Begin typing your search above and press return to search.

ముంబై, విశాఖకు సముద్ర గర్భ కేబుల్... ఏమిటీ 'వాటర్ వర్త్' ప్రాజెక్ట్!

ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్లకు పైగా కేబుల్‌ ను ఏర్పాటుచేయనున్న సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   10 Oct 2025 7:00 PM IST
ముంబై, విశాఖకు సముద్ర గర్భ కేబుల్... ఏమిటీ వాటర్  వర్త్ ప్రాజెక్ట్!
X

ఫేస్‌ బుక్, ఇన్‌ స్టాగ్రామ్, వాట్సాప్‌ ల మాతృ సంస్థ మెటా... సిఫీ టెక్నాలజీస్‌ ను భారతదేశంలో ల్యాండింగ్ భాగస్వామిగా 5 మిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందం కింద చేర్చుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈ కేబుల్ ను భారత్ లోని ముంబయి, విశాఖపట్నంలో డాకింగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఇప్పటికే గూగుల్‌ భారత్‌ లో తన 400 మిలియన్‌ డాలర్ల బ్లూ-రామన్‌ సముద్రగర్భ కేబుల్‌ కోసం సైఫీతోనే ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో.. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రగర్భ కేబుల్‌ అయిన 'ప్రాజెక్ట్‌ వాటర్‌ వర్త్‌' కోసం మన దేశంలో రెండు నగరాలను ల్యాండింగ్‌ ప్రదేశాలుగా మెటా తాజాగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఈ కీలక ప్రాజెక్ట్‌ కోసం మెటా భారత్‌ లో తమ ల్యాండింగ్‌ భాగస్వామిగా సైఫీ టెక్నాలజీస్‌ ను నియమించుకున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది. అయితే... దీనిపై అటు మెటా గానీ, ఇటు సిఫీ టెక్నాలజీస్ గానీ ఇంతవరకూ స్పందించలేదు.

ఏమిటీ ప్రాజెక్ట్ వాటర్‌ వర్త్‌..?:

ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలను కలుపుతూ 50,000 కిలోమీటర్లకు పైగా కేబుల్‌ ను ఏర్పాటుచేయనున్న సంగతి తెలిసిందే. ఇది భూమి చుట్టుకొలత (40,075 కి.మీ) కంటే ఎక్కువ కాగా... భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల నేతలు ఈ ప్రాజెక్ట్‌ ను ప్రకటించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద, మెరుగైన సాంకేతికతతో ఏర్పాటుచేస్తున్న ఈ సముద్రగర్భ కేబుల్‌ కు నౌకల లంగర్లు, ఇతర ప్రమాదాల వల్ల ఇబ్బందిలేకుండా అధునాతన సాంకేతికత వినియోగించి 7,000 మీటర్ల లోతున బలంగా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత... స్థానిక టెలికాం ఆపరేటర్లు ఈ కేబుళ్లకు అనుసంధామై తమ వినియోగదారులకు ఇంటర్నెట్‌ ను అందిస్తుంటాయి.

ఇప్పటికే రంగంలోకి దిగిన జియో, ఎయిర్ టెల్!:

గత మూడేళ్లుగా సముద్ర గర్భ కేబుల్ రంగంపై ఆసక్తి పెరిగిన నేపథ్యంలో... ఇప్పటికే రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌ టెల్‌ వంటి దేశీయ దిగ్గజ సంస్థలు దీనిపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఈ సమయంలో.. వచ్చే 5-10 ఏళ్లలో మెటా కేబుల్‌ సిస్టమ్‌ భారత్‌ లో 10 బిలియన్‌ డాలర్ల వరకు పెట్టబడులు పెట్టే అవకాశం ఉందని కాలిఫోర్నియాకు చెందిన ఓపెన్‌ కేబుల్స్ సంస్థ వ్యవస్థాపకుడు సునీల్‌ తగారే అభిప్రాయపడ్డారు.

మరోవైపు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రకారం.. ప్రపంచ సముద్ర గర్భ కమ్యూనికేషన్ కేబుల్ మార్కెట్ 7.2% వార్షిక రేటుతో వృద్ధి చెందుతుందని.. 2023లో 27.57 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రంగం.. 2028 నాటికి ఇది 40.58 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది.

కాగా... భారతదేశ సబ్‌ సీ ల్యాండ్‌ స్కేప్ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారతీ ఎయిర్‌ టెల్ డిసెంబర్ 2024లో సీ-మీ-వ్యు 6 కేబుల్ వ్యవస్థను ప్రారంభించడంతో పాటు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పొడవైన సబ్‌ సీ కేబుల్ వ్యవస్థ అయిన 2 ఆఫ్రికా పెరల్స్ లో గణనీయమైన వాటాలను కలిగి ఉంది.

ఇదే సమయంలో... రిలయన్స్ జియో ఇండియా-ఆసియా-ఎక్స్‌ ప్రెస్, ఇండియా-యూరప్-ఎక్స్‌ ప్రెస్ నెట్‌ వర్క్‌ లను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రెండూ భారతదేశం మొత్తం సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయని భావిస్తున్నారు. అదే సమయంలో.. టాటా కమ్యూనికేషన్స్ టీజీఎన్-ఐఏ2 కేబుల్‌ ను కలిగి ఉండటంతోపాటు ఆసియా డైరెక్ట్ కన్సార్టియంలో పాల్గొంటుంది.