాన్స్‌జెండర్‌ హక్కులు, పౌరసత్వ విధానాలు వంటి అంశాల్లో ఆయన తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ప్రజల్లో అసహనానికి దారితీశాయి.

* మస్క్‌ నేతృత్వంలోని ‘డోజ్‌’ వివాదం

ట్రంప్‌ ఆర్థిక సంస్కరణలలో భాగంగా ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “డోజ్‌” (DOJZ) ప్రాజెక్ట్‌ కింద వేలాది ఉద్యోగులను తొలగించారు. ఇది కార్మిక వర్గంలో తీవ్ర నిరసనలకు దారితీసింది. మరోవైపు, అక్రమ వలసలపై సోదాలు నిర్వహించడంలో జాతీయ బలగాల వినియోగం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తాయి.

* దేశవ్యాప్త ఆందోళనలు

అక్టోబర్‌ 18న ప్రారంభమైన ఈ ఉద్యమం యాభై రాష్ట్రాల్లో 2,500కిపైగా ప్రాంతాల్లో జరిగింది. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి “No Kings, Only Democracy” అంటూ నినాదాలు చేశారు. పలు యూరోపియన్‌ దేశాల్లోనూ ఈ ఉద్యమానికి మద్దతు లభించింది.

* రాజకీయ ప్రతిస్పందనలు

అమెరికా సెనెట్‌ నేత చక్‌ షుమెర్, సీనియర్‌ నేత బెర్నీ సాండెర్స్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. మరోవైపు, వైట్‌హౌస్‌ మాత్రం ఈ ఆందోళనలను “హేట్‌ అమెరికా క్యాంపెయిన్‌”గా ఖండించింది. ట్రంప్‌ స్వయంగా స్పందిస్తూ, “నేను రాజును కాదు, ప్రజాస్వామ్యానికి సేవకుడిని” అని వ్యాఖ్యానించారు.

* భద్రతా ఏర్పాట్లు

నిరసనల తీవ్రత దృష్ట్యా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను మోహరించారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లిపోవడం, లక్షలాది ఉద్యోగులు ప్రభావితమవడం కూడా ప్రజా ఆగ్రహాన్ని మరింత పెంచిన అంశమైంది.

ప్రజాస్వామ్య దేశంగా గర్వించే అమెరికాలో “నో కింగ్స్‌” ఉద్యమం ప్రజల అసంతృప్తికి ప్రతిరూపంగా నిలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకుంటున్న విధానాలు, నిర్ణయాలు ప్రజల్లో “అధికార దుర్వినియోగం” భావనను బలపరుస్తున్నాయి. ఈ నిరసనలు ఎటు దారితీస్తాయో చూడాలి కానీ, అమెరికా రాజకీయ దిశను మార్చే అవకాశం ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.