AI - రోబోటిక్ వార్ ఫేర్ .. మనుషులతో పని లేకుండా భవిష్యత్ యుద్ధాల తీరే వేరే లెవల్!
భవిష్యత్తులో దేశాల మధ్య జరిగే యుద్ధాల రూపురేఖలను రోబోటిక్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా శాసించనున్నాయనడంలో సందేహం లేదు.
By: Sivaji Kontham | 2 Oct 2026 11:00 PM ISTభవిష్యత్తులో దేశాల మధ్య జరిగే యుద్ధాల రూపురేఖలను రోబోటిక్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా శాసించనున్నాయనడంలో సందేహం లేదు. టెక్నాలజీ రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా అమెరికా రక్షణ రంగం తన వ్యూహాలను మార్చుకుంటోంది. ఇందులో భాగంగానే భవిష్యత్తు యుద్ధాలు - సాంకేతిక పరివర్తనలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అత్యున్నత స్థాయి సలహా కమిటీ అయిన `ప్రాజెక్ట్ మెరిడియన్`ను ఏర్పాటు చేసింది. స్పేస్‌ఎక్స్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నేతృత్వంలో కొనసాగనున్న ఈ ప్రాజెక్ట్.. అమెరికా సాయుధ బలగాలు భవిష్యత్తులో సాంకేతికంగా వెనుకబడిపోకుండా ముందే అప్రమత్తం చేసేందుకు దోహదపడుతుంది.
ప్రపంచ దేశాలైన అమెరికా, చైనా వంటి మహాశక్తులు భవిష్యత్ యుద్ధాల కోసం రోబోటిక్ - స్వయంప్రతిపత్త (అటానమస్) సాంకేతికతలపై ప్రత్యేకంగా అధ్యయనాలు చేస్తుండటానికి ఈ పరిణామాలే నిదర్శనం. పెంటగాన్ నాలుగు గోడలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ టెక్ దిగ్గజాలు, ఆటోనమస్ ఆయుధాల రూపకర్తలను రక్షణ వ్యూహాల్లోకి అమెరికా ఆహ్వానించింది. ఎలాన్ మస్క్‌తో పాటు `అండూరిల్ ఇండస్ట్రీస్` వ్యవస్థాపకుడు పాల్ లక్కీ వంటి వారు ఈ కమిటీలో భాగస్వాములుగా ఉన్నారు. పాల్ లక్కీకి చెందిన సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అధునాతన సైనిక వ్యవస్థల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే అమెరికా రక్షణ శాఖ `అటానమస్ వార్‌ఫేర్ కమాండ్` పేరుతో సరికొత్త కాంబాట్ కమాండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా జాయింట్ ఫోర్సెస్‌లో రోబోటిక్- ఆటోనమస్ సామర్థ్యాలను వేగంగా విస్తరించనున్నారు. అంతేకాకుండా భవిష్యత్ తరాల ఆటోనమస్ వారియర్ల కోసం ప్రత్యేక నియామక విధానాలను కూడా రూపొందించనున్నట్లు వెల్లడించారు. కేవలం మానవ బలంతో కాకుండా.. రోబోటిక్ టెక్నాలజీ .. ఏఐ ఆధారిత సైనిక వ్యూహాలే రాబోయే కాలంలో యుద్ధ రంగాలను శాసించబోతున్నాయని చెప్పడానికి ఈ పరిణామాలన్నీ స్పష్టమైన సంకేతాలుగా నిలుస్తున్నాయి. ఇక మస్క్ భవిష్యత్ యుద్ధాల తీరు తెన్నులను అధ్యయనం చేసే కమిటీని సమన్వయం చేస్తూ 120 రోజులలో రిపోర్ట్ ను అమెరికా ప్రభుత్వానికి అందజేస్తారు. టెక్నాలజీ దిగ్గజాలు భవిష్యత్ యుద్ధాల తీరుపై అధ్యయనం చేస్తున్న తీరు చూస్తుంటే హాలీవుడ్ సినిమాల్లో చూపించిన తీరుగానే రోబోటిక్ వార్ ఫేర్ ఎలా ఉండబోతోందో ఊహిస్తేనే గగుర్పాటుకు గురి చేస్తోంది.
రోబోటిక్ వార్ ఫేర్ అంటే?
రోబోటిక్ వార్‌ఫేర్ అంటే యుద్ధ రంగంలో మానవులకు బదులుగా రోబోట్లు, డ్రోన్లు, డ్రైవర్ రహిత వాహనాలు .. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత స్వయంప్రతిపత్త ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై పోరాడటం. సాధారణ యుద్ధాలలో సైనికులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతారు.. కానీ రోబోటిక్ వార్‌ఫేర్‌లో రిమోట్ ద్వారా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో స్వయంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాలు, మానవరహిత డ్రోన్లు యుద్ధ వ్యూహాలు అమలు చేయడం.. గస్తీ కాయడం.. దాడులు చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తాయి. దీనివల్ల యుద్ధ రంగంలో ప్రాణనష్టాన్ని తగ్గించుకోవడానికి.. సాంకేతికంగా పైచేయి సాధించడానికి దేశాలు ఈ విధానాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తున్నాయి. అయితే మానవ సైనికులను ఉపయోగించి యుద్ధాలు చేసే దేశాలు ఇలాంటి సమయంలో తీవ్ర ప్రాణనష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది చివరికి వన్ సైడ్ వార్ కి దారి తీసే ప్రమాదంగా మారుతుంది.
ఇన్ స్టాగ్రమ్ ఆడాళ్లకే అంటూ మస్క్ వ్యాఖ్యల దుమారం:
ఎలాన్ మస్క్ ఓవైపు అమెరికా వార్ ఫేర్ సాంకేతికత అభివృద్ధి, టీమ్ ల సమన్వయంలో బిజీగా ఉంటూనే.. తన ఇతర వ్యాపార సామ్రాజ్యాల్లోను పోటీకి తెర లేపుతున్నాడు. తాజాగా మస్క్ ఇన్‌స్టాగ్రామ్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఎక్స్ (X) వినియోగదారుడైన `గైగర్ క్యాపిటల్` తాను ఇన్‌స్టాగ్రామ్‌ను పూర్తిగా డిలీట్ చేసినట్లు పోస్ట్ చేస్తూ.. అది మహిళలకే ప్రత్యేకమైన యాప్ అని.. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని రాసుకొచ్చారు. దీనికి స్పందిస్తూ ఎలాన్ మస్క్ `ఇన్‌స్టాగ్రామ్ అమ్మాయిల కోసం` అని పేర్కొన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలే మస్క్ ఈ ఏడాది మే నెలలో కూడా చేశారు. సోషల్ మీడియా అలవాట్లు, ఆన్‌లైన్ ట్రెండ్స్‌పై వైరల్ అయిన ఒక థ్రెడ్‌కు సమాధానమిస్తూ ఆయన ఇదే వ్యాఖ్యను పునరావృతం చేశారు. అలాగే ఎవరైనా వయసు మీరిన మగవారు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైళ్లను తనకు పంపిస్తే వారు `జెండర్ మారుతున్నారా లేదా` అని ఆశ్చర్యపోతుంటానని ఎగతాళి చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో. చాలా మంది నెటిజన్లు మస్క్ వ్యాఖ్యలు లైంగిక వివక్షతో కూడినవిగా ఉన్నాయని మండిపడ్డారు. మస్క్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒక వినియోగదారుడు `అయితే ఎక్స్ (X) ఎవరి కోసం?` అని ప్రశ్నించగా.. మరొకరు `మరి ఎక్స్ సంగతేంటి?` అని నిలదీశారు. మరో వ్యక్తి స్పందిస్తూ తాను మస్క్ అభిప్రాయంతో ఏకీభవించనని.. ఇన్‌స్టాగ్రామ్ అనేది అన్ని లింగాల వారికి స్వాగతం పలికే వేదిక అని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం ఇన్‌స్టాగ్రామ్ అందరికోసం ఉద్దేశించినదే అని కామెంట్లు చేశారు.
